నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

నారా లోకేష్‌ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌

ఇటు చంద్రబాబు సుప్రీంలో వేసిన క్వాష్ పిటిషన్ అక్టోబర్ 3కు వాయిదా

ఇన్నాళ్లూ రాజకీయాల్లో పులిలా తిరిగిన చంద్రబాబు జైలు పాలయ్యారు.. బెయిల్ కోసం.. అసలు తన కేసుని కొట్టేయాలంటూ క్వాష్ పిటిషన్లతో అయన వకీళ్లు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మరోవైపు జగన్, తదితరులకు భయాన్ని పరిచయం చేస్తాను.. భయం మా బయోడేటాలోనే లేదు. ఒక్కొక్కరినీ అలా చేస్తా ఇలా చేస్తా అంటూ స్ట్రాంగ్ హెచ్చరికలు ఇచ్చిన లోకేష్ అరెస్ట్ భయంతో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు.


ఇక చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ కూడా సుప్రీం కోర్టు అక్టోబర్ మూడో తేదీకి వాయిదా వేసింది. టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపొందిన రాజధాని అమరావతిలో ఇన్నర్‌ రింగు రోడ్డు అలైన్మెంట్‌ లో అక్రమాలు జరిగాయని, తమవాళ్లకు లబ్ది చేకూర్చేందుకు దాని డిజైన్ మార్చేసారని ఆరోపిస్తూ జగన్‌ ప్రభుత్వం చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ, లోకేశ్, తదితరుల పై కేసు పెట్టింది. సీఐడీ దర్యాప్తు చేసున్న ఈ కేసులో ఈ కేసులో లోకేశ్‌ ఏ-14 గా ఉన్నారు.


ఈ అలైన్మెంట్‌ ఖరారులో అక్రమాలతో తమ కంపెనీ హెరిటేజ్‌ ఫుడ్స్‌ కోసం భూములను నారా లోకేష్‌ తీసుకున్నట్లు సీఐడీ గుర్తించింది. ఇంకా లింగమనేని రమేష్ కు చెందిన భూముల పక్కాగా రోడ్డు వెళ్లేలా డిజైన్ మార్చినందుకు ప్రతిగా కరకట్ట గృహాన్ని, భూములను సైతం చంద్రబాబు కుటుంబం తీసుకుందని సీఐడీ గుర్తించింది.


ఇదిలా ఉండగా ఈ కేసులో నారాయణ ముందస్తు బెయిల్‌ పొందారు. ఈ నేపథ్యంలో తనను అరెస్టు చేసే అవకాశం ఉండటంతో తనకు ముందస్తు బెయిల్‌ ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఇక లోకేష్ ఈనెల 29 నుంచి యువగళం పాదయాత్రకు సిద్ధం అవుతున్నారు.