విధాత : కష్టకాలంలో టీడీపీకి మద్దతుగా నిలిచేందుకు బీజేపీనీ కాదనుకున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, రాష్ట్రంలో సుపరిపాలనకు జనసేన-టీడీపీ అవసరమని అన్నారు. ఏపీలోకి కృష్ణాజిల్లా పెడనలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. ‘టీడీపీ ఆంధ్రప్రదేశ్‌లో బలమైన పార్టీ. సుపరిపాలనకు, అభివృద్ధికి టీడీపీ అవసరం. ఈ రోజు టీడీపీ కష్టకాలంలో ఉన్నది. మేం టీడీపీకి మద్దతు ఇస్తాం. ఈ పరిస్థితుల్లో టీడీపీకి యువరక్తం నిండిన జనసైనికులు కావాలి’ అని చెప్పారు.
2014 లో బీజేపీ మోడీ నాయకత్వంలో, ఆంధ్రకు బంగారు భవిష్యత్తు ఉండాలి అనే తాను మద్దతు ఇచ్చానని, తర్వాత జరిగిన పరిణమాల్లో కొంత మేర ఆంధ్ర ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని అన్నారు. ధర్మం దారి తప్పిన సమయంలో అదిశేషు ఏ విధంగా కాపాడుతాడో, అడ్డగోలుగా రాష్ట్రాన్ని దోచుకుంటున్న వైసీపీ బారి నుండి కాపాడటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షిగా టీడీపీ, జనసేన పార్టీలు వస్తాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో అడుగు పెట్టాలంటే వీసా తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను వైసీపీ ప్రభుత్వం పక్కదారి పట్టించడంలో కొత్త పుంతలు తొక్కిందని ఆరోపించారు.
కేంద్రం దగ్గర మాట్లాడే దమ్ము జగన్ దగ్గర లేదని విమర్శించారు. 151 మంది శాసన సభ్యులు, 20 మంది పైన ఎంపీలు ఉండి రాష్ట్రానికి ఏం సాధించారని ప్రశ్నించారు. ‘స్టీల్ ప్లాంట్ గురించి అడిగే ధైర్యం జగన్‌కు లేదు. అమిత్ షా దగ్గరకు వెళ్ళగానే ఎంతో దొంగ వినయంగా చేతులు పిసుకుంటూ నవ్వుతా ఉంటాడు కానీ మాట్లాడడు. నేను అధికారంలో లేకపోయినా అమిత్ షా దగ్గరకి వెళ్లి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు, స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడాను’ అని తెలిపారు.
ధర్మాన్ని రక్షించడానికి ప్రతి ఒక్కరూ ఆయుధం పట్టాల్సిన అవసరం లేదని, 2024 ఎన్నికలలో ఓటు అనే ఆయుధం ద్వారా జగన్‌ను ఇంటికే పరిమితం చేస్తూ టీడీపీ, జనసేన పార్టీలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలో తాను ఎయిర్‌పోర్ట్‌లో అడుగు పెట్టనీయకుండా మీకు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు? నేను డైరెక్ట్‌గా ఏసీబీ కోర్టుకు వెళుతున్నాను అని మీకు ఎవరు చెప్పారని పోలీసులను నిలదీశారు.
కాగా.. తన ఫ్లైట్ ల్యాండ్ అవనీయకుండా అడ్డుపడ్డ మీకు ఎవరు సమాచారం ఇచ్చారని ప్రశ్నించారు. ప్రధానమంత్రి తెలిసిన వ్యక్తి అయిన నాకు మీరు ఆంధ్ర బోర్డర్‌లో ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అందరికీ తెలిసిందేనని అన్నారు. పోలీసు అధికారులు వైసీపీ అనుకూలంగా వ్యవహరించవద్దని సూచించారు.