కేంద్ర నిధుల‌తో తిరుప‌తి అభివృద్ధి: పురందేశ్వ‌రి

  • Publish Date - November 1, 2023 / 05:17 AM IST
  • తిరుప‌తికి 1,695 కోట్లు కేటాయింపు
  • బీజేపీ ఏపీ చీఫ్‌ పురందేశ్వ‌రి వెల్ల‌డి



విధాత‌: తిరుప‌తిని స్మార్ట్ సిటీగా మార్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ద‌ని బీజేపీ ఏపీ చీఫ్‌ పురందేశ్వ‌రి చెప్పారు. తిరుప‌తికి అభివృద్ధికి రూ.1,695 కోట్లు కేటాయించిన‌ట్టు తెలిపారు. తిరుపతి పర్యటన కోసం బుధ‌వారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు పార్టీ నాయ‌కులు ఘన స్వాగతం పలికారు.


ఈ సంద‌ర్భంగా తిరుప‌తి రైల్వే స్టేష‌న్‌లో అభివృద్ధి ప‌నులు ఆమె ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతిని స్మార్ట్ సిటీగా గుర్తించి దాదాపు 87 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం రూ. 1,695 కోట్లు కేటాయించడం జరిగిందని తెలిపారు. ప్రధానమంత్రి ఆవాస యోజన కింద‌ పాతిక లక్షల ఇండ్లను రాష్ట్రానికి కేటాయిస్తే, ఒక తిరుపతికి 213 వేల ఇండ్ల‌ను కేంద్ర ప్రభుత్వం కేటాయించిందని గుర్తుచేశారు.


తిరుపతిని ఎడ్యుకేషనల్ హబ్ గా తీర్చిదిద్దేందుకు ఐఐటీ, ట్రిపుల్ ఐటీ, ఐసర్, కల్నరి యూనివర్సిటీపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిన‌ట్టు పురందేశ్వ‌రి చెప్పారు. కేంద్ర విద్యా సంస్థలు అన్నింటికీ 600 నుంచి 700 కోట్లు అవసరం ఉండగా, ఆ మొత్తాన్ని కేంద్రం అందిస్తున్న‌ద‌ని తెలిపారు.


చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై పురంధేశ్వరి స్పందించారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానాన్ని ముందు నుంచి వ్యతిరేకిస్తున్నామని, ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా, కేసుపై చంద్రబాబు వాదన వినకుండా సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారని పేర్కొన్నారు. చంద్రబాబుకు బెయిల్ రావడం స్వాగతిస్తున్నామని చెప్పారు.