స్టీల్ ప్లాంట్ తో రాయలసీమకు నవశకం : సీఎం చంద్రబాబు

కొత్త పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ తో రాయలసీమకు నవశకం మొదలైందని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత అవాంతరాలు, అడ్డంకులు, అవమానాలు దాటుకుని రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం అని, దశాబ్దకాలం నాటి స్టీల్ ప్లాంట్ నిర్మాణ కలను కూటమి ప్రభుత్వం వచ్చాక నేరవెరుస్తుందని తెలిపారు.

అమరావతి : కొత్త పరిశ్రమలు, స్టీల్ ప్లాంట్ తో రాయలసీమకు నవశకం మొదలైందని సీఎం చంద్రబాబు అన్నారు. విభజన తర్వాత అవాంతరాలు, అడ్డంకులు, అవమానాలు దాటుకుని రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం అని, దశాబ్దకాలం నాటి స్టీల్ ప్లాంట్ నిర్మాణ కలను కూటమి ప్రభుత్వం వచ్చాక నేరవెరుస్తుందని తెలిపారు. జమ్మలమడుగులో జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించిన అనంతరం చంద్రబాబు ప్రసంగించారు. రాయలసీమ అంటే ఇప్పుడు హార్టికల్చర్, అరుదైన ఖనిజాలు, సీమ అంటే స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్- రాయల్ ఎన్ ఫీల్డ్ అని, కియా కార్లు, హీరో బైక్ , డ్రోన్లు, ఫైటర్ జెట్లు, ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ అని, ఇకపై ఈ ప్రాంతం ఏమాత్రం కరువు నేల కాదు, జలకళ ఉట్టిపడే పచ్చని ప్రాంతంగా విరాజిల్లుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రత్రేక చొరవ

గత పాలకులు మోసపూరితంగా శంకుస్థాపనలు చేశారని, 2019లో ఓసారి, 2023లో మరోమారు శంకుస్థాపన, భూమి పూజలు చేశారని, ఐదేళ్ల కాలంలో శంకుస్థాపనలు తప్ప ఒక్క ఇటుక కూడా పేర్చలేదు. గడచిన రెండేళ్లలో చాలా అంశాల్ని పరిష్కరించి ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టాం, 1,100 ఎకరాల్లో రూ.16,350 కోట్ల పెట్టుబడితో రెండు దశల్లో ఉక్కు కర్మాగారం ఏర్పాటు అవుతుందని చంద్రబాబు తెలిపారు. మొదటి దశలో రూ.4 వేల కోట్లు, రెండో దశలో రూ.11,850 కోట్లు పెట్టుబడి పెడుతున్నారని, ఉక్కు రాష్ట్రం ఏపీ, విశాఖతో పాటు రాయలసీమగా ఉక్కు ప్రాంతంగా తయారవుతుందన్నారు. స్టీల్ ప్లాంట్ తో పాటు సోలార్ ఎనర్జీ క్యాప్టివ్ ప్లాంట్ ను జేఎస్ డబ్ల్యూ ఏర్పాటు చేస్తోందని, పూర్తిగా గ్రీన్ ఎనర్జీతో వ్యర్ధాల నుంచి వచ్చిన ఇనుము సేకరించి ఉక్కు ఉత్పత్తి చేస్తారని తెలిపారు. విశాఖ ఉక్కు సంక్షోభంలో ఉన్నప్పుడు కేంద్రంతో మాట్లాడి రూ.11,440 కోట్ల ఆర్ధిక సాయం తెచ్చి కాపాడాం అని, నక్కపల్లిలోనూ ఆర్సెలార్ మిట్టల్ రూ.1.35 లక్షల కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తోందని, జేఎస్ డబ్ల్యూ కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీల్లో రూ.1 లక్ష కోట్ల పెట్టుబడులు పెట్టారని, రాయలసీమ ప్లాంట్ బళ్లారి ప్లాంట్ కంటే అధిక సామర్ధ్యంతో పనిచేయాలని జేఎస్ డబ్ల్యూను కోరుతున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.

ప్లాంట్ కు గండికోట నీళ్లు

గండికోట నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీల నీటిని కూడా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు అందిస్తామని, రాయలసీమ ప్రాంతంలో అత్యంత నాణ్యమైన ముడి ఇనుము ఖనిజాన్ని కూడా సరఫరా చేసేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, రోడ్డు, రైలు, పోర్టు కనెక్టివిటీ కూడా రాయలసీమ స్టీల్ ప్లాంట్ కు ఏర్పాటు చేస్తాం అని చంద్రబాబు భరోసా ఇచ్చారు. రాయలసీమకు ఎవరివల్ల నష్టం జరిగిందో ప్రజలు గమనించాలని కోరుతున్నానని, జేఎస్ డబ్ల్లూ ప్లాంట్ తో ఈ ప్రాంతంలో సామాజికంగా ఆర్ధికంగా ప్రభావం ఉంటుందని, గతంలో కియా ప్లాంట్ తీసుకువచ్చాను. అన్ని దేశాలకు ఆ సంస్థ కార్లను ఎగుమతి చేస్తోందని తెలిపారు. కియా కార్ల పరిశ్రమతో అనంతపురం దశాదిశ మారిందన్నారు. కొందరు స్వార్థపరులు గతంలో కేవలం సొంత ప్రయోజనాల కోసమే పనిచేసి అక్రమాలు చేశారని, ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి కడప జిల్లాకు, రాయలసీమకు ఏమీ చేయలేదు. 2007లో 14 వేల ఎకరాలను బ్రహ్మణీ స్టీల్స్ కు భూములు ఇచ్చి భ్రమలు కల్పించాని, ఎయిర్ పోర్టు కడతామని అన్నారు. ఇప్పటి వరకూ అదీ జరగలేదని, ఓబులాపురం గనుల పేరు చెప్పి దోపిడీ చేశారు. స్మగ్లింగ్ చేసి విదేశాలకు ఎగుమతి చేశారని విమర్శించారు. దేశానికి ఉపయోగపడాల్సిన సంపద విదేశాలకు తరలిపోయింది. తప్పు చేసిన వ్యక్తులు జైలుకు వెళ్లారన్నారు.

సీమ సంపద ఈ ప్రాంత ప్రగతికే దక్కాలి..

రాయలసీమకు చెందిన సంపద ఈ ప్రాంతంలోనే ఉపయోగపడాలని, ఇక్కడి ముడి ఇనుముతో ఇక్కడే ఉక్కు తయారు అవ్వాలని, ఇక్కడ ఏర్పాటు చేసే ప్లాంట్లతో స్థానికంగానే ఉద్యోగాలు కల్పించేలా చర్యలు చేపడతాం అని చంద్రబాబు తెలిపారు. రూ.11 లక్షల పెట్టుబడులు ఇప్పటికే రాష్ట్రానికి వచ్చాయి. 9 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని, రాష్ట్రానికి చెందిన యువత మరెక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. రెండేళ్లలో జేఎస్‌డబ్ల్యూను ఒప్పించి, అనుమతులు తెప్పించి స్టీల్ ప్లాంట్ పనులు ప్రారంభించాం, వచ్చే రెండేళ్లలోనే ఈ పరిశ్రమలో ఉత్పత్తి కూడా ప్రారంభం అవుతుందని స్పష్టం చేస్తున్నానని చెప్పారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ఇదే సమయానికి వచ్చి ఈ ఉక్కు పరిశ్రమను ప్రారంభిస్తాం అని, గత పాలకులు రాయలసీమలో ఒక్క ఎకరాకూ నీళ్లు ఇవ్వలేక పోయారు. గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ త్వరలోనే ఇస్తాం. సాగునీరు, తాగునీటి అవసరాలు తీరుస్తాం అన్నారు. అవుకు టన్నెల్ పూర్తి చేసి పులివెందులలో చీని తోటలు కూడా బ్రతికించాం, ఎర్రబెల్లి చెరువుకు నీళ్లు ఇచ్చి రైతుల కష్టాలు తీర్చాం, సీమలో స్పేస్, ఏరో స్పేస్, డిఫెన్సు, డ్రోన్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, రెన్యూవబుల్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు వస్తాయి అని వెల్లడించారు. తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేసే స్పేస్ సిటీలో, డ్రోన్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు జేఎస్ డబ్ల్యూ ముందుకు వచ్చిందని, హార్టికల్చర్ కారణంగా ఇక్కడి లింగాల మండలంలో రాష్ట్రంలోనే అత్యధిక తలసరి ఆదాయం ఉందన్నారు. ఆగస్టు 15 నాటికి గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌కు మదనపల్లిలో శంకుస్థాపన చేస్తాం అని, ప్రభుత్వం తరపున రూ.40 వేల కోట్లు, ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్ల పెట్టుబడులు వచ్చేలా చూస్తాం అని చంద్రబాబు తెలిపారు. అమెరికాలో ఉన్న గ్రాండ్ కాన్యాన్ కు ధీటుగా మన గండికోటను అభివృద్ధి చేస్తాం అని, హార్టికల్చర్ పంటలతో భూములకు మరింత విలువ పెరుగుతుంది. మన పల్లెలు సంపదకు కేంద్రం అవుతాయని పేర్కొన్నారు.

రాజధానిపై వైసీపీకి గందరగోళం..

విధ్వంసమే గొడ్డలి పార్టీకి అజెండా అని, వారికి విశ్వసనీయతే లేదు అని చంద్రబాబు మండిపడ్డారు. నిన్న మావిగన్ అన్నారు. నేడు విజయవాడ అంటున్నారని, మతిస్థిమితం లేని వ్యక్తులు రాజకీయం చేస్తున్నారని, నమ్మకంతో, విశ్వాసంతో పాలన అందిస్తున్నాం కాబట్టే పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆత్మాభిమానంతో ఆటలు ఆడుకోవద్దని చెబుతున్నానని, గత పాలనలో మన రాజధాని ఏమిటో ఎక్కడుందో కూడా చెప్పలేని పరిస్థితి అని, మూడు ముక్కల ఆటతో రాష్ట్రాన్ని, ప్రజల్ని తీవ్రంగా నష్ట పరిచారని, ప్రజలంతా గర్వపడే విధంగా కాలరెత్తుకుని చెప్పే విధంగా అమరావతిని అభివృద్ధి చేస్తాం అన్నారు. హింస, నేరాలతో రాజకీయాలు చేయకూడదు. ప్రజల కోసం బాధ్యతగా చేయాలని, విజయవాడ యువకుడి అదృశ్యం ఘటనను కూడా రాజకీయం చేసేలా వైసీపీ వ్యవహరిస్తోందని, పోలీసులు ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తారు. ప్రజల శాంతిభద్రతల విషయంలో జాగ్రత్తగా ఉంటారన్నారు. గంజాయి బ్యాచ్ విషయంలో కఠినంగా ఉండాలని ఆదేశించాను. మా హయాంలో శాంతిభద్రతలకే పెద్ద పీట వేస్తున్నామన్నారు.

రూ.50వేల కోట్ల పెట్టుబడులు: జిందాల్ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్

జేఎస్ డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనుల్ని ప్రారంభించిన అనంతరం ప్రసంగించిన జిందాల్ గ్రూప్ చైర్మన్ సజ్జన్ జిందాల్ మాట్లాడారు. ఏడాదికి 1 మిలియన్ టన్నుల సామర్ధ్యంతో నిర్మితం అవుతున్న రాయలసీమ స్టీల్ ప్లాంట్ ను మరింతగా విస్తరిస్తాం అని తెలిపారు. ఈ స్టీల్ ప్లాంట్ నిర్మాణంతో స్థానిక యువతీ యువకులకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయి అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంటి విజన్ ఉన్న నాయకులు దేశంలో చాలా అరుదుగా ఉన్నారన్నారు. ఆయన వచ్చే 25 ఏళ్లలో చేయాల్సిన అభివృద్ధి గురించి ఆలోచన చేసి అమలు చేస్తారని, సీఎం చంద్రబాబు చేసిన విజన్ వల్లే ఉమ్మడి ఏపీలో సైబరాబాద్ నగరం ఐటీ హబ్ గా ఎదిగిందని పేర్కొన్నారు. దేశాభివృద్ధి గురించి నిత్యం ఆలోచించే చంద్రబాబు లాంటి నేతలతో కలిసి పనిచేయటం పారిశ్రామిక వేత్తగా నాకు గౌరవం అన్నారు.  ప్రధాని మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని, చంద్రబాబు లాంటి సీఎంలు ఉంటే మరింత వేగంగా లక్ష్యాలను అందుకోగలం అన్నారు. ఇవాళ రాయలసీమ స్టీల్ ప్లాంట్, ఎనర్జీ ప్లాంట్‌తో పాటు విజయనగరం జిల్లాలో పారిశ్రామిక పార్కును ఏర్పాటు చేస్తున్నాం అని తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ గ్రూప్ తరపున దాదాపు రూ.50 వేల కోట్ల మేర పెట్టుబడులు పెడతాం, ఈ పెట్టుబడులతో 50 వేల మందికి ఉద్యోగాలు వస్తాయి అని వెల్లడించారు. ఇక్కడ తయారు చేసే ఉక్కు, ఇంధనం రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామన్నారు.

Latest News