విధాత: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఆలోచనలు, ఆశయాలకు ప్రతిబింభంగా రాష్ట్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు.
రాజకీయాలు అంటే ఎత్తులు పై ఎత్తులు కాదని, మానవత్వంతో కూడిన పాలన అందించాలని నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి భావించారన్నారు. విజయవాడకు చెందిన ఉత్తమ అధ్యాపక అవార్డు గ్రహీత, రిటైర్డ్ ప్రిన్సిపాల్ అచార్య గాజులపల్లి రామచంద్రారెడ్డి రచించిన ‘ది ఓన్లీ వన్ హీరో జగన్’ జగన్ పుస్తకాన్ని శుక్రవారం విజయవాడలోని ఓ హోటల్ లో నిర్వహించిన కార్యక్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆవిష్కరించారు.
అట్టడుగు వర్గాలను సైతం ఉన్నతులుగా ఎదిగే లా చేయడమే కాకుండా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆదర్శప్రాయంగా ఎలా ఉండాలో వైయస్ నిరూపించారన్నారు. యువ నాయకుడు,ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి పెద్ద వయస్సులో కూడా రామచంద్రారెడ్డి పుస్తకం రాయడం అభినందనీయమని ఆయన అన్నారు. పుస్తకం తొలికాపీని మాజీ కేంద్ర మంత్రి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుకు అందచేశారు.
అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ వైయస్ రాజశేఖరరెడ్డి తనను నమ్మినవారికోసం ఎందాకైనా వెళ్తారని చాటి చెప్పారన్నారు. పాదయాత్ర తర్వాత వైయస్ రాజశేఖరరెడ్డి ఋషిలా మారి సమాజం హితం కోసం మానవత్వంతో కూడిన పాలన ఎలా ఉండాలో తాను ఉన్న ఐదేళ్లలో తన పరిపాలన ద్వారా నిరూపించారన్నారు. అందుకే ఆయన నేడు లేకపోయినా….12 సంవత్సరాలు గడిచినా ఆయన గురించి ప్రజలందరూ చెప్పుకుంటున్నారని తెలియచేశారు. ప్రజలతో మమేకైన నేత ఎలా ఉండాలో చూపిన వైయస్ రాజశేఖరరెడ్డి గొప్పతనం గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారన్నారు. ఆయన పాలన సువర్ణక్షరాలతో లిఖించబడిందన్నారు. అలాంటి మహనీయునిపై నేడు కొన్ని వర్గాలు దుష్ప్రచారం సాగిస్తున్నాయన్నారు.
నేడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సైతం ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని, నేడు ఈ స్థాయికి వచ్చారన్నారు. వైయస్ జగన్ సైతం తండ్రి కంటే ప్రజలకు మరింత మేలు చేయాలనే తపనతో నిరంతరం పనిచేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటనా స్వేచ్చను,వాక్ స్వాతంత్యాన్ని అడ్డుపెట్టుకుని కొన్ని వర్గాలు దుష్ప్రచారం చేస్తున్నా, వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నా దానిని ప్రజాస్వామ్యంలో వైరుధ్యం అనుకోవాలో,అదొక వింత అనుకోవాలో తెలియడం లేదు. ప్రజలను తప్పుదోవ పట్టించే శక్తులు చాలా శక్తివంతంగా ఉన్నాయి. వాటికి తోడు కొన్ని వ్యవస్ధలు కూడ అదే పనిగా దుష్ప్రచారం సాగిస్తున్నాయి.ఇలాంటి స్దితిలో ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలి.రాష్ర్టానికి ఈ సమాజానికి అవసరమైన నేత అయిన వైయస్ జగన్ ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.
అధికారం అనేది అనుభవించడానికి కాదు సేవ చేసేందుకు అని భావించి, నవరత్నాలను అమలు చేయడంలో అధికార యంత్రాంగాన్ని వైయస్ జగన్ పరుగులు పెట్టిస్తున్నారన్నారు. ప్రజల సొమ్ము ప్రతి పైసా ప్రజలకే చేరేలా సంక్షేమం,అభివృద్ధే ధ్యేయంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారన్నారు.
రచయిత గాజులపల్లి రామచంద్రారరెడ్డి మాట్లాడుతూ యువకుడు, ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొని, జనంతో మమేకమై, చారిత్రాత్మక విజయం సొంతం చేసుకున్నఘనత వైయస్ జగన్ కు దక్కుతుంది. పేదల సంక్షేమం కోసం, అభివృద్ధికోసం నిరంతరం పరితపిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ’ఓన్లీ వన్’ హీరోగా భావించి, అనేక అంశాలను ప్రస్తావిస్తూ 500 పేజీలతో పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. ఈ పుస్తకంలో ఆయన జీవితంలోని అనేక ఘటనలను ప్రస్తావించినట్లు తెలియచేశారు.
ఈ సభకు ఆర్టీఐ మాజి కమిషనర్ పువ్వా విజయబాబు అధ్యక్షత వహించగా,విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ ఛైర్మన్ పూనూరు గౌతంరెడ్డి,స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ సలహాదారులు చల్లా మధుసూధన్ రెడ్డి,నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధి పండుగాయల రత్నాకర్, ఏపీ అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, వైఎస్సార్‌సీపీ తూర్పునియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్, మైనార్టీ ఫైనాన్స్ కార్పోరేషన్ ఛైర్మన్ షేక్ ఆసీఫ్ తదితరులు సభలో పాల్గొన్నారు.