సంక్రాంతి శోభతో పులకించిన నారావారి పల్లె
చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెకు సంక్రాంతి శోభ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం సంబరాలతో పులకించింది

– చంద్రబాబు స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు
– నారా-నందమూరి కుటుంబాల సందడి
– ప్రత్యేక ఆకర్షణగా రంగవల్లుల పోటీలు
– భోగి మంటల్లో ప్రజావ్యతిరేక జీవో కాపీలు దహనం
విధాత: చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లెకు సంక్రాంతి శోభ వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్వగ్రామం సంబరాలతో పులకించింది. నారా భువనేశ్వరి, మనవడు దేవాన్ష్, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, చిన్న కుమార్తె తేజస్విని, నందమూరి రామకృష్ణ, కంఠమనేని శ్రీనివాస్, లోకేశ్వరి, ఇందిరతో పాటు ఇతర కుటుంబ సభ్యులు తరలిరాగా, గ్రామం కోలాహలంగా మారింది. ఆదివారం ఉదయమే గ్రామస్థులతో కలసి కుటుంబ సభ్యులు భోగి మంటలు వెలగించారు. వైసీపీ ప్రజా వ్యతిరేక జీవో కాపీలను మంటల్లో దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రామంలోని మహిళలకు రంగవల్లుల పోటీలు నిర్వహించారు. విజేతలకు నారా-నందమూరి కుటుంబ సభ్యులు బహుమతులు అందజేశారు.
వేడుకల నేపథ్యంలో నారావారిపల్లెకు సందర్శకుల తాకిడి అధికంగా ఉంది. ఇందుకోసం పార్కింగ్, భోజన వసతి సదుపాయాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. సాయంత్రం వేడుకలకు నారా చంద్రబాబు, లోకేశ్ హాజరుకానున్నారు. కాగా నారా-నందమూరి కుటుంబ సభ్యలు శుక్రవారమే గ్రామానికి చేరుకోగా, గ్రామస్థులు అపూర్వ స్వాగతం పలికారు. శనివారం కుటుంబసభ్యులంతా సమీపంలోని కల్యాణి జలాశయానికి వెళ్లి గంటపాటు సరదాగా గడిపారు. అనంతరం కట్ట దిగువన ఉన్న ఆంజనేయ స్వామి ఆలయంలో పూజలు చేశారు. మూడు రోజుల పాటు నారావారిపల్లెలో జరిగే సంక్రాంతి వేడుకల్లో నారా-నందమూరి కుటుంబసభ్యులు, గ్రామస్థులు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు సందడి చేయనున్నారు.