Snails Attack On Crops | ఏనుగులను ఎదురొడ్డారు..నత్తలకు భయపడుతున్నారు: మన్యం రైతుల వింత సమస్య
మన్యం రైతులు ఏనుగులు, నత్తల దాడుల వలన పంట నష్టం, అధికారుల చర్యలు కావాలి, రైతులు సహాయం కోరుతున్నారు.

విధాత: పార్వతీపురం మన్యం జిల్లా వాసులకు, రైతులకు ఏనుగుల గుంపుల దాడులను ఎదుర్కోవడం తరుచు సాధారణమైన పరిస్థితి. ఆకలితో ఆవేశంతో పంట పొలాలపైన, ఊర్లపైన పడే గజరాజులను తరిమేసి పంటలను కాపాడుకునే మన్యం రైతులు ఇటీవల చిరు ప్రాణులైన నత్తలకు భయడుతుండటం ఆశ్చర్యంగా మారింది. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలంలో ఇటీవల కాలంలో పెరిగిపోయిన నత్తల దండయాత్ర సమస్యను ఎదుర్కోవడంలో సతమతమవుతున్నారు. మండలంలోని గ్రామాల్లో ఇళ్లలో, పంట చేనుల్లో, రోడ్ల మీద, తోటల్లో ఎటు చూసిన నత్తలే కనిపిస్తుండటం సమస్య తీవ్రతను చాటుతుంది. గంగిరేవువలస, గదబవలస, రావికర్రవలస తదితర గ్రామాల్లో తెల్లవారి నిద్రలేచే సరికి ఇళ్లలో, పొలాల్లో నత్తలే కనిపిస్తుండటంతో వాటిని నిర్మూలించలేక అవస్థలు పడుతున్నారు. పొద్దున లేచింది మొదలు నత్తలను ఏరడం, బతికున్న నత్తల నిర్మూలనకు వాటిపై ఉప్పు చల్లడం వంటి పనులతోనే సరిపోతుందంటూ వాపోతున్నారు.
గ్రామాల్లోని బొప్పాయి, జామ, వక్క మొక్కలపైన, దొండ, బెండ వంటి కూరగాయల మొక్కలపైన ఎక్కడ చూసినా నత్తలే కనిపిస్తూ వాటి ఆకులు, కాండాలు, పండ్లను తినేస్తున్నాయి. దీంతో లక్షల్లో పంట నష్టం పాలవుతున్నామని రైతులు వాపోతున్నారు. పొలాల్లోని పంటల రక్షణకు ఉపయోగించే సామాగ్రీ, షీట్లు, సాగు పరికరాలపై కూడా నత్తలే దర్శనమిస్తున్నాయి. పొలాలు, చెట్లు, రోడ్లు ఎక్కడా చూసిన నత్తలు లేని ప్రదేశం లేదు. ఇంతకు ఇంత పెద్ద ఎత్తున మిడతల దండు మాదిరిగా నత్తల దండు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తే కేరళలో చిత్తడి నేలల్లో పెరిగే వక్క మొక్కలను దిగుమతి చేసుకున్నప్పుడు వాటిపై లార్వాతో కొమరాడ మండలంలో నత్తల సంతతి వృద్ధి చెందిదని తెలుస్తుంది. ఇక్కడి చిత్తడి నేలలు కూడా నత్తల జీవనానికి అనుకూలంగా ఉండటంతో నత్తలు పెరిగిపోయాయని రైతులు చెబుతున్నారు. నత్తల నివారణకు గడ్డ ఉప్పు వాడాలని అధికారులు చెబుతున్నారు. కానీ ఎకరా పొలానికి 3 క్వింటాళ్ల ఉప్పు అవసరం కావడంతో రైతులు వెనకడుగు వేస్తున్నారు. దీనికి తోడు లవణం భూమిలోకి వెళ్తే నేలసారం తగ్గుతుందని వాపోతున్నారు. నత్తలను ఏరాలన్నా కూలీలు కొరత, ఖర్చుల సమస్యలు ఉండటంతో రైతులకు ఏం చేయాలో తోచడం లేదు. నత్తల నిర్మూలనకు ఉప్పు చల్లడం ప్రక్రియతో నిత్యం తిప్పలు పడుతున్నామని..ప్రభుత్వం నత్తల నిర్మూలన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.