తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను నిలుపుదల చేయండి
ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడండి…కె ఆర్ ఎం బి నూతన చైర్మన్ ఎంపీ సింగ్ కు విజ్ఞప్తి చేసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు. విధాత:శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన అనుమతులు లేకుండా చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను నిలుపుదల చేసి ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడాలని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో జలసౌధ ఆవరణలో ఉన్న కృష్ణా నదీ యాజమాన్య […]

ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడండి…
కె ఆర్ ఎం బి నూతన చైర్మన్ ఎంపీ సింగ్ కు విజ్ఞప్తి చేసిన సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు.
విధాత:శ్రీశైలం ఎగువ భాగాన తెలంగాణ ప్రభుత్వం ఏ విధమైన అనుమతులు లేకుండా చేపడుతున్న కొత్త ప్రాజెక్టులను నిలుపుదల చేసి ఆంధ్ర రైతుల నీటి హక్కులను కాపాడాలని ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో జలసౌధ ఆవరణలో ఉన్న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయం లో నూతన చైర్మన్ ఎంపీ సింగ్ గారిని సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు,కృష్ణా తూర్పు డెల్టా ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ గుత్తా శివరామకృష్ణ,నాగార్జునసాగర్ ఎడమ కాలువ ప్రాజెక్టు కమిటీ మాజీ చైర్మన్ యనమద్ది పుల్లయ్య చౌదరి,రాష్ట్ర సమాఖ్య కార్యనిర్వాహక కార్యదర్శి తుమ్మల లక్ష్మణరావు, కార్యవర్గ సభ్యులు జంగా చెంచు రెడ్డి తదితరులు కలిసి పూర్తి వివరాలతో వినతిపత్రం స్వయం గా సమర్పించి ఆంధ్రా రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.
ఇదే విషయమై ఈరోజు సాయంత్రం విజయవాడలోని రాష్ట్ర సమాఖ్య కార్యాలయంలో అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాల కృష్ణారావు పత్రికా ప్రతినిధులతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా శ్రీశైలం ఎగువ భాగాన చట్టబద్ద సంస్థలు అయిన సిడబ్ల్యుసి, కె ఆర్ ఎం బి, ఎపేక్స్ కౌన్సిల్ నుంచి ఏ విధమైన అనుమతులు లేకుండా 105 టిఎంసిల తో విస్తరణ 150 టీఎంసీల తో కొత్త ప్రాజెక్టులు కలిపి మొత్తం 255 టీఎంసీలతో ప్రాజెక్టులు చేపడుతుందని ఇవి పూర్తయితే ఆంధ్రప్రదేశ్ లో శ్రీశైలం దిగువ భాగాన ఉన్న నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 15 లక్షల ఎకరాల ఆయకట్టు,కృష్ణా డెల్టా క్రింద 13 లక్షల ఎకరాల ఆయకట్టు,ఎస్ ఆర్ బి సి కింద 2 లక్షల ఎకరాల ఆయకట్టు మొత్తం 30 లక్షల ఎకరాల ఆయకట్టు బీడు భారటం ఖాయమని అట్లాగే వీటిపై 2016లో మేము సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ వేయగా పాలమూరు రంగారెడ్డి రెండు ప్రాజెక్టులు కొత్తవే అని కేంద్ర ప్రభుత్వం ఆఫిడవిట్ ఇచ్చిందని,అట్లాగే శ్రీశైలం దిగువ భాగాన ఆంధ్రప్రదేశ్ కు 385 టిఎంసిలు, తెలంగాణకు 121 టీఎంసీలు వాడుకునే హక్కు ఉండగా తెలంగాణ ప్రభుత్వం చట్టవిరుద్ధంగా,మూర్ఖత్వంగా విద్యుత్ ఉత్పత్తి చేసి సముద్రంలోకి సాగునీరు వదిలి వేస్తుందని ఈ విపత్కర పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ అక్రమ ప్రాజెక్టులను వెంటనే నిలుపుదల చేసి ఉమ్మడి జలాశయాలను కె.ఆర్.ఎం.బి పరిధిలోకి తీసుకొని సిఐఎస్ఎఫ్ దళాలతో నిఘా పెట్టి నీటి యాజమాన్యం నిర్వహించాలని, తెలంగాణ చేస్తున్న విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలుపుదల చేయాలని కె ఆర్ ఎం బి చైర్మన్ కు పూర్తి వివరాలతో స్వయంగా వినతి పత్రం సమర్పించి వివరించినట్లు ఆయన తెలిపారు.
దీనిపై కె ఆర్ ఎం బి చైర్మన్ స్పందిస్తూ రాబోవు సమావేశాలలో ఈ విషయాలను లోతుగా చర్చించి ఆంధ్రప్రదేశ్ రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు అని తెలిపారు.ఈ వినతి పత్రం సమర్పించిన వారిలో సమాఖ్య ప్రధాన కార్యదర్శి పొత్తూరి రామాంజనేయ రాజు (పశ్చిమ గోదావరి జిల్లా),సంయుక్త కార్యదర్శి జాగర్లమూడి అనిల్ బాబు (ప్రకాశం జిల్లా),అంకాళ్ళ ప్రభుదాసు (గుంటూరు జిల్లా) తదితరులు ఉన్నారు.
MoreUpdates:ముఖ్యమంత్రి ఉద్యోగులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి..పరుచూరి అశోక్ బాబు