విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా పడింది. శుక్రవారం క్వాష్ పిటిషన్‌పై బాబు తరుపు న్యాయవాది సిద్ధార్ద లూధ్రా, సీఐడీ తరుపు న్యాయవాది ముకుల్ రోహత్గిలు 17ఏ చుట్టు పోటాపోటీగా తమ వాదనలు వినిపించారు. ఇరువైపు ల సుదీర్ఘంగా సాగిన వాదనలు విన్న జస్టిస్ అనిరుద్ధ బోస్, బేలా ఎం.త్రివేదిల ధర్మాసం తదుపరి విచారణను 17వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు వాయిదా వేసింది. అటు ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను విచారణను కూడా అదే రోజుకు వాయిదా వేసింది.
ఫైబర్ నెట్ కేసులోని ముగ్గురికి ముందస్తు బెయిల్, ఇద్దరికి రెగ్యులర్ బెయిల్ వచ్చిందని, మా క్లయింట్‌కు ఎందుకు బెయిల్ ఇవ్వకూడదంటూ బాబు న్యాయవాది లూద్రా వాదనలు వినిపించారు. బాబును సోమవారం ఏసీబీ కోర్టులో హాజరుపరుచాల్సివుందని, అప్పుడు ముందస్తు బెయిల్ నిరర్ధకమంటూ వాదించారు. ఈ కేసులోను 17ఏ ప్రస్తావన ఉండటం, దీనిపై వాదనలు మంగళవారం కూడా కొనసాగాల్సివున్నందునా అప్పటిదాకా చంద్రబాబును అరెస్టు చేయవద్దని చెప్పండని సీఐడీ న్యాయవాది ముకుల్ రోహత్గీకి న్యాయమూర్తులు సూచించారు. ఏసీబీ కోర్టుల ఫైబర్ నెట్ కేసును బుధవారానికి వాయిదా వేయాలని సమాచారమిస్తామని రోహత్గీ కోర్టుకు తెలిపారు.
అంగళ్లు అల్లర్ల కేసులో హైకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అంగళ్లు ఘటనలో అన్నమయ్య జిల్లా ముదివేడు పోలీసులు తనపై పెట్టిన కేసులో ముందస్తు బెయిల్ దాఖలు చేసిన బాబు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ పిదప ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. లక్ష పూచికత్తు సమర్పించాలని ఆదేశించింది. ఇదే కేసులోని ఇతర నిందితులందరికి బెయిల్ మంజూరైన నేపధ్యంలో బాబు తరపు న్యాయవాదుల వాదనలను విన్న హైకోర్టు చంద్రబాబుకు కూడా ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. మరోవైపు చంద్రబాబు అరెస్టుకు ముందు, అరెస్టు సందర్భంగా, తర్వాతా సీఐడీ అధికారుల కాల్‌డేటా రికార్డులు ఇవ్వాలని కోరుతూ బాబు న్యాయవాదులు వేసిన పిటిషన్ విచారణను విజయవాడ ఏసీబీ కోర్టు ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది.
కోడి కత్తి కేసులో జగన్ పిటిషన్‌పై విచారణ వాయిదా
విధాత :కోడి కత్తి కేసులో సీఎం జగన్ వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ ఈనెల 17వ తేదీకి వాయిదా పడింది. విశాఖ విమానాశ్రయంలో తనపై కోడికత్తితో దాడి ఘటనలో లోతైన దర్యాప్తు కోసం చేసిన అభ్యర్థనను ఎన్‌ఐఏ కోర్టు తిరస్కరించడాన్ని జగన్ హైకోర్టులో సవాలు చేశారు. ఈ కేసులో జగన్ పిటిషన్‌కు నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీిని ఆదేశించిన కోర్టు కేసు విచారణను 17వ తేదీకి వాయిదా వేసింది. కాగా ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ రిమాండ్ను ఈ నెల 27వరకు విశాఖ ఎన్‌ఐఏ ఏడీజే కోర్టు పొడగించింది. శుక్రవారం శ్రీనివాస్‌ను కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా జడ్జీ ముందు శ్రీనివాస్ తన న్యాయవాదితో నన్ను మాట్లాడనివ్వడం లేదని, ఐదేళ్లుగా పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని వాపోయారు.