చంద్ర‌బాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం తీర్పు రిజర్వ్

  • Publish Date - October 17, 2023 / 11:55 AM IST
  • బెయిల్ పిటిషన్ల విచారణ వాయిదా


విధాత : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ అనిరుద్దబోస్‌, జస్టిల్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం బాబు పిటిషన్‌పై వాదనలు ముగిశాయి.


ఏపీ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ, చంద్రబాబు తరుపున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. 17ఏ ఈ కేసులో వర్తిస్తుందా లేదా అన్నదానిపైనే ప్రధానంగా వాదనలు కొనసాగాయి.


ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. బాబు న్యాయవాది సిద్ధార్ధ్ లూధ్రా ఈ కేసులో కోర్టు విచారణ జరిగే వరకు బాబును అరెస్టు చేయకుండా ఇచ్చిన ఆదేశాలను కొనసాగించాలని కోరారు. ఇందుకు సుప్రీంకోర్టు అంగీకరించి కేసు విచారణ వరకు బాబును అరెస్టు చేయవద్దంటూ సూచించింది.


స్కిల్ డెవల్‌మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం కొసాగిన విచారణను హైకోర్టు ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన తరుపు న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీని కోర్టు ఆదేశించింది.


కోడి కత్తి కేసు విచారణపై స్టే


విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో కొనసాగుతున్న కోడి కత్తి కేసు విచారణపై ఏపీ హైకోర్టు స్టే విధించింది. 8వారాల పాటు విచారణ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. మరోవైపు కోడికత్తి కేసులో సీఎం జగన్ పిటిషన్ విచారణను సైతం హైకోర్టు ఆరు వారాలకు వాయిదా వేసింది.