తెలుగు గంగను తామే నిర్మించినట్లు భ్రమలు కల్గించడం తగదు

తెలుగు గంగను ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు పూర్తి చేశారు. బ్రహ్మంసాగర్ పూర్తి కావడం లో బిజవేముల వీరారెడ్డి పాత్ర చారిత్రాత్మకం. విధాత‌:కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన బద్వేల్ బహిరంగ సభలో తెలుగుగంగ ప్రాజెక్టు ను తాను, తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డిలు మాత్రమే నిర్మించినట్లు భ్రమలు కల్పించడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తగదని, బ్రహ్మంసాగర్ జలాశయం పూర్తి కావడం లో మాజీ […]

  • Publish Date - July 10, 2021 / 04:26 AM IST
  • తెలుగు గంగను ఎన్టీఆర్ ప్రారంభిస్తే చంద్రబాబు పూర్తి చేశారు.
  • బ్రహ్మంసాగర్ పూర్తి కావడం లో బిజవేముల వీరారెడ్డి పాత్ర చారిత్రాత్మకం.

విధాత‌:కడప జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించిన బద్వేల్ బహిరంగ సభలో తెలుగుగంగ ప్రాజెక్టు ను తాను, తన తండ్రి మాజీ ముఖ్యమంత్రి వైయస్. రాజశేఖర్ రెడ్డిలు మాత్రమే నిర్మించినట్లు భ్రమలు కల్పించడం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి తగదని, బ్రహ్మంసాగర్ జలాశయం పూర్తి కావడం లో మాజీ మంత్రి బిజ వేముల వీరారెడ్డి పాత్ర చారిత్రాత్మకమైనదని, ఎన్టీఆర్ లేకుంటే తెలుగు గంగ, బ్రహ్మంసాగర్ జలాశయాలు వచ్చేవా? మైదుకూరు,బద్వేల్ నియోజకవర్గాల్లోని బీడు భూములు సస్యశ్యామలం అయ్యేవా అని తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి నిలదీశారు.

ఖాజీపేట మండలం దుంపలగట్టు గ్రామంలోని ఆయన స్వగృహంలో శుక్రవారం” రెడ్యo” విలేకరులతో మాట్లాడుతూ నందమూరి తారక రామారావు తెలుగు గంగ, బ్రహ్మంసాగర్ లకు శ్రీకారం చుట్టి ప్రారంభిస్తే, వాటిని పూర్తి చేసింది నారా చంద్రబాబునాయుడు అన్నది జగమెరిగిన సత్యమన్నారు. బ్రహ్మంసాగర్ జలాశయం పనులను ఎన్టీఆర్ పూర్తి చేసినప్పటికీ ప్రధాన కాల్వ పనులు పూర్తి కాక పోవడంతో నీటిని నింపలేకపోయారు అని అన్నారు. చంద్రబాబు నాయుడు ప్రధాన కాల్వ పనులు పూర్తి చేసినప్పటికీ వర్షాలు పడని కారణంగా బ్రహ్మంసాగర్ లోకి నీరు చేర లేదన్నారు. కానీ డాక్టర్ వైఎస్ ముఖ్యమంత్రి కాగానే వర్షాలు పడటం తో బ్రహ్మంసాగర్ కు నీరు చేరాయన్నది వాస్తవం అని ఆయన పేర్కొన్నారు. బ్రహ్మం సాగర్ కింద ప్రధాన, ఉప పంట కాల్వలు పూర్తి కానందున నీటి వాడకం లేనందున డాక్టర్ వైయస్ హయాంలో 11 టిఎంసిలు నీరు నిల్వ చేయగలిగారన్నారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో 2017 వ సంవత్సరం లో కడప జిల్లా సరిహద్దుల్లో ప్రధాన కాలువకు 16.5 టీఎంసీల నీరు చేరాయని, బ్రహ్మం సాగర్ కు 10.72 టీఎంసీల నీరు చేరింద న్నది వాస్తవం కాదా! అని ఆయన సూటిగా ప్రశ్నించారు. చంద్రబాబు సర్కార్ లో తెలుగు గంగ ప్రధాన కాలువ లో 102 కిలోమీటర్ల నుండి 107 కిలోమీటర్ల వరకు కాల్వ బలహీనంగా ఉండడం, అధికంగా లీకేజీలు ఉండటంతో 5 కిలోమీటర్లు లైనింగ్ పనులు చంద్రబాబు నాయుడు పూర్తి చేయడంతోనే నేడు బ్రహ్మంసాగర్ కు త్వరితగతిన నీరు చేరుతున్నాయి అని ఆయన పేర్కొన్నారు.

వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 2020 వ సంవత్సరంలో అధిక వర్షాలతో శ్రీశైలం జలాశయం గేట్లను 10 సార్లు ఎత్తిన పరిస్థితుల్లో బ్రహ్మం సాగర్ లో 14.7 టీఎంసీల నీరు నిల్వచేయడం సాధ్యమైందన్నారు. వెలుగోడు జలాశయం నుండి ప్రధాన కాల్వ లో 0 కిలోమీటర్ల నుండి 18 కిలోమీటర్ల వరకు లైనింగ్ పనులకు చంద్రబాబు హయాంలో 230 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారని, చంద్రబాబు అధికారం కోల్పోవడంతో జగన్ సర్కారు హయాంలో అది పూర్తయిందని ఆయన తెలిపారు. ఎన్టీఆర్, చంద్రబాబు తోనే తెలుగు గంగ, బ్రహ్మంసాగర్, ఎస్సార్-1,2 లు పూర్తి కావడంతోనే మైదుకూరు, బద్వేల్ నియోజకవర్గాల్లోని బీడు భూములు సాగులోకి వచ్చాయని ఆయన విశదీకరించారు. అభివృద్ధి చెందని నియోజకవర్గాల్లో బద్వేల్ ముందువరుసలో ఉందన్న జగన్ తమ కుటుంబానికి బ్రహ్మరథం పట్టిన నియోజకవర్గాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేదో ప్రజలకు చెప్పాలని రెడ్యo డిమాండ్ చేశారు.