ముచ్చుమర్రి, హంద్రీనీవాలు విస్త‌రిస్తేనే సీమ‌కు జ‌లాలు

పోతిరెడ్డిపాడు విస్తరణ యోచన వల్లే తెలంగాణ అభ్యంత‌రం!గుండ్రేవుల జలాశయంతో సీమ కష్టాలకు చెక్‌ విధాత‌:రాయ‌ల‌సీమ‌కు నిక‌ర జ‌లాల‌ను అందించేందుకు ఉద్దేశించిన హంద్రీనీవాలో ఇప్పుడు 12 మోటార్లు అమ‌ర్చారు. కానీ అక్క‌డ వాస్త‌వ ప‌రిస్థితి ఏంటంటే కేవ‌లం 3 మోటార్లు పంపింగ్ వ‌ర‌కే కాలువ సామర్థ్యం స‌రిపోతుంది. ఇలా మూడు మోటార్లు మూడు రోజుల పాటు నిరంత‌రం ఆడిస్తే కేవ‌లం ఒక టీఎంసీ నీరు మాత్ర‌మే తోడ‌గలం. శ్రీ‌శైలం బ్యాక్ వాట‌ర్ సామ‌ర్థ్యం నిర్ధిష్ట అడుగుల్లో ఉన్న‌ప్పుడు కూడా […]

ముచ్చుమర్రి, హంద్రీనీవాలు విస్త‌రిస్తేనే సీమ‌కు జ‌లాలు

పోతిరెడ్డిపాడు విస్తరణ యోచన వల్లే తెలంగాణ అభ్యంత‌రం!
గుండ్రేవుల జలాశయంతో సీమ కష్టాలకు చెక్‌

విధాత‌:రాయ‌ల‌సీమ‌కు నిక‌ర జ‌లాల‌ను అందించేందుకు ఉద్దేశించిన హంద్రీనీవాలో ఇప్పుడు 12 మోటార్లు అమ‌ర్చారు. కానీ అక్క‌డ వాస్త‌వ ప‌రిస్థితి ఏంటంటే కేవ‌లం 3 మోటార్లు పంపింగ్ వ‌ర‌కే కాలువ సామర్థ్యం స‌రిపోతుంది. ఇలా మూడు మోటార్లు మూడు రోజుల పాటు నిరంత‌రం ఆడిస్తే కేవ‌లం ఒక టీఎంసీ నీరు మాత్ర‌మే తోడ‌గలం. శ్రీ‌శైలం బ్యాక్ వాట‌ర్ సామ‌ర్థ్యం నిర్ధిష్ట అడుగుల్లో ఉన్న‌ప్పుడు కూడా ఇలా మూడు మోటార్ల‌తో తోడితే ఎప్ప‌టికి క‌రువు సీమకు జ‌లాలు చేరేది? హంద్రీనీవా కాలువ ప్ర‌వాహ సామ‌ర్థ్యం రోజుకు 24 వేల క్యూసెక్కుల పెంచ‌డం ఇప్పుడు ఏపీ ప్ర‌భుత్వం ముందున్న త‌క్ష‌ణ కార్యం. 22 వేల ఎక‌రాల విస్తీర్ణంలో ఒక అడుగు ఎత్తు నీరు నిలిస్తే ఉండే నీరు ఒక టీఎంసీకి స‌మానం. ఈ కాలువ‌ల ప్ర‌వాహ సామ‌ర్థ్యం విస్త‌రించ‌డం వ‌ల్ల రోజుకు దాదాపు 1.8 టీఎంసీని పంప్ చేయొచ్చు. మూడు నెల‌ల కాలంలో 160 టీఎంసీల నీటిని తోడుకోవ‌చ్చు. 800 వంద‌ల వ‌ద్ద తోడుకునే వీలున్న‌ ముచ్చుమ‌ర్రి వ‌ద్ద పంపింగ్ చేస్తే అనంత‌పురం, క‌ర్నూలు జిల్లాతోపాటు క‌డ‌ప‌, చిత్తూరు జిల్లాల చెరువులు, కుంట‌ల‌న్నీ కూడా నింపేయ‌చ్చు. క‌రువు నేల‌ల‌న్నింటినీ స‌స్య‌శ్యామ‌లం చేయొచ్చు. ముచ్చుమ‌ర్రి వ‌ద్ద కూడా మోటార్ల సంఖ్య పెంచి ఆ కాలువ సామ‌ర్థ్యం కూడా పెంచ‌డం, హంద్రీనీవాకు క‌లిపితే తెలంగాణ నీటి వాటాలో ఒక చుక్క కూడా తీసుకోకుండానే రాయ‌ల‌సీమ జిల్లాల‌కు పుష్క‌లంగా నీటిని అందించ‌వ‌చ్చు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఈ ప్ర‌త్యామ్నాయాల‌ను ఏమీ ఆలోచించ‌కుండా… రాయ‌ల‌సీమ లిఫ్ట్ ఇరిగేష‌న్ స్కీం అంటూ కొత్త పేచీకి తెర‌లేపారు.
రాయలసీమ దాహార్తిని, సాగునీటి ఇక్కట్లను రూపుమాపగల ముచ్చుమర్రి ఎత్తిపోతల విస్తరణ, గుండ్రేవుల జలాశయ నిర్మాణ పథకాలను పక్కనపెట్టి.. వివాదాలు రేపే రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టటం ఏంట‌ని సాగునీటి రంగ నిపుణులు తప్పుబడుతున్నారు. శ్రీశైలం జలాశయం 800 అడుగుల మట్టం నుంచి (ముచ్చుమ‌ర్రి) హంద్రీ-నీవా, కేసీ కాలువలకు 4,800 క్యూసెక్కులు ఎత్తిపోసేలా సంగమేశ్వరం నుంచి అప్రోచ్‌ కెనాల్‌ తవ్వి ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసిన టిడిపి ప్రభుత్వం .. దానిని 2017 సెప్టెంబరు 8న జాతికి అంకితం చేసింది. ముచ్చుమర్రి నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు డీపీఆర్ రెడీ అయింది. ముచ్చుమర్రి లిఫ్టు నుంచి బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌లోకి రెండు టీఎంసీలు ఎత్తిపోసేలా రూ.5,820 కోట్లతో అప్పటి హంద్రీ-నీవా ప్రాజెక్టు డివిజన్‌-2 ఇంజనీర్లు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) తయారు చేశారు. ముచ్చుమర్రి నుంచి గడివేముల మండలం సమీపంలో కుందూ నదిలోకి ఎత్తి పోసి.. గాలేరు-నగరి, కేసీ కాలువ, తెలుగుగంగ కాలువలకు ఇవ్వాలన్నది లక్ష్యం. అదే డీపీఆర్‌ను స్వల్పంగా మార్చి జగన్‌ ప్రభుత్వం ఆర్భాటంగా రాయలసీమ లిఫ్టు చేపట్టింది. అయితే పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్‌ను విస్తరించి.. శ్రీశైలం ఫోర్‌షోర్‌ ఏరియా నుంచి 800 అడుగుల మట్టంలో నీటిని ఎత్తిపోయాలని ప్రతిపాదించడం వల్లే ఇప్పుడు తెలంగాణతో వివాదం తలెత్తిందని.. ముచ్చుమర్రి విస్తరణలో భాగంగా చేపట్టి ఉంటే.. ఇప్పటికే కొనసాగుతున్న పథకమైనందున ఎన్‌జీటీ అభ్యంతరపెట్టేది కాదని, తెలంగాణ కూడా అంతగా పట్టించుకునేది కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. గోటితో పోయేదానికి ఇంత రచ్చ చేయాల్సిన అవసరవేమిటని ప్రశ్నిస్తున్నారు.