ఎన్డీయేలోనే ఉన్నాం: పవన్ కల్యాణ్

రాష్ట్ర రాజకీయ పరిణామాలను ఢిల్లీకి చెప్పాం
విధాత : తమ పార్టీ జనసేన ఇంకా ఎన్డీయేలోనే ఉందని, ఇటీవల ఎన్డీయే సమావేశానికి కూడా హాజరయ్యామని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. శుక్రవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల ఏపీ బాగా నష్టపోయిందని ప్రధాని మోడీ చెప్పారని, 2014తరహాలోనే 2024ఎన్నికలలో పొత్తులు ఉండాలనేది నా ఆకాంక్ష అని, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనేదే నా అభిప్రాయమన్నారు.
వాస్తవంగా టీడీపీతో పొత్తు ప్రకటన ఢిల్లీలో చేయాల్సివుండేనని, జీ20సమావేశాల దృష్ట్యా బీజేపీ కీలక నేతలు అందుబాటులో లేక టీడీపీ పొత్తు ప్రకటన రాష్ట్రంలోనే చేయాల్సివచ్చిందన్నారు. గతంలో బీజేపీ, జనసేన పొత్తుల అంశాలపై సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసి ఉన్నాయని, ఇప్పుడు టీడీపీ, జనసేన సమన్వయ కమిటీల ఏర్పాటు జరుగుతుందన్నారు.
రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడాలన్నదే తన లక్ష్యమన్నార. ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటన కేసులు వాయిదా వేయించుకవడానికే తప్ప రాష్ట్రానికి నిధులు సాధించేందుకు మాత్రం కాదన్నారు. బీజేపీతో పొత్తు అంశంపై ఎవరికి చెప్పాల్సిన పనిలేదని, ప్రజలకే చెబుతామలన్నారు. ఎక్కడ పోటీ చేయాలన్నది తమ ఇష్టమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్ష పసుపు బోర్డు కలను కేంద్రం సాకారం చేసిందన్నారు.
సీఎం జగన్ ఢిల్లీ వెళ్లినా జీడిపప్పు, కొబ్బరి బోర్డుల కోసం కృషి చేయలేదన్నారు. తమ పార్టీ పొత్తులు, సీట్లపై కంటే ఢిల్లీకి వెళ్లి రాష్టానికి బోర్డులు తీసుకరావడంపై జగన్ దృష్టి పెట్టాలన్నారు. రాష్ట్రంలో ఐఏఎస్‌లకు కూడా 20వ తేదీనాటికి జీతాలు చెల్లించడం లేదన్నారు. వేతనాలు రాక ఒప్పంద ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రాజ్యంగ ఉల్లంఘనలు ఏపీ ప్రభుత్వానికి సాధారణమైందన్నారు. చంద్రబాబుపై కేసులు రాజకీయ కక్షతో మోపారన్నారు.