YS JAGAN | జనసేన-టీడీపీకి పొత్తు కుదిర్చిన జగన్!
YS JAGAN | అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి బోల్తా కొట్టిన వైసీపీ అధినేత వ్యూహం అరెస్టుతో చంద్రబాబు పట్ల సానుభూతి వైసీపీ శ్రేణుల్లోనూ ఇబ్బందికర పరిస్థితి ఐ ప్యాక్ సర్వేలో విస్తుబోయే అంశాలు! అధినేతకు చెప్పలేని ఇబ్బందిలో ఐప్యాక్ వైసీపీ సోషల్ మీడియాలో డైవర్షన్ ట్రిక్కు బీజేపీ వల్లే బాబు అరెస్టయ్యారని ప్రచారం లోకేశ్‌కి టచ్‌లోకి పలువురు వైసీపీ నేతలు! విధాత: వైసీపీ వ్యూహం బోల్తా కొట్టింది. అనుకున్నది ఒక్కటైతే, అయ్యింది మరొకటి. డేరింగ్ పాలిటిక్స్కి పెట్టింది […]

YS JAGAN |
- అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి
- బోల్తా కొట్టిన వైసీపీ అధినేత వ్యూహం
- అరెస్టుతో చంద్రబాబు పట్ల సానుభూతి
- వైసీపీ శ్రేణుల్లోనూ ఇబ్బందికర పరిస్థితి
- ఐ ప్యాక్ సర్వేలో విస్తుబోయే అంశాలు!
- అధినేతకు చెప్పలేని ఇబ్బందిలో ఐప్యాక్
- వైసీపీ సోషల్ మీడియాలో డైవర్షన్ ట్రిక్కు
- బీజేపీ వల్లే బాబు అరెస్టయ్యారని ప్రచారం
- లోకేశ్‌కి టచ్‌లోకి పలువురు వైసీపీ నేతలు!
విధాత: వైసీపీ వ్యూహం బోల్తా కొట్టింది. అనుకున్నది ఒక్కటైతే, అయ్యింది మరొకటి. డేరింగ్ పాలిటిక్స్కి పెట్టింది పేరు అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయ విశ్లేషకులు ప్రశంసిస్తారు. జగన్ ఒక నిర్ణయం తీసుకుంటే, వెనకడుగు వేయరనేది పార్టీ అగ్రనేతలకీ తెలుసు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో ఇవే సంకేతాలు బలంగా పంపారు.
వైసీపీ పాలన ఏడాది పూర్తి కాకముందే చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్, బాబు కేబినెట్‌లో మంత్రులుగా పనిచేసిన వారంతా జైలు కెళ్లక తప్పదని వైసీపీ నేతలు చెబుతూ ఉండేవారు. ఆ దిశగా శాసనసభ కమిటీలు, సిట్ ఏర్పాట్లు, సీఐడీ దర్యాప్తులు సాగాయి. జగన్ పెట్టిన ఈ కేసులన్నీ నాలుగేళ్లుగా నమోదైన దశలోనే ఉన్నాయి. ముందస్తు ఎన్నికల ముచ్చట్లు ఏపీలో పొలిటికల్ హీట్ పెంచాయి.
కేంద్రం మినీ జమిలి ఎన్నికలకి రంగం సిద్ధం చేస్తోందనే సంకేతాలు అన్ని రాజకీయ పార్టీలకు అందాయి. ఇదే జరిగితే జగన్ భీషణ ప్రతిజ్ఞ నెరవేరదు. అందుకే కొన్ని నెలలుగా చంద్రబాబుని అరెస్టు చేసే వ్యూహం పకడ్బందీగా రూపొందించారు. ఏ కేసులో అరెస్టు చేయాలనే దానిపైనే చాలా రోజులు ఉన్నతస్థాయి చర్చలు సాగాయి.
చంద్రబాబు అరెస్టు వ్యూహం అమలుకు కేంద్ర పెద్దల అనుమతి కూడా ఉందనే ప్రచారాన్ని బీజేపీ వాళ్లు ఖండించకపోవడం అనుమానాలకి తావిస్తోంది. ఏపీ అసెంబ్లీ రద్దయ్యే లోపు ఏదో ఒక కేసులో చంద్రబాబుని అరెస్టు చేయాలనే పట్టుదలతో ఇప్పటివరకూ చంద్రబాబుపై నమోదై ఉన్న కేసుల వివరాలన్నీ తెప్పించు కున్నారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలు కేసుల ఫైళ్లూ బూజు దులిపారు. చిట్టచివరికి అందరూ కలిసి నిర్‌దయించిన కేసు స్కిల్ డెవలప్మెంట్ స్కాం.
ఇందులో బాబుని అరెస్టు చేసే వ్యూహంలో తన పేరు కనపడకూడదనే ప్లాన్‌లో భాగమే జగన్ రెడ్డి లండన్ టూర్ అని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. చంద్రబాబు అరెస్టుతో జనసేన-టీడీపీ పొత్తు ప్రయత్నాలను జగనే ఒక కొలిక్కి తెచ్చినట్టయ్యింది. పవన్-బాబు చాలాసార్లు భేటీ అయినా పొత్తు అంశంపై ఎవరూ మాట్లాడలేదు. చంద్రబాబును జగన్ అరెస్టు చేయించకుండా ఉండి ఉంటే, ఎన్నికల ప్రకటన వచ్చే వరకూ టీడీపీ-జనసేన పొత్తు ప్రకటన వచ్చేది కాదు.
రివర్స్ కొట్టిన వ్యూహం
చంద్రబాబు అరెస్టుతో చాలా అంశాలు తనకి కలిసి వస్తాయనుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూకుడుగా ప్లాన్ అమలు చేశారు. తనని పదేపదే అవినీతిపరుడు, ఆర్థిక ఉగ్రవాది, ఎక్యూజ్డ్ నెంబర్ వన్, ఖైదీ నెంబర్ 6093, 16 నెలలు జైలుపక్షి అంటోన్న విపక్షాలు.. దాని మీడియాకు చెంపపెట్టులా చంద్రబాబుని ఏ1 చేసి ఖైదీ నెంబర్ 7691 ముద్ర వేయించగలిగారు. బెయిల్ కూడా రాకుండా జైలులో ఉంచారు. ఇంతవరకూ జగన్ అనుకున్నవన్నీ నెరవేరాయి.
చంద్రబాబు అరెస్టు వల్ల వైసీపీకి జరిగిన మేలు ఏమైనా ఉందా? అని క్షేత్రస్థాయిలో తమ ఆస్థాన సర్వే బృందం ఐప్యాక్ రంగంలోకి దిగింది. ఏ ప్రాంతంలో ఏ సెక్షన్ వారి అభిప్రాయం తీసుకున్నా.. ఈ వయస్సులో చంద్రబాబును అరెస్టు చేయడం తప్పు అనే అంటున్నారు. అర్బన్‌లో ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత, బాబు అరెస్టుతో రూరల్ ప్రాంతాల్లోనూ తీవ్రమైంది. వైసీపీ బలం అనుకుంటున్న రూరల్ ఓటర్లలో అనూహ్య మార్పు వ్యూహకర్తల్నే ఆందోళనకు గురి చేస్తోంది.
చంద్రబాబు అరెస్టు తీరుపై వైసీపీ శ్రేణుల నుంచి కూడా అధిష్ఠానంపై విమర్శలు వస్తున్నాయి. ఏ ఊరు వెళ్లినా బాబును ఆ వయసులో అంతగా ఇబ్బందిపెట్టడం తప్పు అంటూ సానుభూతి ప్రకటనలు అన్నివర్గాల నుంచి రావడంతో సర్వే బృందాలు విస్తుపోతున్నాయని సమాచారం. అభివృద్ధికి దూరమైన రాష్ట్రంలో ఈ ప్రతీకార రాజకీయాలు మంచివి కావనే ఆంధ్రా ఓటర్లు అభిప్రాయపడుతున్నారని తెలుస్తున్నది.
సర్వేల్లో వచ్చిన దిమ్మదిరిగే ఈ వాస్తవాలను జగన్ దృష్టికి తీసుకెళ్లడానికి ఐ ప్యాక్ బృందం భయపడు తోందని చెబుతున్నారు. నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో చంద్రబాబుని ఎవరూ టచ్ చేయలేకపోయారని, తాను అరెస్టు చేయించి జైలులో పెట్టించగలిగాననే విజయానందంలో జగన్‌కు క్షేత్రస్థాయిలో చంద్రబాబుకి విపరీతమైన సానుభూతి పెరిగిందనే సర్వే సారాంశం చెప్పలేక సతమతమవుతున్నారని సమాచారం.
మరొక చాన్స్.. అయ్యబాబోయ్..
జగన్ ప్రభుత్వ ప్రతీకార దాడులపై సామాన్యుల్లో సైతం భయాందోళనలు నెలకొన్నాయి. అన్నివర్గాలూ బాధితులుగా మారాయి. ఇంకోసారి జగన్ గెలిస్తే పరిస్థితి ఏంటంటూ చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో గూడుకట్టుకున్న వ్యతిరేకత నానాటికీ తీవ్రం అవుతోంది. ఇసుక, లిక్కర్ దందాలపై జనం ఆగ్రహంగా ఉన్నారు. ప్రజావ్యతిరేకత ఈ స్థాయిలో ఉన్న దశలో జనసేన-టీడీపీ పొత్తు ఏపీ రాజకీయాల్లోనూ, అధికార పార్టీకి పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
జాతీయస్థాయిలో బాబుకు మద్దతు
చంద్రబాబు అరెస్టును పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ, మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, కుమార స్వామి, అఖిలేష్ యాదవ్ తో పాటు చాలా మంది జాతీయ పార్టీ నేతలు ఖండించారు. తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వీహెచ్, బీఆర్ ఎస్ నేతలు కూడా బాబు అరెస్టు అప్రజాస్వామికం అంటున్నారు.
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఫోన్ చేసి లోకేష్‌ని పరామర్శించారు. జాతీయస్థాయిలో చంద్రబాబుకి మద్దతు వెల్లువెత్తుతోంది. అరెస్టు చేయించి ఘనకార్యం సాధించానని టపాసులతో సంబరాలు చేసుకుంటున్న జగన్ రెడ్డికి తెరవెనుక మద్దతుదారులే తప్పించి.. తెర ముందుకొచ్చి ఒక్కరు కూడా అభినందించలేదు.
నేరం నాది కాదు-బీజేపీది
ఇంటా బయటా చంద్రబాబు అరెస్టుతో బాగా డ్యామేజ్ అయ్యిందని వైసీపీ కీలక నేతలు భావిస్తున్నారు. ఈ డ్యామేజ్ కంట్రోల్ చేయాలంటే ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నారు. చాపకింద నీరులాగ తమకున్న సోషల్ మీడియా వింగ్స్ ద్వారా.. చంద్రబాబు అరెస్టు వెనక సూత్రధారి కేంద్రంలో పెద్దలని, జగన్ కేవలం పాత్రధారి అంటూ పోస్టులతో భారీ క్యాంపెయిన్లు చేస్తున్నారు. నేరం నాది కాదు-బీజేపీది ఇదీ ఇప్పుడు చంద్రబాబు అరెస్టులో వైకాపా అనధికారికంగా చేస్తున్న ప్రచారం.
టీడీపీ టచ్‌లోకి వైసీపీ ఎంపీలు, మాజీ మంత్రులు!
వచ్చే ఎన్నికలకి చంద్రబాబు అరెస్టు-అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్తామని.. ఇదే తమ వ్యూహమని సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పార్టీ అధిష్ఠానం ఈ లైనులో ఉంటే, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు లోకేష్‌కి టచ్‌లోకి వెళ్తున్నారని విశ్వసనీయ సమాచారం.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు.. చంద్రబాబు అరెస్టను ఖండిస్తూనే… లోకేష్‌కి సంఘీభావం ప్రకటించారని తెలుస్తోంది. జగన్ సోదరి షర్మిల కూడా భువనేశ్వరికి ఫోన్ చేసి పరామర్శించారని ధ్రువీకరణ కాని వార్తలు కలకలం రేపుతున్నాయి.
టీడీపీ-జనసేన కూటమివైపే వామపక్షాలు?
చంద్రబాబుతో ములాఖత్ అయిన సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పొత్తుని ధ్రువీకరించా రు. అయితే ఇప్పటికీ తాను బీజేపీతో పొత్తులో ఉన్నట్టు చెప్పడం మరో కీలక అంశం. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి పోటీ చేస్తాయా లేదా అనే అంశం విక్రమార్కుడి భేతాళ కథలా మారింది. జనసేనతో పొత్తుందని చెబుతూనే.. టీడీపీ గురించి అడిగితే కమలనాథులు మౌనమే పాటిస్తున్నారు. పార్టీ ఢిల్లీ పెద్దలు చూసుకుంటారని చెబుతున్నారు.
మరోవైపు వామపక్షాలు టీడీపీ-జనసేనతో కలిసి పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నాయి. బీజేపీ విముఖంగా ఉన్న నేపథ్యంలో వామపక్షాలు టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లవచ్చనే విశ్లేషణలు వస్తున్నాయి. టీడీపీతో పొత్తుపై పవన్ ప్రకటనతో బీజేపీ ఆత్మరక్షణలో పడిందని జోరుగా చర్చలు నడుస్తున్నాయి. బీజేపీ, వైసీపీ బంధంపై ఏపీ ప్రజల్లో లోతైన చర్చ జరుగుతుండడం కూడా కేంద్రంలో బీజేపీ పెద్‌లలు పునరాలోచనలో పడేటట్లు చేసిందంటున్నారు.
కవితకి నోటీసులు డైవర్షన్ కోసమేనా?
చంద్రబాబు అరెస్టుతో మామూలుగా మొదలైన నిరసనలు పక్క రాష్ట్రాలకీ పాకాయి. తెలుగు చానళ్లలో వార్తలు నేషనల్ మీడియాలో చర్చకి వచ్చాయి. దేశస్థాయిలో చంద్రబాబు అరెస్టుపై సానుభూతి పవనాలు వీస్తుండడంతో బీజేపీ పెద్దలు డైవర్షన్ పాలిటిక్స్‌కి తెరతీశారని, ఇందులో భాగంగానే తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కాంను తెరపైకి తెచ్చారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీడియా దృష్టిని చంద్రబాబు అరెస్టు నుంచి మళ్లించే ఎత్తుగడ కవితకి నోటీసులు అని అంటున్నారు పరిశీలకులు.
జనంలోకి పవన్-బాలయ్య
చంద్రబాబుకి బెయిల్ రాకపోవడంతో “బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకి గ్యారెంటీ యాత్రని బాలయ్య నిర్వహించే అవకాశాలున్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే పవన్-బాలయ్య కలిసి పర్యటిస్తే ప్రజల స్పందన ఇంకా బాగుంటుందని పార్టీ కేడర్ ఆశిస్తోంది. లోకేష్, భువనేశ్వరి, బ్రాహ్మణి, బాలకృష్ణ, పవన్‌కళ్యాణ్ కలిసి యాత్ర చేస్తే జనం నుంచి ఊహించని మద్దతు ఖాయం అని అంటున్నారు.