YS Sharmila Comments On PM Modi | ప్రధాని మోదీపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు
ప్రధాని మోదీ ఏపీ పర్యటనపై వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు సభ 'తుస్సుమంది' అంటూ శ్రీశైలం అభివృద్ధిపై నిధులు ఇవ్వకుండా మోసం చేశారని 'ఎక్స్' వేదికగా విమర్శించారు. విభజన హామీలపై మౌనం వహించడాన్ని ప్రశ్నించారు.

అమరావతి : ప్రధాని మోదీపై ‘ఎక్స్’లో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు వేదికగా మోదీ దీపావళి టపాకాయ తుస్సుమంది అని..వచ్చిందేమో ఏపీకి.. కానీ బీహార్ ఎన్నికలను ప్రభావితం చేయడానికి కాషాయ వేషం వేశారంటూ ఎద్దేవా చేశారు. శ్రీశైలం మల్లన్న సాక్షిగా నీచ రాజకీయలకు తెర లేపి మరోసారి రాష్ట్ర ప్రజలను మోదీ ఘరానా మోసం చేశారని విమర్శించారు. మోదీకి చిత్తశుద్ధి ఉంటే శ్రీశైలం మల్లన్న ఆలయ అభివృద్ధికి ఒక్క రూపాయి అయినా ఇచ్చారా? అని ‘ఎక్స్’ వేదికగా షర్మిల ప్రశ్నించారు. రూ.1657 కోట్లతో పెండింగ్ లో ఉన్న శ్రీశైలం మాస్టర్ ప్లాన్ మీకు కనబడలేదా ? అని.. ఉజ్జయిని, వారణాసి, గంగానది కారిడార్ల అభివృద్ధిపై చూపిన ప్రేమ మల్లన్న కారిడార్ పై ఎందుకు లేదు ? అని మోదీని నిలదీశారు. శ్రీశైలం క్షేత్ర కారిడార్ నిర్మాణ పనులకు కేంద్రం నుంచి అనుమతి ఇవ్వడానికి మనసు ఎందుకు రాలేదు ? ఇది మల్లన్నకు మీరు చేసిన ద్రోహం కాదా ? అని షర్మిల ప్రశ్నించారు.
11 ఏళ్ల క్రితం తిరుపతి వేదికగా చెప్పిన పిట్టకథే మళ్ళీ మోదీ చెప్పారు అని.. ఢిల్లీకి – రాష్ట్ర రాజధానికి లింక్ పెట్టారు. అరకొర అప్పులు ఇస్తే ఢిల్లీతో అమరావతి పోటీ పడుతుందా ? అప్పులకు హామీలు ఇచ్చినంత మాత్రాన ప్రగతిలో పరుగులు పెడుతుందా ? రాజధానికి లక్ష కోట్ల అప్పులు తెస్తే రాష్ట్ర ముఖచిత్రం ఎలా మారుతుంది ? ప్రగతి ద్వారాలు ఎలా తెరుచుకుంటాయి ? ఆత్మనిర్భర్ భారత్ లో ఏపీ ఎలా కీలకం అవుతుంది ? అని షర్మిల నిలదీశారు.
ప్రత్యేక హోదాపై నోరు విప్పలేదు. వెనుకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీపై ప్రకటనే లేదు. కడప స్టీల్ ఊసేలేదు. పారిశ్రామిక వాడల ఏర్పాటుపై ప్రస్తావనే లేదు. విశాఖ స్టీల్ కి భరోసా లేదు. ఎన్నికలు ముగిసిన నాటి నుంచి 4 సార్లు మోదీ రాష్ట్ర పర్యటన చేసినా విభజన హామీలపై ఒక్కమాట లేదు. వినేవాడుంటే చెప్పేవాడు మోదీ అన్నట్లు.. మోసం చేసేది మోదీ గారైతే..మోసపోయేది ప్రతిసారీ రాష్ట్ర ప్రజల వంతు అవుతుంది అంటూ షర్మిల విమర్శలు గుప్పించారు.