బైడెన్‌ బదులు అధ్యక్ష బరిలో సగం మంది డెమోక్రాట్ల చాయిస్‌ ఎవరంటే!

బైడెన్‌ బదులు అధ్యక్ష బరిలో సగం మంది డెమోక్రాట్ల చాయిస్‌ ఎవరంటే!

వాషింగ్టన్‌: 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్‌ పార్టీ, రిపబ్లికన్‌ పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే.. ఎక్కవమంది డెమోక్రాట్లు మాత్రం ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ (Joe Biden) మరో దఫా ఎన్నికల్లో నిలబడేందుకు ఇష్టపడటం లేదు. ఆయన వయసు, మానసిక ఆరోగ్య స్థితిని కారణంగా చూపుతున్నారు. అలా చెబుతున్నవారు దాదాపు 48 శాతం ఉన్నారని తేలింది. బైడెన్‌ బదులు.. మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామాను కోరుకుంటున్నారని రాస్‌ముస్సెన్‌ రిపోర్ట్స్‌ పోల్‌ తేల్చింది.


38 శాతం మంది జో బైడెన్‌ను కోరుకోవడం లేదని ఈ మేరకు న్యూయార్క్‌ పోస్ట్‌ ఒక వార్తను ప్రచురించింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాది నవంబర్‌లో జరుగనున్నాయి. అదే సమయంలో బైడెన్‌ను మార్చే అవకాశాలు లేవని 45 శాతం మంది అభిప్రాయపడుతున్నారని సర్వేలో వెల్లడైంది. బైడెన్‌ మరోసారి ఎన్నికకు సిద్ధపడకపోతే ఆయన స్థానంలో ఎవరైతే బాగుంటందనే ప్రశ్నతో సర్వే నిర్వహించారు. ఇందులో మిషెల్లీ ఒబాబాకే అధికులు మద్దతు పలికారు. ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌, మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్‌, కాలిఫోర్నియా గవర్నర్‌ గావిన్‌ న్యూసమ్‌ తదితరులు తదుపరి స్థానాల్లో ఉన్నారు.

మిషెల్లీ అందుకు సిద్ధంగా ఉన్నారా?

జనవరిలో ఒక పాడ్‌క్యాస్ట్‌ ఇంటర్వ్యూలో మాట్లాడిన మిషెల్లీ.. 2024 అధ్యక్ష ఎన్నికల్లో వచ్చే ఫలితం గురించి తాను భయపడుతున్నానని వ్యాఖ్యానించారు. డెమోక్రాట్లు ఆమె పోటీ చేయాలని కోరుకుంటున్నా.. గతంలో తాను అధ్యక్ష ఎన్నికల్లో నిలబడే ఆసక్తితో లేనని మిషెల్లీ ప్రకటించారు. మరోవైపు అవసరమైతే తాను నిలబడుతానని కమలాహ్యారిస్‌ చెప్పారు. గత నెలలో రహస్య పత్రాల విషయంలో బైడెన్‌ వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. మతిమరుపు ఉన్న వృద్ధుడు అని పలువురు అభివర్ణించారు. గత ఏడాది సెప్టెంబర్‌లో మిషెల్లీ సొంత ఊరైన షికాగోలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆర్‌-టెక్సాస్‌ సెనెటర్‌ టెడ్‌ క్రుజ్‌ మాట్లాడుతూ.. మిషెల్లీని డెమోక్రటిక్‌ నేషనల్‌ కన్వెన్షన్‌లో దించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. బైడెన్‌ బదులు ఆమె ప్రెసిడెన్షియల్‌ అభ్యర్థిగా ప్రతిపాదించారు. అమెరికా చరిత్రలోనే అత్యంత వృద్ధ అధ్యక్షుడు బైడెన్‌. ఆయన వయసు 81 సంవత్సరాలు. మరోసారి పోటీ చేయాలనే ఆకాంక్షను ఆయన ఎన్నడూ వ్యక్తం చేయలేదు.