విచారణకు హాజరుకాలేను..సీబీఐకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ

ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం జరుగాల్సిన సీబీఐ విచారణకు హాజరుకాలేనని లేఖ రాశారు.

విచారణకు హాజరుకాలేను..సీబీఐకి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖ

41ఏ నోటీస్‌లు రద్దు చేయండి

అవసరమైతే వర్చువల్‌గా సమాధానాలిస్తాను

విధాత, హైదరాబాద్ : ఢిల్లీ లిక్కర్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆరెస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సోమవారం జరుగాల్సిన సీబీఐ విచారణకు హాజరుకాలేనని లేఖ రాశారు. సోమవారం విచారణకు రావాలని సీబీఐ ఈ నెల 21న జారీ చేసిన 41ఏ నోటీస్‌లకు జవాబుగా ఆమె సీబీఐకి ఈ లేఖ రాశారు. లేఖను మెయిల్ ద్వారా సీబీఐకి పంపినట్లుగా సమాచారం. సుప్రీంలో తాను ఈడీ కేసుపైన, మహిళను ఇంటి వద్దనే విచారించాలన్న వాదనతోనూ వేసిన పిటిషన్ పై ఈనెల 28న విచారణ ఉందని కూడా లేఖలో కవిత ప్రస్తావించారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ముందే నిర్ణయించుకున్న కార్యక్రమాల నేపథ్యంలో తాను విచారణకు హాజరుకాలేకపోతున్నానని తెలిపారు. తన నుంచి ఏమైనా సమాధానాలు కావాలంటే వర్చువల్‌గా సమాధానం ఇస్తానన్నారు. అలాగే తనకు 41ఏ కింద ఇచ్చిన నోటీస్‌లు సబబు కాదని, ఎన్నికల నేపథ్యంలో ఆ నోటీసులను ఉపసంహరించుకోవాలి లేదా రద్దు చేయాలని కవిత కోరారు.


కవిత లేఖ నేపథ్యంలో సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కవితతకు ఈ నెల 21న సీబీఐ నోటీస్‌లు జారీ చేసింది. అంతకుముందు ఈడీ నోటీస్‌లు జారీ చేసినప్పటికి కూడా ఆమె హాజరుకాలేదు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తరహాలోనే కవిత కూడా ఈడీ, సీబీఐల విచారణలకు గైర్హాజరవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సౌత్ గ్రూప్ లావాదేవీల్లో నిందితులుగా ఉన్న మాంగుట రాఘవరెడ్డి, కవిత పీఏ రమేశ్‌కుమార్‌ కౌశిక్ వాంగ్మూలాల నేపథ్యంలో కవితను సీబీఐ నిందితురాలిగా పేర్కోంది. దీంతో గతంలో సాక్షిగా మాత్రమే కవితను ఆర్పీసీ 160కింద విచారణకు పిలిచిన సీబీఐ ఈ దఫా నిందితురాలిగా 41ఏ సెక్షన్ కింద విచారణకు పిలిచింది. ఈ సెక్షన్ కింద విచారణకు హాజరుకాని వారిని అరెస్టు చేసే అధికారం కూడా ఉంది. త్వరలోనే కేజ్రీవాల్‌ను అరెస్టు చేయనున్నారన్న ప్రచారం నేపథ్యంలో కవితను కూడా అరెస్టు చేయవచ్చని నిపుణలు అంచనా వేస్తున్నారు.