లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు.. 62 ఏండ్ల వ‌య‌సులో పెళ్లి చేసుకున్న గ్యాంగ్‌స్ట‌ర్..

అత‌నో క‌రుడుగ‌ట్టిన నేర‌స్థుడు. ఓ హ‌త్య కేసులో 17 ఏండ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆ గ్యాంగ్‌స్ట‌ర్ గతేడాదే జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. ప్రస్తుతం జ‌రుగుతున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకున్నాడు. కానీ చ‌ట్ట‌ప‌రంగా సాధ్యం కాలేదు.

  • By: raj |    breaking |    Published on : Mar 21, 2024 2:41 AM IST
లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు.. 62 ఏండ్ల వ‌య‌సులో పెళ్లి చేసుకున్న గ్యాంగ్‌స్ట‌ర్..

పాట్నా : అత‌నో క‌రుడుగ‌ట్టిన నేర‌స్థుడు. ఓ హ‌త్య కేసులో 17 ఏండ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన ఆ గ్యాంగ్‌స్ట‌ర్ గతేడాదే జైలు నుంచి విడుద‌ల‌య్యాడు. ప్రస్తుతం జ‌రుగుతున్న లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేయాల‌నుకున్నాడు. కానీ చ‌ట్ట‌ప‌రంగా సాధ్యం కాలేదు. దీంతో 62 ఏండ్ల గ్యాంగ్‌స్ట‌ర్.. 46 ఏండ్ల మ‌హిళ‌ను వివాహం చేసుకున్నాడు. ఈ వివాహం ఆర్జేడీ అధినేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ సూచ‌న మేర‌కు జ‌రిగింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. బీహార్‌లోని న‌వాదా జిల్లాలోని కోన‌న్‌పూర్ గ్రామానికి చెందిన అశోక్ మ‌హ‌తో గ్యాంగ్‌స్ట‌ర్‌. షేక్‌పురా జేడీయూ ఎమ్మెల్యే ర‌ణ‌ధీర్ కుమార్ సోనీపై హ‌త్యాయ‌త్నం ఆరోప‌ణ‌ల‌తో పాటు న‌వాదా జైలు బ‌ద్ద‌లుగొట్టిన కేసులో నేర‌స్థుడిగా 17 ఏండ్ల పాటు జైలు శిక్ష అనుభ‌వించాడు. గ‌తేడాది జైలు నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు.

ఈ ఎన్నిక‌ల్లో ఆర్జేడీ అభ్య‌ర్థిగా ముంగేర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీకి సిద్ధ‌మ‌య్యాడు అశోక్ మ‌హ‌తో. దోషిగా తేలిన నేరస్థుడు, శిక్షాకాలం ముగిసిన తర్వాత ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా చట్టం నిషేధించింది. దీంతో లాలు ప్ర‌సాద్ యాద‌వ్ సూచ‌న మేర‌కు అశోక్ పెళ్లి చేసుకోవాల‌నుకున్నాడు. ముంగేర్ బరియాపూర్ గ్రామానికి చెందిన అనిత‌(46)ను నిన్న వివాహం చేసుకున్నాడు. ఆమె ఢిల్లీలోని ఓ ప్ర‌యివేటు సంస్థ‌లో ప‌ని చేసేది. ఇప్పుడు ఆమె లోక్‌స‌భ ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌బోతున్నారు. అనిత‌ను ముంగేర్ లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆర్జేడీ త‌ర‌పున పోటీ చేయించ‌నున్నారు. ఇదే స్థానం నుంచి ప్ర‌స్తుత ఎంపీ, జేడీయూ నేత లాల‌న్ సింగ్ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఆర్జేడీ నాయ‌కురాలు నీలం దేవి పోటీ చేసి ఓడిపోయారు.