Lalu Prasad Yadav| ఓటమి వేళ…అంతర్గత కలహాలలో లాలూ కుటుంబం

బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లలూప్రసాద్ యాదవ్ కుటుంబం ఓ వైపు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి..మరోవైపు కుటుంబ కలహాలతో తల్లడిల్లిపోతుంది.

Lalu Prasad Yadav| ఓటమి వేళ…అంతర్గత కలహాలలో లాలూ కుటుంబం

హైదరాబాద్, విధాత ప్రతినిధి:

Lalu Prasad Yadav| బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ది జంబోజెట్ కుటుంబం. అలాంటి గంపెడు కుటుంబంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చిచ్చుపెట్టాయి. ఇన్నేళ్ల నుంచి కలిసి మెలిసి ఉంటున్న కుటుంబంలో ఒక్కసారిగా విభేదాలు రచ్చకెక్కాయి. ఆయన ముగ్గురు కూమార్తెలు మూటా ముల్లె సర్ధుకుని ఆదివారం ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. అంతకు ముందు రోజు మరో కుమార్తె రోహిణీ ఆచార్య తన సోదరుడు తేజస్వీ యాదవ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు లాలూ ప్రసాద్ యాదవ్ దంపతులకు కంటి నిండా కునుకు లేకుండా చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

లాలూ ప్రసాద్ యాదవ్ తన స్వశక్తితో రాజకీయాల్లో ఎదుగుతూ రెండు సార్లు ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా పదవులను అనుభవించారు. నాలుగు దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్రతో చక్రం తిప్పారు. 1990 నుంచి 97 వరకు బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 నుంచి 2009 వరకు కేంద్ర రైల్వే మంత్రిగా ఉన్నారు. నష్టాల్లో ఉన్న ఇండియన్ రైల్వేను లాభాల బాటలోకి తీసుకువచ్చి, హార్వార్డ్, వార్టన్ యూనివర్సిటీల్లో ప్రసంగాలు ఇచ్చారు. 2000 నుంచి 2005 వరకు ఆయన భార్య రబ్రీదేవీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. కేంద్రంలో 2014లో బీజేపీ ప్రభుత్వం రావడంతో ఆయనకు కష్టాలు మొదలయ్యాయి. ముఖ్యమంత్రిగా, రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ సీబీఐ, ఈడీ కేసులు నమోదు కావడం, జైలు జీవితం అనుభవించడం తెలిసిందే. గడచిన మూడు అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ, ఆయన కుమారుడు తేజస్వీ పోరాడుతున్నా అధికారం చేజిక్కడం లేదు. మధ్యలో కొద్ది రోజులు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తో చేతులు కలపడంతో కుమారుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎం అయ్యారు. ఆ తరువాత మళ్లీ ఎన్డీఏ లో చేరడంతో తేజస్వీ రాజీనామా చేయక తప్పలేదు. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహా ఘట్ బంధన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది. ఆర్జేడీ 25 స్థానాలు గెలుపొందగా, కాంగ్రెస్ పార్టీ కేవలం ఆరు స్థానాలను మాత్రమే దక్కించుకున్నది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి వస్తామనే ధీమాను వ్యక్తం చేయడంతో పాటు శ్రేణుల్లో ఆ భరోసాను తేజస్వీ యాదవ్ కల్పించారు. ఎన్నికల ఫలితాల్లో అంచనాలు తారుమారు కావడంతో లాలూ ప్రసాద్ కుటుంబంలో లుకలుకలు బయటపడ్డాయి.

లాలూకు ఏడుగురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. రెండో కుమార్తె రోహిణీ ఆచార్య వైద్యుడిని పెళ్లాడి సింగపూర్‌లో స్థిరపడ్డారు. శనివారం రోహిణి.. తన సోదరుడిపై తీవ్ర ఆరోపణలు సంధించారు. తనను ఇంటి నుంచి వెళ్లగొట్టారని, అనుచరుల ముందే తనపై చెప్పులు విసిరారని రోహిణి కన్నీటి పర్యంతమయ్యారు. ‘ఓ కుమార్తెగా, సోదరిగా, తల్లిగా అవమానం ఎదుర్కొన్నాను, నా ఆత్మగౌరవం విషయంలో రాజీపడను’ అని స్పష్టంచేశారు. ఇక నుంచి రాజకీయాల్లో ఉండను అంటూ గుడ్ బై చెప్పారు. తన తండ్రికి కిడ్నీ ఇచ్చినందుకు, కోట్లు తీసుకున్నట్లు అవమానాలకు గురి చేశారని వాపోయారు.

ఓటమితో ఏడుస్తున్న సోదరిని, తల్లిదండ్రులను నిన్న ఓ కూతురు నిస్సహాయతతో వదిలివెళ్లిందని, మా అమ్మ ఇంటిని వదిలేసి వెళ్లిపోవాల్సి వచ్చిందని… నన్ను అనాథను చేశారని రోహిణి ఆచార్య వాపోయింది. మీరు ఎప్పటికీ నా మార్గాన్ని అనుసరించవద్దంటూ.. ఏ కుటుంబానికి రోహిణీ వంటి కుమార్తె, సోదరి ఉండకూడదని కోరుకుంటున్నా అని మరో భావోద్వేగపూరిత పోస్టు చేశారు. నిన్న నన్ను మురికిదానిని అని తిట్టారని, నా మురికి కిడ్నీనే తండ్రికి మార్పిడి చేయించానని… రూ.కోట్లు, టికెట్లు తీసుకొన్నాకే మురికి కిడ్నీ ఇచ్చాను అంటూ తన పట్ల కుటుంబం వ్యవహరించిన తీరుపై ఆవేదన వెళ్లగక్కింది. ‘నా నుంచి చాలా పెద్ద తప్పు జరిగింది. నేను నా కుటుంబాన్ని, నా ముగ్గురు పిల్లలను చూసుకోలేదు. కిడ్నీ ఇచ్చే సమయంలో నా భర్త, అత్తమామల అనుమతి తీసుకోలేదు. నా దేవుడు వంటి తండ్రిని కాపాడుకొనేందుకు ఆ పనిచేశాను. ఇప్పుడు మురికిదానిని అని మాటలు పడుతున్నాను. మీరంతా నాలాంటి తప్పు ఎప్పటికీ చేయకూడదు. రోహిణీ వంటి కుమార్తె ఏ ఇంట్లోనూ ఉండకూడదు’ అంటూ ఆమె పోస్ట్‌ చేశారు. అంతకు ముందు ఆర్జేడీ ఎంపీ సంజయ్‌ యాదవ్‌, తేజస్వీ మిత్రుడు రమీజ్‌ ఖాన్‌ కారణంగానే తాను కుటుంబాన్ని వీడినట్లు రోహిణి ప్రకటించిన సంగతి తెలిసిందే. లాలు ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు తేజ్‌ ప్రతాప్‌ను ఆర్జేడీ నుంచి బహిష్కరించడంపై అసంతృప్తిగా ఉన్న రోహిణి కుటుంబంపై తన అసహనాన్ని ఈ రకంగా వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తేజస్వి యాదవ్ కి మద్దతుగానే ప్రచారం చేయడం గమనార్హం. గతేడాది సరన్ లోక్ సభకు జరిగిన ఎన్నికల్ల రోహిణీ పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుంచే కుటుంబంలో అంతర్గగతంగా గొడవలు మొదలై, ఈ ఎన్నికల ఫలితాల తరువాత బయటపడ్డాయని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.

మూడో కుమార్తె చందా సింగ్, నాలుగో కుమార్తె రాగిణీ యాదవ్, ఎనిమిదో సంతానం రాజిలక్ష్మీ సింగ్ యాదవ్ కూడా ఆదివారం పాట్నాలోని 10 సర్క్యులర్‌ రోడ్డులోని లాలూ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయారు. ఫలితాల తరువాత ఇంట్లో గొడవలు జరుగుతుండటం, విభేదాలు తారస్థాయికి చేరుకోవడంతో ఎవరి దారి వారు చూసుకుని తమ సామాన్లు సర్ధుకుని వెళ్లిపోయారని అంటున్నారు. కుటుంబ కలహాలు, కోర్టు కేసుల కారణాలే కాకుండా అధికారం కోల్పోవడంతో కొన్నేళ్లుగా లాలూ ప్రసాద్ యాదవ్ మానసికంగా సంఘర్షణకు గురవుతున్నారు. పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ భార్యతో విడాకులు తీసుకోవడం, సోదరుడితో పొసగకపోవడంతో పార్టీ నుంచి ఈ ఏడాది ప్రారంభంలో బహిష్కరణకు గురయ్యారు. ఆయన జనశక్తి జనతాదళ్ పార్టీ ఏర్పాటు చేసి మహువా నుంచి పోటీ చేయగా ఓటమి పాలయ్యారు.