మహా శివుడికి మోదుగు పూలంటే ఎంతో ప్రీతి అని పురాణాలు చెబుతున్నాయి. సోమవారం నాడు శివుడిని మోదుగు పూలతో పూజిస్తే కోరుకున్న కోరికలు తీరుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు. మోదుగు పూలతో పాటు కొమ్మలను కూడా పూజల్లో వినియోగిస్తారు. అందుకే శివరాత్రి రోజున శివుడికి మోదుగు పూలు సమర్పిస్తుంటారు భక్తులు. ఇక ప్రతి సోమవారం కూడా మోదుగు పూలతో శివుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఈ మోదుగు పువ్వులను కొన్ని ప్రాంతాల్లో గోగు పువ్వులు అని కూడా పిలుస్తారు.
పత్రి ఆకులతో పాటు ఈ గోగు పువ్వులు శివునికి అర్పించి భక్తులు వారి కోరికలు చెప్పుకుంటారు. ఈ గోగు పువ్వులు అడవి ప్రాంతంలో ఉండడంతో వీటిని ప్రత్యేకంగా అడవి నుంచి తీసుకు వచ్చి శివాలయాలు ముందు విక్రయిస్తారు. అయితే ఈ గోగి పువ్వుకు మరో ప్రత్యేకత ఉంది. కాముడు పున్నం అంటే హోలీ పండగా. కాముడు కాలిన తరువాత రంగులు ఆడుకోవడం ఆనవాయితి. అయితే హోలీ రంగుకోసం గోగుపువ్వును తీసుకువచ్చి సన్నగా దంచుకుని నీటిలో కలిపి హోళీ రంగులు ఆడుకునేవారు.
శివుడికి బిల్వ పత్రం సమర్పించడం చాలా ముఖ్యం. మూడు ఆకులతో కూడిన ఈ బిల్వ పత్రం శివుడి మూడు కనులను సంకేతం. అలాగే త్రిశూలానికి చిహ్నం. ఇవి గత మూడు జన్మల పాపాలను హరిస్తాయి. అయితే ఈ ఆకులను చెట్టు నుంచి కోసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. బిల్వపత్రాన్ని సోమవారం, అమావాస్య, మకర సంక్రాంతి, పౌర్ణమి, అష్టమి, నవమి రోజుల్లో కోయరాదు. వీటిని చెట్టు నుంచి వేరు చేసిన తర్వాత నీటితో శుభ్రం చేసి మాత్రమే ఈశ్వరుడికి సమర్పించాలి.