మూడో రోజు ఇంగ్లండ్‌ని తొందరగానే చుట్టేసిన భారత బౌలర్స్.. యశస్వి చుక్కలు చూపిస్తున్నాడుగా..!

మూడో టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. రెండో రోజు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ విజృంభించినప్పటికీ మూడో రోజు మాత్రం తొందరగానే చుట్టేశారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 319 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 207/2తో మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్ ఇవాళ ఆటలో ఎనిమిది వికెట్స్‌కి కేవలం 112 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యక్తిగత కారణాలతో జట్టుకు దూరమైనప్పటికీ మిగిలిన టీమిండియా బౌలర్లు అదరగొట్టడంతో ఇంగ్లండ్ తొందరగానే ఆలౌట్ అయ్యారు.
అయితే హైదరాబాద్ పేసర్ మహ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో బెంబేలెత్తించడంతో ఇంగ్లండ్ తమ చివరి ఎనిమిది వికెట్లు 95 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఇక 126 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నిగ్స్ మొదలు పెట్టిన భారత్ రోహిత్ శర్మ వికెట్ తొందరగానే కోల్పోయింది. రోహిత్ శర్మ (19; 28 బంతుల్లో) జో రూట్ బౌలింగ్‌లో వికెట్లు ముందు దొరికిపోయాడు. దాంతో జైస్వాల్ ముందు నెమ్మదిగా ఆడాడు. ఓ దశలో 73 బంతుల్లో జైస్వాల్ 35 పరుగులు మాత్రమే చేయగా, ఆ తర్వాత పూనకం వచ్చినట్లుగా జైస్వాల్ చెలరేగి ఆడాడు. అండర్సన్ బౌలింగ్‌లో 6, 4, 4 బాదాడు. ఆ తర్వాత టామ్ హర్ట్‌లీ వేసిన ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు సాధించి 78 బంతుల్లో అర్ధశతకం బాదాడు.
బౌండరీతో సెంచరీ మార్క్‌ను అందుకున్న జైస్వాల్ ఆ ఆనందాన్ని మాములుగా సెలబ్రేట్ చేసుకోలేదు. గాల్లో జంప్ చేస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఈ సమయంలో డ్రెస్సింగ్ రూమ్‌లో ఉన్న రోహిత్ శర్మ ‘కమాన్’అంటూ జైస్వాల్ సెంచరీని సంబరాలు చేసుకోవడం అందరికి ఆసక్తికరంగా మారింది. ఇక గిల్ 50 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు. మూడో రోజు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టానికి 179 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ కంటే 305 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక భారత్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 445 పరుగులు చేసిన విషయం తెలిసిందే.