Viral Story | విడాకుల ఊరేగింపు.. మేళతాళాలతో కూతురిని పుట్టింటికి తీసుకొచ్చిన తండ్రి

Viral Story | అత్తింట్లో తన బిడ్డ పడుతున్న కష్టాలను చూసి ఓ తండ్రి తట్టుకోలేకపోయాడు. అత్తమామలు, భర్త వేధింపులతో బోరుమంటున్న బిడ్డను మేళతాళాల సందడి మధ్య, టపాసులు కాల్చుతూ ఊరేగింపుగా పుట్టింటికి తీసుకొచ్చాడు తండ్రి. ఈ సంఘటన జార్ఖండ్ రాజధాని రాంచీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రాంచీకి చెందిన ప్రేమ్ గుప్తాకు సాక్షి గుప్తా అనే కూతురు ఉంది.ఆమెకు 2022, ఏప్రిల్ 28న సచిన్ కుమార్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేశాడు. అయితే పెళ్లైన కొద్ది రోజుల నుంచి సాక్షికి వేధింపులు అధికమయ్యాయి. సచిన్ అప్పటికే రెండు వివాహాలు చేసుకున్నట్లు సాక్షికి తెలిసింది. అయినప్పటికీ అతనితోనే తన బంధాన్ని కొనసాగించాలని సాక్షి నిర్ణయించుకుంది. కానీ వేధింపులు తగ్గలేదు. దీంతో తన భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నానని తండ్రి ప్రేమ్ గుప్తాకు తెలిపింది. ఇందుకు ప్రేమ్ గుప్తా అంగీకరించాడు.
ఇక అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకొచ్చేందుకు ఘనంగా స్వాగత ఏర్పాట్లు చేశారు. మేళతాళాల మధ్య, టపాసులు కాల్చుతూ ఊరేగింపుగా సాక్షిని తన ఇంటికి తీసుకొచ్చాడు ప్రేమ్ గుప్తా. కుమార్తెలు ఎంతో విలువైన వారని, అత్తింట్లో వేధింపులకు గురైతే వారిని పుట్టింటికి గౌరవంతో తీసుకురావాలని ఆయన చెప్పారు. వేధింపులకు గురిచేసిన సచిన్‌తో విడాకులు ఇప్పించాలని సాక్షి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సచిన్ జార్ఖండ్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్‌లో అసిస్టెంట్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు.