Visakhapatnam: త‌ల్లీకూతుళ్ల‌పై.. ప్రేమోన్మాది దాడి! తల్లి మృతి.. కుమార్తెకు తీవ్ర గాయాలు

  • By: sr    news    Apr 02, 2025 6:55 PM IST
Visakhapatnam: త‌ల్లీకూతుళ్ల‌పై.. ప్రేమోన్మాది దాడి! తల్లి మృతి.. కుమార్తెకు తీవ్ర గాయాలు

విధాత: ప్రేమించిన యువతి దక్కదేమోనన్న అసహనంతో ఓ ప్రేమోన్మాది కత్తితో ఆమె గొంతుకోసి అడ్డు పడిన తల్లిని హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. విశాఖ నగరం మధురవాడ పోలీస్ స్టేషన్ల పరిధిలోని స్వయం కృషి నగర్ లో స్థానికుల సమాచారం ప్రకారం.. మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఓ యువకుడు బాధితురాలు దీపిక ఇంట్లోకి చొరబడి యువతి, ఆమె తల్లిపై కిరాతకంగా కత్తితో దాడి చేసి పారిపోయాడు. ఈ ఘటనలో తల్లి లక్ష్మి(43) అక్కడికక్కడే మృతి చెందగా.. తీవ్ర గాయాలైన దీపికను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

దీపిక డిగ్రీ చదువుకొని ఇంట్లోనే ఉంటోంది. యువతిని ప్రేమించిన నవీన్ అనే వ్యక్తి ఈ దాడి చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దర్యాప్తులో భాగంగా బృందాలుగా ఏర్పడిన పోలీసులు నవీన్ కోసం గాలింపు చేపట్టారు. నిందితుడిని శ్రీకాకుళం సమీపంలో అదుపులోకి తీసుకొని విశాఖ తరలిస్తున్నట్టు సీపీ శంఖబ్రత బాగ్చీ తెలిపారు. ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే నిందితుడిని పోలీసులు పట్టుకున్నారు. ఆరేళ్లుగా దీపికను నవీన్ ప్రేమిస్తున్నాడని..అయితే నవీన్ ప్రవర్తన సరిగా లేదని పెళ్లికి ఒక ఏడాది ఆగమని దీపిక తండ్రి చెప్పాడని దీంతో అతను కోపంతో దాడికి పాల్పడ్డాడని సీసీ వివరించారు.

కఠిన చర్యలు తీసుకోవాలి: పోలీసులకు సీఎం ఆదేశం

ప్రేమోన్మాది ఘాతుకంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ ఘటనపై హోంమంత్రి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విశాఖ సీపీ శంఖబ్రత బాగ్బీతో ఫోన్లో మాట్లాడి.. బాధితురాలు దీపిక ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. యువతికి మెరుగైన వైద్యం అందించాలన్నారు. నిందితుడిని కఠినంగా శికించాలని పోలీసులను మంత్రి ఆదేశించారు.