మళ్లీ పెగాసస్‌ కలకలం.. ప్రముఖ పాత్రికేయులను టార్గెట్‌ చేసిన కేంద్రం

పెగాసస్‌ స్పైవేర్‌ మరోసారి కలకలం రేపింది. ప్రముఖ పాత్రికేయులను దీని ద్వారా ప్రభుత్వం టార్గెట్‌ చేస్తున్నదని ఆమ్నెస్టీ పేర్కొన్నది.

  • Publish Date - December 28, 2023 / 03:30 PM IST
  • జాబితాలో సిద్ధార్థ వరదరాజన్‌, ఆనంద్‌ మాంగ్నాలే
  • ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ వెల్లడి
  • అనైతిక నిఘా నీడలో భారతీయ పాత్రికేయులు
  • ఇప్పటికే క్రూర చట్టాల కింద పలువురి అరెస్టు
  • ఆమ్నెస్టీ సెక్యూరిటీ ల్యాబ్‌ హెడ్‌ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : పెగాసస్‌ స్పైవేర్‌తో దేశంలోని ప్రముఖ పాత్రికేయులను భారత ప్రభుత్వం మరోసారి టార్గట్‌ చేసిందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌, వాషింగ్టన్‌ పోస్ట్‌ గురువారం ఒక సంయుక్త నివేదికలో వెల్లడించాయి. ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌ తయారు చేసిన ఈ పెగాసస్‌ ద్వారా దానిని చొప్పించిన ఫోన్‌లో మెసేజ్‌లు, ఈమెయిల్స్‌, ఫోన్‌లోని ఫొటోలు చూడటంతోపాటు వారి కాల్స్‌ వినేందుకు, వారు ఎక్కడెక్కడ ఉన్నారో లొకేషన్‌ గుర్తించేందుకు అవకాశం ఉన్నది. అంతేకాదు.. ఫోన్‌ కెమెరాను ఉపయోగించి దాని యజమాని ముఖాన్ని ఫొటో కూడా ఈ స్పైవేర్‌ తీయగలదు. ప్రభుత్వాలకు, నిఘా సంస్థలకు మాత్రమే విక్రయించే ఈ స్పైవేర్‌ను భారత్‌ సహా పదుల కొద్దీ దేశాల్లోని జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలపై అక్రమంగా ఉపయోగించడాన్ని పలు స్వచ్ఛంద సంస్థలు, వాచ్‌డాగ్స్‌ ఇప్పటికే బయటపెట్టాయి. వైర్‌ సంపాదకుడు సిద్ధార్థ వరదరాజన్‌, ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్ట్‌ (ఓసీసీఆర్పీ)కి చెందిన ఆనంద్‌ మాంగ్నాలే వంటివారి ఐఫోన్‌లను ఈ స్పైవేర్‌ టార్గెట్‌ చేసిందని ఆమ్నెస్టీ పేర్కొన్నది. తమ విధిని తాము నిర్వహిస్తున్నందుకు గాను ఇండియాలోని జర్నలిస్టులు అనైతిక నిఘా నీడలో ఉన్నారని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ హెడ్‌ డాన్‌చా ఓ సెరాభైల్‌ వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలువురు క్రూరచట్టాల కింద అరెస్టవుతున్నారని, వేధింపులకు, బెదిరింపులకు గురవుతున్నారని, దీంతో ప్రతికూల వాతావరణం నెలకొని ఉన్నదని ఆయన చెప్పారు. అయితే.. ఆమ్నెస్టీ తాజా నివేదికపై భారత ప్రభుత్వం ఇంకా అధికారికంగా స్పందించలేదు.

చివరిసారిగా అక్టోబర్‌లో

చివరిసారిగా పెగాసస్‌ స్పైవేర్‌ను ఉపయోగించిన సందర్భాన్ని అక్టోబర్‌ నెలలో గుర్తించారు. దాదాపు వెయ్యిమంది జర్నలిస్టులు, ప్రతిపక్ష నేతలు, సామాజిక కార్యకర్తల ఫోన్‌ నంబర్లలో పెగాసస్‌ స్పైవేర్‌ను చొప్పించారని 2021లో కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రధాన ప్రత్యర్థి, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కూడా పెగాసస్‌ బాధితుడే. అనధికారిక నిఘా పెట్టారన్న ఆరోపణలను ఖండించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ ఆరోపణలపై సుప్రీంకోర్టులో విచారణకు సహకరించడం లేదు.


ప్రభుత్వ వ్యతిరేకత ఉంటే.. ఎటాక్‌

మోదీ సన్నిహితుడిగా పేరున్న బిజినెస్‌ టైకూన్‌ గౌతం అదానీ ఆర్థిక లావాదేవీల గురించి ఓసీసీఆర్పీ ఆగస్ట్‌లో ఒక పరిశోధనాత్మక కథనాన్ని వెలువరించింది. తాజాగా పెగాసస్‌ టార్గెట్‌ అయిన రెండు పేర్లలో ఒకటి ఓసీసీఆర్పీ ప్రతినిధిది కావడం గమనార్హం. ఇటీవల ఢిల్లీలో ఒక ప్రముఖ వార్తా సంస్థ (న్యూస్‌క్లిక్‌) పాత్రికేయుడిని నిర్బంధించడాన్ని వ్యతిరేకించినందుకు తనను టార్గెట్‌ చేశారని వైర్‌ పాత్రికేయుడు సిద్ధార్థ వరదరాజన్‌ పేర్కొన్నారు.


ప్రభుత్వ ప్రాయోజిత ఎటాకర్లు!

ఇటీవల ఆపిల్‌ ఫోన్‌ వాడుతున్న పలువురు ప్రముఖులకు ప్రభుత్వ ప్రాయోజిత దాడులకు గురయ్యే అవకాశం ఉన్నదంటూ సదరు ఫోన్‌ సంస్థ హెచ్చరికలు పంపిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థగా పేర్కొనే ఇండియాలో మోదీ హయాంలో భావ ప్రకటనా స్వేచ్ఛ కరువైందని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. వరల్డ్‌ ప్రెస్‌ ఫ్రీడం ఇండెక్స్‌లో మొత్తం 180 దేశాలకు గాను భారత్‌ స్థానం 161గా ఉన్నది. అంటే.. గతం కంటే 21 ర్యాంకులు దిగజారింది. ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాసే పాత్రికేయులు చట్టపరంగా వేధింపులకు గురవుతున్నారు. ఆన్‌లైన్‌లోనూ వారిపై పెద్ద ఎత్తున దూషణల పర్వం సాగుతున్నది.