జాన్వీ క‌పూర్ మోకాళ్లపై తిరుమల మెట్లెక్కేసిందిగా.. వీడియో వైర‌ల్‌!

జాన్వీ క‌పూర్ మోకాళ్లపై తిరుమల మెట్లెక్కేసిందిగా.. వీడియో వైర‌ల్‌!

అతిలోకసుంద‌రి శ్రీదేవి త‌న‌య జాన్వీ క‌పూర్ ధ‌ఢ‌ఖ్ సినిమాతో ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి ఆ త‌ర్వాత వ‌రుస ప‌రాజ‌యాలు చ‌వి చూసింది. బాలీవుడ్‌లో స‌రైన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో తెలుగు ఇండ‌స్ట్రీపై దృష్టి పెట్టింది. తెలుగులో స్టార్ యంగ్ హీరోలతో నటిస్తూ భారీ ప్రాజెక్టులను అందుకొంటున్నది. ఎన్టీఆర్ తో దేవ‌ర చేస్తున్న ఈ చిన్న‌ది ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్‌తో ఆర్సీ 16లో క‌థానాయిక‌గా ఎంపికైంది. రీసెంట్‌గా జ‌రిగిన మూవీ ప్రారంభోత్స‌వ వేడుక‌లో జాన్వీ క‌పూర్ చీర క‌ట్టులో క‌నిపించి మామ్ శ్రీ‌దేవిని గుర్తు చేసింది. ఆస్కార్ గ్ర‌హీత‌, సంగీత దిగ్గ‌జం ఏ.ఆర్.రెహ‌మాన్ , మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వంటి ప్ర‌ముఖుల‌తో వేదిక పంచుకోవ‌డంతో జాన్వీ సంతోషంగా ఫీలైంది.

నిన్న ఆర్సీ 16 వేడుక‌లో పాల్గొన్న జాన్వీ క‌పూర్ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. పుట్టిన రోజు, పండగలు, పర్వదినాలు ఇంకా పలు ప్రత్యేక సందర్భాల్లో జాన్వీ క‌పూర్ తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకోవ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం.మార్చి 6న త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ప్రియుడు శిఖర్ పహారియాతో క‌లిసి కాలి న‌డ‌క‌న తిరుమ‌ల వెళ్లింది.అప్పుడు తిరుమ‌ల యాత్ర‌కి సంబంధించిన అనుభవాల‌ని వీడియో రూపంలో తెలియ‌జేశారు జాన్వీ స్నేహితులు ఓరి. చెన్నైలోని జాన్వీ కపూర్‌ ఇంటి నుంచి కారులో బయలుదేరిన తమకు తిరుపతికి చేరుకునేందుకు దాదాపు మూడు గంటల స‌మ‌యం ప‌ట్టింద‌ని పేర్కొన్నారు.

జాన్వీ కపూర్‌ తమ కుటుంబీకులు, బంధువులతో కలిసి నడక దారిన తిరుమల చేరుకున్నామని తెలియ‌జేసిన ఆమె .. మోకాళ్ల మిట్ట దగ్గరకు వచ్చాక జాన్వీ కపూర్‌ – శిఖర్‌ మోకాళ్లపై తిరుమల గుడి మెట్లెక్కారని వీడియోలో తెలియ‌జేశారు. జాన్వీ ఇప్పటివరకు సుమారు 50 సార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న‌ట్టు కూడా ఓరి ఈ వీడియోలో చెప్పుకొచ్చారు.తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానమంటే ఆమెకి ఎంతో ఇష్టమని, కుదిరితే ఇక్కడే వివాహం చేసుకుంటానని గతంలో పలు సార్లు జాన్వీ చెప్పుకొచ్చిన‌ట్టు వీడియోలో స్ప‌ష్టం చేశారు. ఇక జాన్వీ ప్ర‌స్తుతం తెలుగులో రెండు సినిమాల‌తో బిజీగా ఉంది.