MLC Nominations:నామినేషన్లు దాఖలు చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థులు
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మిత్రపక్షం సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా దాసోజు శ్రవణ్ నామినేషన్ దాఖలు చేశారు.

MLC Nominations: తెలంగాణ ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్, సీపీఐ, బీఆర్ఎస్ అభ్యర్థులు సోమవారం తమ నామినేషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి దయాకర్, కేతావత్ శంకర్ నాయక్, విజయశాంతిలు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మిత్రపక్షం సీపీఐ అభ్యర్థిగా నెల్లికంటి సత్యం నామినేషన్ దాఖలు చేశారు.
వారి నామినేషన్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు సీపీఐ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు సహా ఆ పార్టీ నేతలు హాజరయ్యారు.
నామినేషన్ దాఖలు చేసి దాసోజు శ్రవణ్
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపికైన దాసోజు శ్రవణ్ కూడా తన నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి టి.హరీష్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. 11 న నామినేషన్ ల పరిశీలన,13 న ఉపసంహరణ, ఈ నెల 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు. 20 న ఉదయం 8 నుండి సాయం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది.
తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీలు 5 స్థానాలకు జరుగుతున్న ఎన్నికల ప్రక్రియలో ఒక్కో ఎమ్మెల్సీ స్థానం గెలవడానికి 20మంది ఎమ్మెల్యేల తొలి ప్రాధాన్యత ఓట్లు అవసరం. కాంగ్రెస్ కు 65మంది ఎమ్మెల్యేలు, సీపీఐకి 1ఎమ్మెల్యే సంఖ్యాబలం ఉంది. ఎంఐఎంకు 7గురు, బీజేపీకి 8మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
బీఆర్ఎస్ పార్టీకి 29మంది(కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేలు మినహాయించి) ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉంది. ప్రస్తుతం ఆయా పార్టీల ఎమ్మెల్యేల సంఖ్యాబలం మేరకు కాంగ్రెస్ 3 ఎమ్మెల్సీ, సీపీఐ 1ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ 1ఎమ్మెల్సీ స్థానం సునాయసంగా గెలుచుకోనున్నాయి.