Bankruptcy | రుణ ఊబిలో మధ్యతరగతి.. దివాలా దరఖాస్తుకు ప్రభుత్వం అవకాశం ఇస్తుందా?
పేద వర్గాల వారికి ఉపాధి అవకాశాలే కరవవుతుండగా.. అరకొర జీతాలతో బతికే మధ్యతరగతి ప్రజలు, తాము ధనికులమని భావించుకునే ఎగువ మధ్యతరగతి ప్రజలు.. వివిధ రకాల పేర్లతో రుణాలు, టాపప్ల పేరుతో బ్యాంకులకు భారీగా రుణపడిపోతున్నారు.

Bankruptcy | పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర రుణభారాన్ని ఎదుర్కొంటున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. దేశం ఆర్థికంగా పురోగమిస్తున్నదని చెబుతున్నా.. ఖర్చులు మాత్రం అదుపులో ఉండటం లేదు. పేద వర్గాల వారికి ఉపాధి అవకాశాలే కరవవుతుండగా.. అరకొర జీతాలతో బతికే మధ్యతరగతి ప్రజలు, తాము ధనికులమని భావించుకునే ఎగువ మధ్యతరగతి ప్రజలు.. వివిధ రకాల పేర్లతో రుణాలు, టాపప్ల పేరుతో బ్యాంకులకు భారీగా రుణపడిపోతున్నారు. వారికి తెలియకుండానే అప్పుల సుడిగుండంలోకి వెళ్లిపోతున్నారు. తీరా.. ఆదాయాలు బెత్తడే ఉండటంతో వాటిని తీర్చేదారి తెలియక.. రెక్కల కష్టాన్నే నమ్ముకొని జీవితాలను కష్టాలపాలు చేసుకుంటున్నారు. ఇటీవల ఒక సర్వే దిగ్భ్రాంతికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. భారతదేశంలో రుణగ్రహీతల్లో 68 శాతం మంది వాటిని తీర్చేందుకు సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆ సర్వేలో వెల్లడైంది. అప్పులు తీర్చలేక వ్యక్తులు, కుటుంబాలు తమ జీవితాలు చాలించుకుంటున్న వార్తలు అనేకం వస్తున్నాయి. ఒకవైపు పొదుపు విషయంలో పురోగతి కనిపిస్తున్నా.. కుటుంబాల అప్పులు మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరం జీడీపీలో 37.9 శాతంగా ఉన్న వ్యక్తిగత రుణాలు.. 2024 ఆర్థిక సంవత్సరంలో 41 శాతానికి పెరిగాయి. 2025 ఆర్థిక సంవత్సరంలో ఇవి 43 శాతానికి చేరుకుంటాయన్న అంచనాలు వెలువడుతున్నాయి. ఈ రుణాల్లో గృహరుణాలు 30 శాతం ఉన్నా.. గృహేతర రుణాల్లో మాత్రం గణనీయ పెరుగుదల కనిపిస్తున్నది. 2025 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి అవి 32.3 శాతంగా ఉన్నాయి.
ప్రత్యేకించి మధ్యతరగతికి అతిపెద్ద సమస్యగా ఉన్న ఈ రుణభారం నుంచి విముక్తికి ఇండియన్ బ్యాంక్రప్టసీ కోడ్ ద్వారా పరిష్కారం చూపే అంశంపై చర్చ జరుగుతున్నది. అంటే.. నష్టాల్లోకి వెళ్లిపోయిన కంపెనీలు దివాలా ప్రకటించినట్టు.. వ్యక్తులు, కుటుంబాలు కూడా వ్యక్తిగత రుణాలపై దివాలా ప్రకటించడం అన్నమాట. అప్పులు తీర్చడం కోసం కొత్త అప్పులు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తున్నదని సర్వే తెలిపింది. వినియోగదారులపై ఇలాంటి ఒత్తిడి ఉన్నదనే అంశాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా గుర్తించింది. రుణాలు తీసుకుంటున్నవారిలో దాదాపు సగం మంది క్రెడిట్ కార్డులు ఉపయోగించడం, వ్యక్తిగత రుణాలు తీసుకోవడం, వాహనాల వంటివి తాకట్టు పెట్టడం తదితర మార్గాలు అనుసరిస్తున్నారని ద్వైవార్షిక ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్టు డిసెంబర్ 2024 ఎడిషన్లో పేర్కొన్నది. తగు హెచ్చరికలు చేస్తున్నది. 50వేల లోపు రుణాలు తీసుకున్న 11 శాతం రుణగ్రహీతలు గడువు ముగిసిపోయినప్పటికీ ఆ రుణాన్ని తీర్చలేదని, సుమారు 60 శాతం మంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మూడు కంటే ఎక్కువ రుణాలు తీసుకున్నారని గణాంకాలు పేర్కొంటున్నాయి. రుణభారం సమస్య భారీ సంక్షోభంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిని నియంత్రించే విషయంలో ప్రభుత్వం రుణ గ్రహీతలకు ఏదైనా ఉపశమనం కల్పించాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారతీయుల రుణ సమస్యపై ‘ద్వారా రిసెర్చ్’ ఒక నివేదికను రూపొందించింది. దివాలా వ్యవస్థ లేకపోవడం వల్ల రుణ గ్రహీతలు పాక్షికంగానే ఉపశమనం పొందుతారని, అందుకే ఈ ఉపశమనంపై నిషేధాన్ని ఎత్తివేయాల్సిన తక్షణ అవసరం ఉన్నదని పేర్కొన్నది. అతిగా రుణాలు పొందుతున్నారంటే ఇది కొన్ని సంస్థల వైఫల్యానికి దారి తీసేందుకు సమయం ఆసన్నమైనట్టేనని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. రుణగ్రహీతలు తమ రుణ భారాన్ని తొలగించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని చెబుతున్నారు. కార్పొరేట్ రుణాలకే కాకుండా.. వ్యక్తిగత రుణాలకు సైతం బ్యాంక్రప్టసీ కోడ్ను తీసుకురావాలని ఆయన సూచిస్తున్నారు. వాస్తవానికి ప్రస్తుతం భారతదేశంలో కంపెనీకి హామీదారులుగా ఉన్నవారు మాత్రమే దివాలా కోసం దరఖాస్తు చేయవచ్చు. కానీ.. వ్యక్తులకు ఆ వెసులుబాటు లేదు. అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో వ్యక్తులు సైతం దివాలాకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నది. కరోనా అనంతర కాలంలో వ్యక్తుల రుణాలు పేరుకుపోయిన పరిస్థితుల నేపథ్యంలో ఈ అవకాశం కల్పించారు. అయితే భారతదేశంలో ఇలాంటి వ్యవస్థ సాధ్యమవుతుందా? అనేది చర్చనీయాంశంగా మారింది.