Rates Hike | సామాన్యులపై ధరల భారం..! సబ్బులు, పిండి ధరల పెంపు..!
Rates Hike | సామాన్యులకు ఇది నిజంగా షాకింగ్ వార్తే. సబ్బులు, నూనెలు, నూడుల్స్, గోధుమ పిండి తదితర వస్తువుల ధరలు పెరుగబోతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వస్తువుల ధరలు పెంచగా.. మిగతా కంపెనీలు సైతం నేడే రేపో ధరలను పెంచేందుకు రెడీ అయ్యాయి. ముడి పదార్థాలు సహా ఇతర ఉత్పాదక ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలను పెంచకతప్పడం లేదని కంపెనీలు పేర్కొంటున్నాయి.

Rates Hike | సామాన్యులకు ఇది నిజంగా షాకింగ్ వార్తే. సబ్బులు, నూనెలు, నూడుల్స్, గోధుమ పిండి తదితర వస్తువుల ధరలు పెరుగబోతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలు వస్తువుల ధరలు పెంచగా.. మిగతా కంపెనీలు సైతం నేడే రేపో ధరలను పెంచేందుకు రెడీ అయ్యాయి. ముడి పదార్థాలు సహా ఇతర ఉత్పాదక ఖర్చులు పెరిగిన నేపథ్యంలో ధరలను పెంచకతప్పడం లేదని కంపెనీలు పేర్కొంటున్నాయి. ఆయా వస్తువల ధరలను ఒకటి నుంచి ఐదుశాతం వరకు పెంచేందుకు కంపెనీలు రంగం సిద్ధం చేశాయి. దీంతో మధ్యతరగతి ప్రజల నెలవారీ ఖర్చులు పెరగనున్నాయి.
సబ్బులు, బాడీ వాష్‌ల ధరలు 2 నుంచి 9శాతం, కేశ సంరక్షణ నూనెల ధరలు 8 నుంచి 11శాతం, ఎంపిక చేసిన ఆహార పదార్థాల ధరలు 3 నుంచి 17 శాతం వరకు పెరగనున్నట్లు సమాచారం. విప్రో కంపెనీ తన సంతూర్ సబ్బుల ధరలను ఏకంగా 3 శాతం, కోల్గేట్, పామోలివ్, బాడీవాష్‌ల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. స్వల్పకాలంలో కమొడిటీల ధరల పెరుగుదల నేపథ్యంలో ధరలను సవరించబోమని హిందుస్థాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) ప్రకటించింది.
అయితే, తన ఉత్పత్తులు డోవ్ సబ్బుల ధరను 2 శాతం, షాంపూ, చర్మ సంరక్షణ ఉత్పత్తుల ధరలను 4శాతం వరకు, నెస్లే కాఫీ ధరలను 8-13శాతం, మ్యాగీ ఓట్స్ నూడుల్స్ ధరలను ఏకంగా 17శాతం వరకు పెంచింది. ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ హైజీన్ అండ్ హెల్త్‌కేర్, జ్యోతి ల్యాబ్స్ తమ డిటర్జెంట్ల ధరలను 1 నుంచి 10శాతం వరకు పెంచాయి. టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, డాబర్ ఇండియా, ఇమామీ కంపెనీలు ఈ ఏడాది తమ ఉత్పత్తుల ధరలను ఒకటి నుంచి ఐదుశాతం వరకు పెంచనున్నట్లు ప్రకటించాయి. గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ సబ్బుల ధరను 4-5శాతం వరకు పెంచింది. ఇక ఐటీసీ ఆశీర్వాద్ గోధుమ పిండి ధరలను ఒకటి నుంచి ఐదుశాతం వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది.