పెరిగిన బంగారం, వెండి ధరలు

శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 330పెరిగి రూ. 1,50,930 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 240పెరిగి రూ. 1,10,680కి చేరింది. కిలో వెండి ధర రూ. 5000పెరిగి రూ. 2,70,000కు చేరింది.

పెరిగిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు పసిడి మార్కెట్ ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. పశ్చిమాసియాలో నెలకొన్న యుధ్ద మేఘాలతో డాలర్ విలువ అనూహ్యంగా పుంజుకోవడంతో పెట్టుబడిదారులు డాలర్ వైపు తమ పెట్టుబడులను మళ్లిస్తున్నారు. దీంతో బంగారం ధరలలో హెచ్చు తగ్గులు కొనసాగుతున్నాయి. మే తొలి రోజు సాయంత్రానికి బంగారం ధరలు భారీగా తగ్గిపోయాయి. మరికొన్ని గంటల్లోనే తిరిగి పుంజుకున్నాయి.

శనివారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 330పెరిగి రూ. 1,50,930 వద్ద నిలిచింది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 240పెరిగి రూ. 1,10,680కి చేరింది. కిలో వెండి ధర రూ. 5000పెరిగి రూ. 2,70,000కు చేరింది.

దేశీయంగా పెరిగిన బంగారం నిల్వలు

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన గణాంకాలు మన దేశం ఆర్థిక విధానాల్లో వ్యూహాత్మక మార్పును స్పష్టంగా చూపిస్తున్నాయి. భారతదేశం 2025 అక్టోబర్ నుండి 2026 మార్చి మధ్య కాలంలో విదేశీ గడ్డపై ఉన్న తన బంగారంలో దాదాపు 104 టన్నుల బంగారాన్ని స్వదేశానికి రప్పించింది. దీని ఫలితంగా ప్రస్తుతం భారత్ వద్ద ఉన్న మొత్తం 880 టన్నుల బంగారంలో సుమారు 77 శాతం (680 టన్నులు) ఇప్పుడు మన దేశ సరిహద్దుల్లోనే భద్రంగా ఉంది. కేవలం రెండేళ్ల క్రితం వరకు మన బంగారంలో కేవలం 37 శాతం మాత్రమే దేశంలో ఉండేదని గుర్తు చేసుకుంటే, ఈ మార్పు ఎంత వేగంగా జరిగిందో అర్థం చేసుకోవచ్చు.

ఆ యుద్దం నేర్పిన పాఠం

ఇటీవలిదాకా అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ బంగారాన్ని లండన్ లేదా న్యూయార్క్ వంటి పాశ్చాత్య దేశాల ఖజానాల్లో దాచుకోవడాన్ని అత్యంత సురక్షితంగా భావించేవి. అయితే మారుతున్న ప్రపంచ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు రివర్స్ ట్రెండ్ నడుస్తుంది. మన సంపద మన కళ్ల ముందే ఉండాలి అనే సరికొత్త ఆర్థిక సార్వభౌమత్వ నినాదం వినిపిస్తోంది. ఈ క్రమంలో భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలు ప్రపంచ దేశాలకు మార్గదర్శకంగా మారుతున్నాయి.

విదేశాల్లో ఉన్న బంగారాన్ని వెనక్కి తెప్పించుకోవడానికి రష్యా-ఉక్రెయిన్ యుద్ధం భారత్ కు ప్రేరణగా నిలిచింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తర్వాత అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలు రష్యాకు చెందిన విదేశీ నిల్వలను స్తంభింపజేయడం ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. మనం నమ్మి దాచుకున్న ఆస్తులను రాజకీయ కారణాలతో వేరే దేశం నిలిపివేయగలదా?” అన్న భయం ప్రతి దేశంలోనూ మొదలైంది. దీంతో బంగారం మన వద్ద భౌతికంగా లేకపోతే, అది అసలు మనది కానే కాదు అన్న ఆలోచన రేకేత్తించింది. ఈ ఆలోచనే భారతదేశాన్ని తన సంపదపై పూర్తి నియంత్రణ సాధించేలా ప్రేరేపించింది.

ముందు జాగ్రత్త పడిన భారత్

ప్రస్తుతం న్యూయార్క్, లండన్ వంటి నగరాలు ఇప్పటికీ ప్రపంచ గోల్డ్ హబ్‌లుగా కొనసాగుతున్నాయి. దాదాపు 60 దేశాల కేంద్ర బ్యాంకులు తమ బంగారాన్ని అక్కడి ఖజానాల్లోనే భద్రపరుస్తున్నాయి. కానీ ఇటీవలి కాలంలో ఫ్రాన్స్, జర్మనీ, పోలాండ్ వంటి దేశాలు కూడా క్రమంగా తమ నిల్వలను వెనక్కి తెచ్చుకోవడం ప్రారంభించాయి. అయితేభారత్ ఈ విషయంలో చాలా వేగంగా, వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఒకప్పుడు కేవలం లావాదేవీల సౌలభ్యం కోసం బంగారాన్ని విదేశాల్లో ఉంచిన భారత్, ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో వస్తున్న మార్పులను ముందే పసిగట్టి తన ఖజానాను పటిష్టం చేసుకుంటోంది. విదేశీ మారక నిల్వల్లో బంగారం వాటాను 13.9% నుండి 16.7% కి పెంచుకుంటూనే, ఆ నిల్వలపై ప్రత్యక్ష నియంత్రణను కలిగి ఉండటం ద్వారా ఆర్‌బిఐ ఒక రక్షణాత్మక బీమాను పాటిస్తుంది. తద్వారా భద్రత అంటే ఇతరులపై ఆధారపడటం కాదు, మన సంపద మన చేతిలో ఉండటమేనని భారత్ ప్రపంచానికి చాటి చెబుతోంది.

ఇవి కూడా చదవండి :

Firefighters | మంటలు ఆర్పడమే కాదు.. 73 శాతం వేరే పనులు కూడా.. అగ్నిమాపక సిబ్బంది అసలైన బాధ్యతలివే!
Noorjahan Mango | 3 కిలోల మామిడి.. ఒక్కోటి రూ.వెయ్యి.. నూర్జహాన్‌కు పెరుగుతున్న డిమాండ్