అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక పరిణామాల నేపథ్యంలో మార్కెట్లో డాలర్ బలపడటం, పెట్టుబడిదారుల లాభాల స్వీకరణ (ప్రాఫిట్ బుకింగ్)పై ఆసక్తితో బంగారం ధరలలో తగ్గుదల నమోదైంది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. మంగళవారం బులియన్ మార్కెట్ లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,360 తగ్గి రూ.1,45,260 దగ్గర ట్రేడ్ అవుతోంది. అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,250 తగ్గి రూ.1,33,150 పలుకుతోంది. కిలో వెండి ధరలు రూ.2,50,000 వద్ధ స్థిరంగా నిలిచాయి.
అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడటం, పెట్టుబడి దారుల ప్రాఫిట్ బుకింగ్.. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై మార్కెట్ అంచనాలు మారుతుండటం కూడా బంగారం ధరలపై ఒత్తిడిని పెంచింది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధరలు బలహీనపడటంతో దాని ప్రభావం దేశీయ మార్కెట్‌పైనా కనిపించింది. మరోవైపు, స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు పెరగడంతో కొంతమంది పెట్టుబడిదారులు బంగారం నుంచి ఈక్విటీల వైపు నిధులను మళ్లించారు. దీంతో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
అయితే దీర్ఘకాలికంగా బంగారం ధరలు మళ్లీ పుంజుకుంటుాయన్న అభిప్రాయం మార్కెట్ నిపుణుల్లో ఉంది. ప్రపంచ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు, భౌగోళిక ఉద్రిక్తతలు వంటి అంశాలు బంగారానికి ఇప్పటికీ బలమైన మద్దతుగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దీంతో స్వల్పకాలంలో హెచ్చుతగ్గులు కనిపించినప్పటికీ.. రానున్న రోజుల్లో అమెరికా ఆర్థిక గణాంకాలు, డాలర్ కదలికలు, ఫెడరల్ రిజర్వ్ విధాన నిర్ణయాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
