విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక మార్పుల క్రమంలో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గుల పర్వం కొనసాగుతుంది. వరుసగా రెండో రోజు కూడా బంగారం ధరలు పెరుగుదలను నమోదు చేశాయి. శుక్రవారం బులియన్ మార్కెట్ లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.1310 పెరిగి రూ. 1,56,660 పలుకుతుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.1200 పెరిగి రూ. 1,43,600 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ. 2,55,000 వద్ద స్థిరంగా నిలిచింది.
తగ్గినా..మళ్లీ పెరుగుతాయ్..
ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితులు, సెంట్రల్ బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం, అమెరికా ఆర్థిక పరిస్థితి దిగజారుతుండడంతో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి మార్గాల వైపు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే లోహాలపై పెట్టుబడి పెడుతుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇటీవలి కాలంలో వీటి ధరలు బాగా పెరగడంతో కొంతమంది ఇన్వెస్టర్లు తమ లాభాల స్వీకరిస్తున్నారు. అందుకే కొద్ది రోజులు పసిడి ధరలు తగ్గుతూ వచ్చాయి. ఇప్పటికీ కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొనుగోలు చేయడం, ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు వంటి కారణాల వల్ల బంగారం, వెండికి డిమాండ్ భారీగానే ఉందని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ అంచనా వేస్తోంది. గత ఆరు వారాలుగా బంగారం 4,060 డాలర్ల వద్ద, వెండి 58 డాలర్ల దగ్గర ట్రేడవుతున్నాయని అంచనా వేసింది.
చాలా దేశాలు తమ విదేశీ నిల్వల్లో బంగారం వాటాను పెంచుకుంటున్నాయని పేర్కొంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా వడ్డీ రేట్లు తగ్గితే బంగారానికి మరింత డిమాండ్ పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. వడ్డీ రేట్లు తగ్గినప్పుడు బంగారం వంటివి.. పెట్టుబడిదారులకు మరింత ఆకర్షణీయంగా మారుతాయని విశ్లేషించింది. బంగారం ధర ఇంకా సుమారు 12 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని ఎంకే వెల్త్ మేనేజ్‌మెంట్ అంచనా వేసింది. వెండి ధరలు కూడా ఇదే విధంగా పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తోంది. బంగారం, వెండి ధరలు ఎప్పుడూ స్థిరంగా ఉండవని గుర్తించుకోవాలని తెలిపింది. మధ్యలో కొంత తగ్గడం, మళ్లీ పెరగడం సాధారణమేనని వివరించింది. బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారు కొంత మొత్తంలో అయినా పెట్టుబడి పెట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
