విధాత, హైదరాబాద్ : అంతర్జాతీయ భౌగోళిక, ఆర్థిక మార్పుల క్రమంలో బంగారం, వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకపోతున్నాయి. ఆదివారం సెలవు దినం రోజున పసిడి, వెండి ధరలు తమ జోరుకు కాస్తా బ్రేక్ ఇస్తూ..స్థిరంగా నిలిచాయి. హైదరాబాద్ లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,63,090కి చేరింది. ఇక 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 1,49,500 పలుకుతుంది. కిలో వెండి ధర రూ.2,70,000 వద్ద కొనసాగుతుంది.
మళ్లీ రూ. 2లక్షల మార్కు దిశగా పసిడి పరుగులు..
అంతర్జాతీయ మార్కెట్లో ఏర్పడిన ఆకస్మిక మార్పులు, ఆర్థిక అనిశ్చితులు పసిడి ప్రియులను, ఇన్వెస్టర్లను మళ్లీ బంగారం వైపు నడిపిస్తున్నాయి. డాలర్ సూచీ బలహీనపడటం, అమెరికా ప్రభుత్వ బాండ్లపై రాబడులు తగ్గడం, ఆ దేశ రుణ భారం అంతకంతకూ పెరిగిపోతుండటంతో సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం డిమాండ్ ఒక్కసారిగా పెరిగింది. గడిచిన వారం రోజుల్లోనే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధర దాదాపు 5 శాతం మేర పుంజుకుంది. విదేశీ మార్కెట్ల ప్రభావంతో భారతదేశంలో కూడా పసిడి ధరలు అదే బాటలో పయనిస్తూ మళ్లీ రికార్డు స్థాయి వైపు అడుగులు వేస్తున్నాయి.
ఈ ఏడాది ఆరంభంలో అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సుకు దాదాపు 5,600 డాలర్ల రికార్డు స్థాయిని తాకిన తర్వాత.. పశ్చిమాసియా సంక్షోభంతో కొన్ని నెలలుగా తీవ్ర హెచ్చుతగ్గులకు గురయ్యాయి. ఆగస్టు మాసం నుంచి క్రమంగా పుంజుకుంటున్న బంగారం ధరల ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే ఈ ర్యాలీ మరిన్ని కొత్త రికార్డులకు దారితీస్తుందా లేక మళ్లీ ధరలు తగ్గుముఖం పడతాయా అనే చర్చ మార్కెట్ వర్గాల్లో మొదలైంది. బంగారం ఊహించిన దానికంటే ఎక్కువ పెరిగిందని మోర్గాన్ స్టాన్లీ తన నివేదికలో తెలిపింది. వచ్చే ఏడాది పసిడి ధర ఔన్సుకు 5,000 డాలర్లు దాటుతుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొంది. ధరల పెరుగుదల క్రమంలో ఒడిదుడుకులు ఉంటాయని పేర్కొంది.
అమెరికా మొత్తం ప్రభుత్వ అప్పు.. చరిత్రలోనే తొలిసారిగా 40 ట్రిలియన్ డాలర్ల మార్కును దాటడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.పెరుగుతున్న రుణ భారం, వడ్డీ చెల్లింపుల వల్ల డాలర్‌పై నమ్మకం సడలుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెంట్రల్ బ్యాంకులు కూడా డాలర్, అమెరికా ట్రెజరీలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ తమ రిజర్వుల్లో బంగారు నిల్వలను విపరీతంగా పెంచుకుంటున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్వహించిన సర్వే ప్రకారం.. ఏకంగా 89 శాతం సెంట్రల్ బ్యాంకులు రాబోయే ఏడాదిలో తమ పసిడి నిల్వలను మరింత పెంచుకోవాలని భావిస్తున్నట్లు వెల్లడించింది.
యూబీఎస్ (UBS) నివేదిక ప్రకారం రాబోయే 12 నెలల్లో బంగారం ఔన్సుకు 5,400 డాలర్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తుండగా.. మోర్గాన్ స్టాన్లీ, జేపీమోర్గాన్ సంస్థలు 2027 నాటికి ఔన్సుకు 5 వేల డాలర్ల మార్కును అధిగమిస్తుందని చెబుతున్నాయి. ఈ గ్లోబల్ అంచనాలు నిజమైతే.. మన దేశంలో ద్రవ్యోల్బణం, రూపాయి మారకపు విలువ, దిగుమతి సుంకాల ప్రభావం కలిసి భారతీయ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర సునాయాసంగా రూ. 2 లక్షల మార్కుకు చేరే అవకాశం ఉందనేది విశ్లేషకుల అభిప్రాయం.
