IPO: సెబీకి DRHP.. సమర్పించిన రవి ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్

ముంబయి:ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా రూ. 1,100 కోట్లు సమీకరించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సమగ్ర సివిల్ కన్‌స్ట్రక్షన్ సేవల కంపెనీ రవి ఇన్‌ఫ్రాబిల్డ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ తమ ముసాయిదా ప్రాస్పెక్టస్‌ని (డీఆర్‌హెచ్‌పీ) సమర్పించింది. ఐపీవో కింద రూ. 10 ముఖ విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయడం ద్వారా కంపెనీ రూ. 1,100 కోట్ల వరకు సమీకరించనుంది. ఇందులో ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విధానం కింద షేర్ల విక్రయం ఉండదు.
సమీకరించిన నిధులను కొత్త పరికరాల కొనుగోలు, అనుబంధ సంస్థలు తీసుకున్న రుణాల చెల్లింపునకు వాటిలో ఇన్వెస్ట్ చేయడం, ఇతరత్రా కార్పొరేట్ అవసరాల కోసం కంపెనీ వినియోగించుకోనుంది. 2024 డిసెంబర్ 31 నాటికి కంపెనీ ఆర్డర్ బుక్ రూ. 3,092 కోట్లుగా ఉంది. ప్రభుత్వ రంగ క్లయింట్ల కోసం కంపెనీ రహదారులు, హైవేలు, వంతెనలు, ప్లైఓవర్లు, టన్నెల్స్ మొదలైన వాటి నిర్మాణ సేవలు అందిస్తోంది.
రాజస్థాన్, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో రెండు దశాబ్దాల పైగా కార్యకలాపాలు సాగిస్తోంది. డీఅండ్‌బీ నివేదిక ప్రకారం 2024 ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆర్డర్ బుక్ మరియు లాభంపరంగా అత్యంత వేగంగా ఎదుగుతున్న ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్) సంస్థల్లో ఒకటిగా కంపెనీ నిలిచింది. మోతీలాల్ ఓస్వాల్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్స్ లిమిటెడ్, యాక్సిస్ క్యాపిటల్ లిమిటెడ్ సంస్థలు ఈ ఇష్యూకి బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి.