Silver Price : 2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు

వెండి ధరలు పెరుగుతూ రూ.1,99,000కి చేరాయి. మార్కెట్ నిపుణులు 2 లక్షల మార్క్ దాకా త్వరలో చేరుతుందని అంచనా. పెట్టుబడిదారులకు హెచ్చరిక.

Silver Price : 2లక్షల మార్క్ వైపు.. వెండి ధర పరుగు

విధాత, హైదరాబాద్ : వెండి ధరలు వేగంగా పెరుగుతూ వెలుతున్నాయి. మంగళవారం కిలో వెండి ధర రూ.1000పెరిగి..రూ.1,99,000కి చేరింది. పది రోజుల్లో రూ.7వేలు పెరిగిపోయింది. రేపోమాపో ఆల్ టైమ్ రికార్డు రూ.2లక్షల మార్క్ చేరుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. నవంబర్ 24న రూ.1లక్ష 76వేలుగా ఉన్న వెండి ధర.. ఇటీవల రూ.23వేలకు పైగా పెరిగిపోవడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్ పరిణామాల నేపథ్యంలో వెండి రానున్న ఏడాది కాలంలో రెట్టింపు ధరను అందుకోవడం ఖాయమని అంచనా వేస్తున్నారు. డాలర్ విలువ తగ్గే కొద్దీ వెండి ధర కూడా భారీగా పెరుగుతోందని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెండివైపు తరలిస్తున్నారని నిపుణులు పేర్కొంటున్నారు. దీనికి తోడు వెండి ధర భారీగా పెరగడానికి ప్రధానంగా పారిశ్రామిక ఉత్పత్తుల్లో ఎక్కువగా వెండి వాడకం పెరిగిపోవడం, వెండి ఉత్పతి తగ్గడం కారణంగానే వెండి ధర భారీగా పెరుగుతున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు.

హెచ్చు తగ్గులతో.. ఆల్ టైమ్ రికార్డుకు

2020 ఆగస్టు సమయంలో కిలో వెండి రూ.70,000గా ఉంది. 2022 వరకు రూ.55,000 సమీపంలోనే ఉంది. 2023 నుంచి వెండి ధర పెరుగుతూ వచ్చి రూ.80,000 వరకు, 2024లో రూ.95,000కు చేరింది ఈ ఏడాది జనవరిలోనే తొలిసారిగా రూ.లక్షను మించింది. తదుపరి పెరుగుతూ వచ్చి ఇప్పుడు రూ.1లక్ష 99వేలకు చేరుకుంది. వచ్చే ఏడాది ఆఖరుకల్లా రూ.2.50 లక్షలకు చేరడం ఖాయమన్న అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ ఏడాది కేవలం ఒక్క వారంలోనే 100 టన్నుల వెండి అమ్ముడైపోయింది. సాధారణ వినియోగదారులు, మదుపరులు, పారిశ్రామిక వర్గాల నుంచి వెండికి ఆదరణ అంతకంతకూ పెరుగుతున్నదని భారతీయ బులియన్‌, జ్యుయెల్లర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. సాధారణంగా నెలలో 10-15 టన్నుల వెండికే గిరాకీ ఉంటుంది. కానీ వారంలోనే 100 టన్నులకు డిమాండ్‌ రావడం ఇప్పుడు మార్కెట్‌ నిపుణులనూ ఆశ్చర్యపరుస్తున్నది.

అడ్వైజరీ, మార్కెట్ రిపోర్టుల ప్రకారం.. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసిఎక్స్)లో కేవలం 10 రోజుల్లోనే వెండి ధర 20% పెరిగింది. ఇది వెండి ధరలలోని బలమైన పెరుగుదల ధోరణిని స్పష్టంగా సూచిస్తుంది.

బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల

వెండి ధరలు పైపైకి పోతుంటే..దేశీయంగా బంగారం ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్ నగరంలో 22 క్యారెట్ల పుత్తడి ధర రూ. 300తగ్గి తులం రూ. 1,19,550 కి చేరింది. కిందటి రోజు మాత్రం స్థిరంగానే ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ. 330 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములకు ఇది రూ. 1,30,420 వద్ద ఉంది.

ఇవి కూడా చదవండి :

Under-14 Cricket Selections : ఐపీఎల్ తెచ్చిన క్రేజ్.. అండర్-14 సెలక్షన్ కు క్యూలైన్స్
Prabhas | జపాన్‌లో భూకంపం.. ప్ర‌భాస్ ఎలా ఉన్నాడ‌ని ఫ్యాన్స్‌లో టెన్ష‌న్.. మారుతి క్లారిటీ