Amazon, Walmart India entry | భారత్‌లోకి అమెజాన్‌, వాల్‌మార్ట్‌ పూర్తిస్థాయి ప్రవేశం? తీవ్ర ఒత్తిడి చేస్తున్న అమెరికా!

ఇంతకు ముందు వీధి చివర దుకాణానికి వెళ్లి నెలవారీ సరుకులు తెచ్చుకునే పరిస్థితి ఉండేది. వాటిని కబళిస్తూ కార్పొరేట్‌ స్టోర్లు వచ్చాయి.. వాటిని సైతం మింగేసేందుకు ఇప్పుడు అమెజాన్‌, వాల్‌మార్ట్‌ పొంచి ఉన్నాయి.

Amazon, Walmart India entry | భారత్‌లోకి అమెజాన్‌, వాల్‌మార్ట్‌ పూర్తిస్థాయి ప్రవేశం? తీవ్ర ఒత్తిడి చేస్తున్న అమెరికా!

Amazon, Walmart India entry | భారతదేశ ఆన్‌లైన్‌ మార్కెట్‌పై అమెరికా కన్నేసింది. దేశంలోని 125 బిలియన్‌ డాలర్ల ఈ కామర్స్‌ మార్కెట్‌లో ఆన్‌లైన్‌ రిటైల్‌ కంపెనీలైన అమెజాన్‌, వాల్‌మార్ట్‌ వంటి వాటికి పూర్తి ప్రవేశం కల్పించాలని ఆశిస్తున్నది. ఈ మేరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ యంత్రాంగం భారత్‌పై తీవ్ర ఒత్తిడిని తీసుకొస్తున్నదని పలువురు పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు, లాబీయిస్టులు, అమెరికా అధికారులను ఉటంకిస్తూ ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పత్రిక మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించింది.

అమెరికా టారిఫ్‌ల నేపథ్యంలో అమెరికా, భారత్‌ మధ్య వాణిజ్య ఒప్పందంపై ఏకాభిప్రాయానికి తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ చర్చల్లో ఈ కామర్స్‌పై సమాన స్థాయి పోటీ (లెవల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) కోసం మోదీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేయాలని అమెరికా భావిస్తున్నదని ఆ కథనం తెలిపింది. ఆహారం మొదలుకుని కార్ల వరకూ వివిధ ఉత్పత్తులపై టారిఫ్‌ల విషయంలో ఈ చర్చలు కొనసాగుతున్నాయి. అయితే.. భారత ప్రభుత్వం ఎలాంటి తరహా చర్యలు తీసుకోవాలని ట్రంప్‌ యంత్రాంగం భావిస్తున్నదీ ఆ పత్రిక తెలియజేయలేదు. అమెజాన్‌, వాల్‌మార్ట్‌ వంటి సంస్థలు భారతదేశంలో స్థానిక యూనిట్ల ద్వారా ఆపరేట్‌ చేస్తున్నాయి.

అయితే దేశీయ సంస్థ రిలయన్స్ మాదిరిగా కాకుండా, లిస్టులను కలిగి ఉండటం, వినియోగదారులకు నేరుగా అమ్మడంలో పరిమితులను ఎదుర్కొంటున్నాయి. రిలయన్స్‌ వంటి సంస్థలకు నేరుగా వినియోగదారులను చేరుకునేందుకు స్టోర్స్‌ ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నది. కానీ.. అమెజాన్‌, వాల్‌మార్ట్‌కు మాత్రం ఈ అవకాశం లేదు. ఇప్పుడు వీటికోసం అమెరికా యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తే.. భారతదేశంలో అమెజాన్‌, వాల్‌మార్ట్‌ స్టోర్లు కూడా వస్తాయి. ఇప్పటికే కార్పొరేట్‌ స్టోర్లతో సాధారణ దుకాణదారులు షట్టర్లు మూసేసుకుంటున్నారు. ఇప్పుడు విదేశీ కంపెనీలు సైతం చొరబడితే.. దేశీయ స్టోర్లు సైతం దివాలా తీయాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అయితే ఈ వార్తలపై రాయిటర్స్‌ స్పందన కోరగా.. అమెజాన్‌, వాల్‌మార్ట్‌ వర్గాలు వెంటనే తమ స్పందనలు తెలియజేయలేదు. అమెరికా టారిఫ్‌లను తప్పించుకునేందుకు ఒక వాణిజ్యం ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్‌ ప్రయత్నిస్తున్నది. ఈ క్రమంలోనే రెండు దేశాల అధికారుల మధ్య విస్తృత స్థాయి చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ భారత పర్యటన నేపథ్యంలో.. 90 రోజుల విరామం ముగిసేలోపే వాణిజ్య ఒప్పందం కుదురుతుందనే ఆశాభావంతో భారత ప్రభుత్వం ఉన్నది.