Credit Card Limit | సాధారణంగా బ్యాంకులు కొత్త క్రెడిట్ కార్డులను ఆఫర్ చేస్తుంటాయి. లేదంటే ఉన్న కార్డులను అప్‌గ్రేడ్ చేసుకోమని చెబుతుంటాయి. కానీ ఇటీవల కాలంలో కొంతమంది వినియోగదారులకు అకస్మాత్తుగా క్రెడిట్ కార్డు లిమిట్‌ను తగ్గించేస్తున్నాయి. ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే అందుబాటులో ఉన్న లిమిట్‌ను సగానికిపైగా తగ్గించడంతో కస్టమర్లు ఆందోళనకు గురవుతున్నాయి. అయితే బ్యాంకులు మీ క్రెడిట్ కార్డు లిమిట్‌ను తగ్గించిందంటే కచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే అర్థం కాదని.. దీని వెనుక అనేక కారణాలు ఉంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
రీపేమెంట్ ప్రవర్తన!
క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గించడానికి ప్రధాన కారణాల్లో ఒకటి రీపేమెంట్ ప్రవర్తన. క్రెడిట్ కార్డు బిల్లులను తరచూ ఆలస్యంగా చెల్లించడం, ఈఎంఐలు వాయిదా వేయడం, కేవలం మినిమం బ్యాలెన్స్ మాత్రమే పే చేయడం వంటి అంశాలను బ్యాంకులు రిస్క్ సూచనలుగా పరిగణిస్తాయి. అందుకే సిబిల్ స్కోర్ బాగానే ఉన్నప్పటికీ.. తమ అంతర్గత రిస్క్ అంచనాల ఆధారంగా లిమిట్‌ను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
క్రెడిట్ కార్డు వినియోగం తగ్గినా బాధే!
బ్యాంకులు తమ ఖాతాదారుల క్రెడిట్ కార్డు వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటాయి. గతంలో తరచూ ఉపయోగించిన కార్డును నెలల తరబడి ఉపయోగించకుండా ఉంటే.. వాటిపై భారీ క్రెడిట్ లిమిట్‌ను కొనసాగించడం అవసరం లేదని బ్యాంకులు భావిస్తుంటాయి. అందువల్ల అలాంటి కార్డుల లిమిట్‌ను తగ్గిస్తాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నాయి. అయితే అత్యవసర పరిస్థితుల కోసం లేదా ప్రత్యేక ఆఫర్ల కోసం మాత్రమే సెకండరీ క్రెడిట్ కార్డులు వాడే వారు దీనివల్ల ప్రభావితమయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
ఆదాయం తగ్గినా కూడా!
మన ఆర్థిక స్థితిలో మార్పులు వచ్చినప్పుడు కూడా బ్యాంకులు క్రెడిట్ కార్డు లిమిట్‌ను తగ్గించేస్తుంటాయి. ఉద్యోగంలో మార్పు, జీతం జమయ్యే ఖాతాలో లావాదేవీలు తగ్గించడం, ఆదాయం తగ్గినట్లు కనిపించడం, ఇతర రుణాల భారం పెరగడం, తక్కువ వ్యవధిలో ఎక్కువ రుణాల కోసం దరఖాస్తు చేయడం వంటి అంశాలు సిబిల్ రిపోర్టు రూపంలో బ్యాంకులు దృష్టికి వస్తుంటాయి. ఈ క్రమంలో గతంలో అధిక లిమిట్‌కు అర్హత పొందిన వ్యక్తి.. ప్రస్తుతం అదే స్థితిలో లేడని బ్యాంకులు భావిస్తే క్రెడిట్ లిమిట్‌ను తగ్గించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
అధిక వినియోగం కూడా ప్రమాదమే..
క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో కూడా బ్యాంకుల నిర్ణయంలో కీలక పాత్ర పోషిస్తుంటాయి. వినియోగదారుడికి అందుబాటులో ఉన్న మొత్తం లిమిట్‌లో ఎక్కువ భాగాన్ని నిరంతరం వినియోగిస్తే.. అది ఆర్థిక ఒత్తిడికి సంకేతమని బ్యాంకులు అంచనా వేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులు కస్టమర్ల ఖాతాను ప్రత్యేకంగా సమీక్షిస్తాయి. రిస్క్ అనుకున్నప్పుడు క్రెడిట్ లిమిట్‌ను తగ్గించేస్తాయి.
ప్రతిసారి కస్టమర్లదే తప్పు కాదు
క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గిందంటే ప్రతిసారి వినియోగదారుడి ప్రవర్తనే కారణమని చెప్పలేం. దేశీయ, అంతర్జాతీయంగా అనిశ్చితి పెరగడం, రుణ వసూళ్లపై ఉన్న ఆందోళనలు, అంతర్గత రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలు కూడా దీనిపై ప్రభావం చూపిస్తుంటాయి. అసురక్షిత రుణాల్లో డిఫాల్ట్‌లు పెరిగే అవకాశం ఉన్నప్పుడు రిస్క్‌ను తగ్గించుకునేందుకు బ్యాంకులు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ఖాతాదారుల లిమిట్‌ను తగ్గిస్తాయి.
క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం
ఇలా క్రెడిట్ కార్డు లిమిట్ తగ్గినప్పుడు అది క్రెడిట్ స్కోర్‌పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఉదాహరణకు ఒక క్రెడిట్ కార్డు లిమిట్ 2 లక్షలు ఉందని అనుకుందాం. అందులో నెలకు 40 వేలు మాత్రమే వాడుతుంటే.. క్రిడెట్ యుటిలైజేషన్ రేషియో 20 శాతంగా ఉంటుంది. అదే లిమిట్‌ను బ్యాంకులు రూ. లక్షకు తగ్గిస్తే.. ఖర్చు మారకపోయినా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో మాత్రం 50 శాతానికి చేరుతుంది. ఇది క్రెడిట్ స్కోర్‌పై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. దీనివల్ల క్రెడిట్ స్కోర్ తగ్గి భవిష్యత్తులో రుణాలు, కొత్త కార్డులు పొందడంలో ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు.
క్రెడిట్ లిమిట్ తగ్గితే ఏం చేయాలి?
బ్యాంకులు క్రెడిట్ కార్డు లిమిట్‌ను తగ్గించగానే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. క్రమం తప్పకుండా బిల్లులు చెల్లిస్తుంటే.. బ్యాంకును సంప్రదించి కారణాలు తెలుసుకోవాలి. కొన్నిసార్లు మన ఆదాయ నిరూపణ కోసం ఆదాయ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అప్పుడు బ్యాంకులు మన ఖాతాను సమీక్షించి లిమిట్‌ను పునరుద్ధరించే అవకాశం ఉంది. అలాగే క్రెడిట్ రిపోర్టును పరిశీలించి మిస్సయిన చెల్లింపులు, తప్పుగా నమోదైన బకాయిలు, తెలియని రుణాలు చెక్ చేసుకోవాలి. వాటిలో ఏదైనా పొరపాటుగా ఉంటే బ్యాంకులకు తెలియజేయాలి.
Read More:
Credit Card Limit | క్రెడిట్ లిమిట్ పెంచుకుంటే లాభమా? నష్టమా? నిపుణుల సలహా ఏంటి?
