Pawan Kalyan | కళ్యాణ్ బాబు నుంచి ఉప ముఖ్యమంత్రివరకు – ఒక అద్భుత యాత్ర

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా ఆయన సినీ ప్రస్థానం, రాజకీయ పోరాటం, వ్యక్తిగత జీవితం, అభిమానుల క్రేజ్‌పై ప్రత్యేక కథనం.

Pawan Kalyan | కళ్యాణ్ బాబు నుంచి ఉప ముఖ్యమంత్రివరకు – ఒక అద్భుత యాత్ర

Pawan Kalyan | సెప్టెంబర్ 2 తెలుగు రాష్ట్రాల అభిమానులకు పండుగ రోజు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 55వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా శుభాకాంక్షల సందేశాలతో నిండిపోయింది. అభిమానులు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడు గురించి మాట్లాడుతూ, “సినిమాల్లో అగ్రనటుడిగా, ప్రజాజీవితంలో జనసేనానిగా, ప్రజాసేవలో నిరంతర యోధుడిగా నిలుస్తున్న పవన్‌కు ఆశీస్సులు” అని ఆశీర్వదించారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, “అతడు అనేకమందిలో చెరగని ముద్ర వేశాడు. మంచి పాలనపై దృష్టి సారిస్తూ ఆంధ్రప్రదేశ్‌లో NDAని బలోపేతం చేస్తున్నారు” అని ట్వీట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు “అడుగడుగునా సామాన్యుడి పక్షం, రాజకీయాల్లో విలువలకు పట్టం, మాటకు కట్టుబడే తత్వం కలిసిన వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్” అంటూ ప్రత్యేకంగా విశేషించారు.

సినీ ప్రస్థానం – స్టైల్, మేనరిజం, క్రేజ్

1996లో ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ ద్వారా వెండితెరపై అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, తాను మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు అనే ట్యాగ్‌ను మించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.
సాధారణ బాడీ లాంగ్వేజ్‌లోనూ, సాదాసీదా కాస్ట్యూమ్స్‌లోనూ పవన్ వేరు. ప్యాంట్ మీద ప్యాంట్ వేసినా, చేయి మెడపై పెట్టుకున్నా అభిమానులు పిచ్చెక్కిపోతారు. ఆయన పేరు వినగానే ఓ వైబ్రేషన్ కలుగుతుంది.
‘తమ్ముడు’, ‘ఖుషి’, ‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’ వంటి బ్లాక్‌బస్టర్లతో ఇండస్ట్రీలో తన స్థానాన్ని మరింత బలపరుచుకున్నారు. నిర్మాతల కష్టసుఖాలపై ఆలోచించే అరుదైన నటుడిగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు.

కొత్త సినిమాలు – అభిమానులకు పండగే

రాజకీయాలతో బిజీగా ఉన్నప్పటికీ సినిమాల పట్ల ఆయనకున్న ఆసక్తి తగ్గలేదు.
ఇటీవల ‘హరిహర వీరమల్లు’ విడుదల కాగా, ఈ నెల 25న భారీ అంచనాల మధ్య ‘OG’ విడుదలకు రెడీ అవుతోంది.
అదేవిధంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి సంబంధించిన కొత్త పోస్టర్ ఆయన పుట్టినరోజు సందర్భంగా విడుదల కావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.
ఈ సినిమాలే పవన్ చివరి ప్రాజెక్టులని అనుకున్నప్పటికీ, భవిష్యత్తులో కూడా ఆయన సినిమాల్లో కొనసాగుతారన్న బలమైన టాక్ పరిశ్రమలో వినిపిస్తోంది.

చిన్ననాటి నుంచి ప్రజాసేవ వరకు

1968లో గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించిన పవన్ కళ్యాణ్ అసలు పేరు కొణిదెల కళ్యాణ్ బాబు.
తండ్రి ఉద్యోగ రీత్యా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పెరిగిన ఆయనకు వివిధ భాషలు, యాసలు, సంస్కృతులపై లోతైన అవగాహన ఏర్పడింది. చిన్ననాటి పేదరికం ఆయనలో ఉన్న పోరాట స్ఫూర్తిని మరింత పెంచింది. సినీ రంగంలో హీరోగా నిలదొక్కుకున్న తర్వాత సంపాదనలో ఎక్కువ భాగాన్ని పేదల సంక్షేమానికి వెచ్చించడం ఆయన ప్రత్యేకత.

రాజకీయ ప్రస్థానం – ఓ నిరంతర పోరాటం

2008లో ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధినేతగా అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్, 2014లో జనసేన పార్టీని స్థాపించారు.
2019 ఎన్నికల్లో ఎదుర్కొన్న ఘోర పరాజయం ఆయనను వెనక్కి తగ్గించలేదు. వైసీపీ పాలనలోనూ, ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడారు.
2024లో ఎన్డీయే కూటమితో కలిసి బరిలోకి దిగి చరిత్ర సృష్టించారు. జనసేన పోటీ చేసిన 21 స్థానాలన్నింటిలో విజయం సాధించి అరుదైన రికార్డును నెలకొల్పారు. ఫలితంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి – నటుడు, రచయిత, దర్శకుడు, గాయకుడు

పవన్ కళ్యాణ్ కేవలం నటుడు మాత్రమే కాదు. ‘జానీ’తో దర్శకుడిగా, ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో నిర్మాతగా, పలు సినిమాలలో గాయకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించారు. తన అన్నయ్య చిరంజీవి నటించిన ‘డాడీ’ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ అందించారు. పెప్సీ బ్రాండ్ అంబాసిడర్‌గా నిలిచిన తొలి దక్షిణాది స్టార్‌గానూ చరిత్ర సృష్టించారు.

పుస్తక పఠనం అంటే విపరీతమైన ఆసక్తి కలిగిన పవన్​, ఎన్నో గొప్ప పుస్తకాలు చదివి ప్రభావితమయ్యారు. మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిడ్డు కృష్ణమూర్తి వంటి గొప్ప గొప్ప తత్వవేత్తల రచనల్ని ఔపోసన పట్టిన కళ్యాణ్​కు విప్లవవీరుడు చే గువేరా తన అభిమాన నాయకుడిగా చెప్పుకుంటారు. తనకు పుస్తక పఠనం అలవాటు చేసిన దర్శకుడు, అత్యంత సన్నిహితుడు త్రివిక్రమ్​ శ్రీనివాస్​కు ఎన్నోసార్లు కృతజ్ఞతలు తెలిపారు.

పవనిజం – ఓ తత్త్వం

పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు కేవలం హీరో కాదు. అతడు ఒక తత్త్వం. అభిమానులు కాదు, భక్తులు కలిగిన అరుదైన వ్యక్తి.
ప్రధానమంత్రి మోడీ నుంచి దర్శకధీరుడు రాజమౌళి వరకు అందరూ ఆయన క్రేజ్‌ను ప్రశంసించడం, ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం.
“గాలి కాదు… తుఫాను” అనిపించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు సినీ తారగా మాత్రమే కాదు, ప్రజా నాయకుడిగా కూడా కోట్లాది మందికి ఆశాకిరణమవుతున్నారు.