Allu Sisrish To Get Engaged To Nayanika | పెళ్లి పీటలెక్కనున్న అల్లు శీరీష్
అల్లు శిరీష్ నయనికతో పెళ్లి: అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్, ఫ్రాన్స్‌లో ప్రేమకథ నిశ్చితార్థం.

విధాత : టాలీవుడ్ బడా నిర్మాత అల్లు అరవింద్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడు. నయనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నట్లు అల్లు శిరీష్ ప్రకటించాడు. అంతేకాదు..ఫ్రాన్స్‌లోని ప్రఖ్యాత ఈఫిల్ టవర్ వద్ద తన ప్రేయసి నయనిక చేతిని పట్టుకొని దిగిన ఫోటోను శిరీష్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. నయనిక చేతి వేలికి ఉంగరం ఉన్న ఫొటోను పోస్ట్ చేశాడు. అక్టోబర్ 31న ఎంగేజ్మెంట్ జరగనుందని అల్లు శిరీష్ తన పోస్ట్ లో చెప్పేశాడు. అలాగే ఒక ఎమోషనల్ మెసేజ్‌ను పోస్ట్ చేశాడు. “నేడు మా తాతయ్య, నటరత్న డాక్టర్ అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా నా హృదయానికి దగ్గరైన ఓ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇటీవల మా నానమ్మ మరణించారు. ఆమె ఎప్పుడూ నా పెళ్లి చూడాలని కోరుకునేది. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉండి ఉంటారు. మా కుటుంబాలు మా ప్రేమను ఆనందంతో ఆమోదించాయి అని తెలిపారు.
ఈ ప్రేమ కథ చాలా కాలంగా సీక్రెట్‌గా సాగినట్టు తెలుస్తోంది. ఇటీవల పారిస్‌లో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో నిశ్చితార్థం నిరాడంబరంగా జరిగిందని సమాచారం. ఇంతకు అల్లు శిరీష్ పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నయనిక ఎవరు.. ఆమె కుటుంబ నేపథ్యం ఏంటనే విషయాలపై నెటిజన్లు తెగ వెతుకులాడుతున్నారు. నయనిక హైదరాబాద్‌కు చెందిన అమ్మాయిగా చెప్పుకుంటున్నారు.
అల్లు శిరీష్.. ‘గౌరవం’ మూవీతో హీరోగా పరిచయమయ్యాడు. తర్వాత కొత్త జంట, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం, ఏబీసీడీ, ఊర్వశివో రాక్షసివో, బడ్డీ తదితర చిత్రాలలో నటించారు. గత ఏడాదిన్నర కాలంగా కొత్త సినిమాలు ప్రకటించలేదు. ఇంతలోనే అకస్మాత్తుగా నిశ్చితార్థం చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు.