విధాత : టాలీవుడ్ రారాజుగా వెలిగిన మెగాస్టార్ చిరంజీవి నట జీవిత ప్రస్థానానికి నేటితో 47ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా చిరంజీవి తన 47ఏళ్ల సినీ ప్రయాణాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ ఎక్స్ వేదికగా ఇన్నాళ్లుగా తనను ఆదరించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.
22 సెప్టెంబర్ 1978 న ‘కొణిదెల శివ శంకర వరప్రసాద్’ అనబడే నేను “ప్రాణం ఖరీదు” చిత్రం ద్వారా ‘చిరంజీవిగా’ మీకు పరిచయం అయ్యి నేటితో 47 ఏళ్లు దిగ్విజయంగా పూర్తయ్యాయి. ఈ చిత్రం ద్వారా నాకు నటుడిగా ప్రాణం పోసి.., మీ అన్నయ్యగా, కొడుకుగా, మీ కుటుంబ సభ్యుడిగా , ఒక మెగాస్టార్ గా.. అనుక్షణం నన్ను ఆదరించి, అభిమానించిన తెలుగు సినిమా ప్రేక్షకులకు నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడనై ఉంటాను. నేటికి 155 సినిమాలను నేను పూర్తి చేసుకున్నాను అంటే… అందుకు కారణం నిస్వార్ధమైన మీ “ప్రేమ”. ఈ 47 ఏళ్ళలో నేను పొందిన ఎన్నో అవార్డులు, గౌరవమర్యాదలు నావి కావు, మీ అందరివీ, మీరందించినవి. మనందరి మధ్య ఈ ప్రేమానుబంధం ఎల్లప్పటికీ ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటూ…కృతజ్ఞతలతో..మీ చిరంజీవి అంటూ పోస్టులో రాసుకొచ్చారు.
ఖైదీ(1983)తో స్టార్ హీరోగా మారిపోయిన చిరంజీవి గూఢచారి 116, ఛాలెంజ్, రుద్రవీణ, అడవి దొంగ, విజేత, చంటబ్బాయి, ఆరాధన, ఖైదీ నెంబర్ 786, కొండవీటి దొంగ, వేట, రాక్షసుడు, పసివాడి ప్రాణం, దొంగమొగుడు, యుముడికి మొగుడు, స్టేట్ రౌడీ, గ్యాంగ్ లీడర్, స్వయం కృషి, జగదేక వీరుడు అతిలోక సుందరి, కొదమ సింహం, అపద్భాంధవుడు, రౌడీ అల్లుడు, ముగ్గరు మొనగాళ్లు, ముఠామేస్త్రీ, ఘరానా మొగుడు, అల్లుడా మజకాకా, బిగ్ బాస్, మాస్టర్, బావగారు, బాగున్నారా, చూడాలని ఉంది, ఇంద్ర, స్నేహం కోసం, అన్నయ్య, హిట్లర్, ఠాగూర్, స్టాలిన్, సైరా నరసింహరెడ్డి సినిమాలు బిగ్ హిట్ గా నిలిచాయి.
ప్రస్తుతం చిరంజీవి నటించిన విజువల్ వండర్ విశ్వంభర షూటింగ్ పూర్తవ్వగా..వీఎఫ్ఎక్స్ పూర్తి చేసుకుని వచ్చే వేసవిలో ఈ సినిమా విడుదల కానుంది. విశ్వంభర కంటే ముందుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు.. వస్తున్నారు సినిమా వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది. వీటితో పాటు చిరంజీవి నటిస్తున్న బాబీ కొల్లి దర్శకత్వంలో ఓ సినిమా, శ్రీకాంత్ ఓదేలా దర్శకత్వంలో మరో సినిమా, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఆటో జానీ అనే మరో సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఓ దశలో దేశంలోని అత్యధిక పారితోషకం..అత్యధిక వసూళ్ల హీరోగా నిలిచిన చిరంజీవి తన కెరీర్ లో నాలుగు నంది, తొమ్మిది ఫిల్మ్ ఫేర్ అవార్డులు సాధించారు. పద్మభూషణ్, పద్మ విభూషణ్ అందుకున్నారు. ఇటీవలే చిరంజీవి సెప్టెంబర్ 22న తన 70 జన్మదినం జరుపుకున్నారు.