Dada Saheb Phalke | మోహన్‌లాల్‌కు దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు.. ఈ నెల 23న ఢిల్లీలో ప్రదానం
ప్రఖ్యాత నటుడు, మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ 2023 సంవత్సరానికి గాను దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు.

Dada Saheb Phalke | ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు 2023 సంవత్సరానికి గాను మలయాళ సూపర్ స్టార్, విశిష్ట నటుడు మోహన్‌లాల్ ఎంపికయ్యారు. ఈ నెల 23వ తేదీన ఢిల్లీలో 71వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఆ సమయంలోనే మోహన్‌లాల్‌కు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని అందించనున్నారు. కేరళలోని అప్పటి కొల్లం జిల్లా (ప్రస్తుతం పతనంతిట్ట)లోని ఎలంతూరులో 1960 మే 21న మోహన్ లాల్ జన్మించారు. ఆయన పూర్తి పేరు మోహన్ లాల్ విశ్వనాథన్. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన మోహన్‌లాల్‌గా సుపరిచుతులు.
మలయాళ, కన్నడ, తమిళ, తెలుగు, హిందీ భాషల్లో 400కి పైగా సినిమాల్లో మోహన్‌లాల్ నటించారు. నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్, సింగర్ కూడా వ్యవహరించారు. 1978లో తిరనోట్టమ్ అనే సినిమాతో ఆయన సినీరంగ ప్రవేశం చేశారు. సెన్సార్ సమస్యల కారణంగా ఈ సినిమా 25 ఏళ్ల తర్వాత రిలీజ్ అయింది. 1980లో ఆయన నటించిన మంజిల్ విరింజ పూక్కల్ సినిమా విడుదలైంది. ఈ సినిమాలో ఆయనది విలన్ పాత్ర. విలన్ తో పాటు ఇతర పాత్రలను కూడా ఆయన పోషించారు. 1986లో రాజవింటే మకన్ అనే సినిమా ఆయనకు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. 1986లో ఆయన ఏకంగా 36 సినిమాల్లో నటించారు.
ఆయన మొత్తం 9 ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కించుకున్నారు. 2001లో ఆయనకు భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించింది. 2019లో పద్మభూషణ్ పురస్కారం అందుకున్నారు. 2009లో ఆర్మీలో లెఫ్టినెంట్ కర్నల్ గౌరవ హోదాను పొందిన తొలి నటుడిగా ఆయన గుర్తింపు పొందారు. 1986లో సత్యన్ అంతికాడ్ దర్శకత్వం వహించిన టీపీ బాలగోపాలన్ ఎంఏ సినిమాలో ఆయన నటించారు. ఈ సినిమాకు కేరళ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ నటుడు అవార్డును ఆయన తొలిసారి అందుకున్నారు. 2016లో జనతా గ్యారేజ్ సినిమాకు ఆయనకు నంది అవార్డు దక్కింది. రెండుసార్లు జాతీయ ఉత్తమ అవార్డు ఆయన అందుకున్నారు. 1997లో మణిరత్నం దర్శకత్వంలో రూపొందించిన ఇరువర్ లో తొలిసారిగా తమిళ సినిమాలో నటించారు. బెల్ గ్రేడ్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఈ సినిమాకు ఉత్తమ చిత్రం అవార్డు లభించింది. రెండు జాతీయ చలనచిత్ర అవార్డులు కూడా వచ్చాయి.