Fish Venkat Death | నటుడు ఫిష్ వెంకట్ కన్నుమూత
వివిధ ఇంటర్వ్యూల్లో వీవీ వినాయక్ తన సినీ కెరీర్‌కి గాడ్‌ఫాదర్ అని ఆయన పలుమార్లు ప్రస్తావించారు. దివంగత నటుడు శ్రీహరి తనకు ఎప్పుడూ అండగా నిలిచారని వెంకట్ భావోద్వేగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని రాంనగర్‌లో నివాసం ఉంది.

Fish Venkat Death | టాలీవుడ్ సినీప్రియులకు ఎన్నో చిత్రాల్లో తన ప్రత్యేక హాస్యంతో పంచ్‌లు అందించిన హాస్యనటుడు ఫిష్ వెంకట్ ఇకలేరు. మూత్రపిండాల సమస్యతో బాధపడుతూ ఆయన శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్‌లోని బోడుప్పల్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. రెండు కిడ్నీలు పనిచేయకపోవడంతో డయాలసిస్‌పై కొనసాగుతున్న ఆయనకు కిడ్నీ మార్పిడి అవసరమని ఇటీవల వైద్యులు తెలిపారు. దీనివల్ల కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దాతల సహాయం కోసం ఆయన కుమార్తె స్రవంతి పిలుపునిచ్చినా అవసరమైన నిధులు సమకూరకపోవడంతో ఆరోగ్యం క్షీణించి మరణించారు.
వెంకట్(Fish Venkat) అసలు పేరు మంగిలపల్లి వెంకటేష్. ఆయన స్వస్థలం మచిలీపట్నం. హైదరాబాద్ రామ్‌నగర్‌లో చేపల వ్యాపారిగా సాధారణ జీవితం గడిపిన వెంకట్ 1989లో సినీ పరిశ్రమలో అడుగుపెట్టారు. 1991లో మాగంటి గోపినాథ్ నిర్మించిన జంతర్ మంతర్ చిత్రంలో తొలి అవకాశం లభించింది. అయినప్పటికీ పెద్దగా గుర్తింపు రాలేదు.
2002లో ఎన్టీఆర్ హీరోగా వీవీ వినాయక్ తెరకెక్కించిన ఆది చిత్రంతో వెంకట్‌కి ఘనమైన గుర్తింపు లభించింది. ఆ తరువాత ఆయన నటించిన దిల్, బన్నీ, నాయక్, అత్తారింటికి దారేది, గబ్బర్‌సింగ్, డీజే టిల్లు, కింగ్, డాన్ శీను, మిరపకాయ్, సుప్రీమ్ వంటి చిత్రాలు ఆయనను హాస్యనటుడిగా నిలబెట్టాయి. 100కుపైగా సినిమాల్లో నటించి అభిమానులను అలరించిన ఆయన చివరిగా కాఫీ విత్ ఏ కిల్లర్ చిత్రంలో కనిపించారు.
వివిధ ఇంటర్వ్యూల్లో వీవీ వినాయక్ తన సినీ కెరీర్‌కి గాడ్‌ఫాదర్ అని ఆయన పలుమార్లు ప్రస్తావించారు. దివంగత నటుడు శ్రీహరి తనకు ఎప్పుడూ అండగా నిలిచారని వెంకట్ భావోద్వేగంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆయన కుటుంబం హైదరాబాద్‌లోని రాంనగర్‌లో నివాసం ఉంది.