2025 Oscars । హిందీ సినిమా.. యూకే నుంచి ఆస్కార్‌ బరిలోకి..

రెండు రోజుల క్రితం భారతదేశం తరఫున ఆస్కార్‌ బరిలోకి అధికారిక ఎంట్రీగా లాపతా లేడీస్‌ చిత్రం ఎంపికవగా.. మరో హిందీ సినిమా సైతం తాజాగా ఆస్కార్‌ నామినేషన్లకు ఎంపికైంది. విచిత్రం ఏమిటంటే.. అది హిందీ సినిమా అయినప్పటికీ.. దానిని యూకే తరఫున ఆస్కార్‌కు నామినేట్‌ చేశారు.

2025 Oscars । హిందీ సినిమా.. యూకే నుంచి ఆస్కార్‌ బరిలోకి..

2025 Oscars । ఆస్కార్‌ 2025 నామినేషన్ల హడావుడి జోరుగా కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం భారతదేశం తరఫున ఆస్కార్‌ బరిలోకి అధికారిక ఎంట్రీగా లాపతా లేడీస్‌ (Laapataa Ladies) చిత్రం ఎంపికవగా.. మరో హిందీ సినిమా సైతం తాజాగా ఆస్కార్‌ నామినేషన్లకు (entry for the Oscars) ఎంపికైంది. విచిత్రం ఏమిటంటే.. అది హిందీ సినిమా అయినప్పటికీ.. దానిని యూకే తరఫున ఆస్కార్‌కు నామినేట్‌ చేశారు. పోలీసు వ్యవస్థ పద్ధతులపై సంధ్య సూరి (Sandhya Suri) రూపొందించిన ‘సంతోష్‌’ (Santosh) సినిమాను యూకే తరఫున ఆస్కార్‌ అవార్డులకు అధికారికంగా ఎంపిక చేశారు. ఈ చిత్రాన్ని ఉత్తమ ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ రేసులోకి ఎంపిక చేయడం విశేషం. అమెరికన్‌ అకాడమీ నియమించిన బీఏఎఫ్‌టీఏ (BAFTA) సంస్థ బ్రిటన్‌ దరఖాస్తుల నుంచి ‘సంతోష్‌’ను ఎంపిక చేసింది.

సంతోష్‌ చిత్రంలో సహానా గోస్వామి (Shahana Goswami), సునీతా రాజ్వార్‌ (Sunita Rajwar) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ ఏడాది కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(Cannes Film Festival)లో కూడా దీనిని ప్రదర్శించారు. ఈ సినిమా వెనుక బ్రిటిష్‌ నిర్మాతలు ఉండటంతో ఇది ఆస్కార్‌కు బ్రిటన్‌ నుంచి అర్హత సాధించింది. బ్రిటన్‌లో అనేక ప్రాంతాల్లో ఈ సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మైక్‌ గూడ్రిజ్‌, జేమ్స్‌ బోషెర్‌, బల్తాజర్‌ డే గానే, అలన్‌ మెక్అలెక్స్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. అమా అమ్‌పాడు, ఎవా యేట్స్‌, దియర్మిద్‌ స్ర్కిమ్‌షా, లూసియా హాస్‌లావుర్‌, మార్టిన్‌ గెర్హార్డ్‌ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు. గూడ్‌ కయోస్‌ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆస్కార్స్‌లో ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం అవసరాల రీత్యా ఆంగ్లేతర సినిమాలను యూకే అప్పుడప్పుడు ఎంపిక చేస్తుంటుంది. ఈ సినిమాకు సూరి దర్శకత్వం వహించారు.

కథ విషయానికి వస్తే.. ఇదొక ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ (investigative thriller). ఉత్తర భారతదేశంలోని గ్రామీణ ప్రాంతంలో తన భర్తను కోల్పోయిన వితంతువు సంతోష్‌.. తన భర్త ఉద్యోగాన్ని పొంది, ఒక యువతి హత్య కేసు (young girl’s murder) దర్యాప్తులో చిక్కుల్లో పడటం ఈ సినిమా కథాంశం. భారతదేశం నుంచి లాపతా లేడీస్‌ (Laapataa Ladies) సినిమాతో పాటు ప్రపంచవ్యాప్తంగా డజన్లకొద్దీ సినిమాలతో సంతోష్‌ ఇప్పుడు పోటీపడనున్నది. వాటన్నింటి నుంచి చివరిగా ఐదు సినిమాలను ఎంపిక చేస్తారు. వాటిలో ఒక దానికి ఉత్తమ చలన చిత్రం అవార్డును 2025 జనవరిలో నిర్వహించే కార్యక్రమంలో అందజేస్తారు.