‘Jatadhara’ Movie Review | ‘జటాధరా’.. హరహరా..! హర్రరా.? ప్రేక్షకులకు టెర్రరా?

‘జటాధర’ సినిమా భయపెట్టడం కాదు కదా, చూసేవాళ్ల సహనాన్ని పరీక్షించింది. గందరగోళ కథనం, చెత్త విజువల్స్‌, బలహీనమైన దర్శకత్వంతో సుధీర్‌ బాబు ఒంటరి పోరాటం వృథా అయింది.

  • By: ADHARVA |    cinema |    Published on : Nov 07, 2025 8:57 PM IST
‘Jatadhara’ Movie Review | ‘జటాధరా’.. హరహరా..!  హర్రరా.? ప్రేక్షకులకు టెర్రరా?

‘Jatadhara’ Movie Review: Horror or Headache?

చిత్రం పేరు: జటాధర (Jatadhara)
తారాగణం: సుధీర్‌ బాబు, సోనాక్షి సిన్హా, దివ్య ఖోస్లా, శిల్పా శిరోధ్కర్‌, రావు రమేష్‌, రాజీవ్‌ కనకాల
దర్శకులు: వెంకట్‌ కళ్యాణ్‌, అభిషేక్‌ జైస్వాల్‌
సంగీతం: రాజీవ్‌ రాజ్‌
నిర్మాణం: జీ స్టూడియోస్‌
విడుదల తేదీ: నవంబర్‌ 7, 2025

అప్పట్లో వేటగాడు అని ఒక సినిమా వచ్చింది. నటరత్న ఎన్టీఆర్​, శ్రీదేవి హీరోహీరోయిన్లు. ఈతరానికి పెద్దగా తెలియకపోవచ్చు. ఆ సినిమాలో హీరో ఫారెస్ట్​ ఆఫీసర్​. ప్రముఖ హాస్యనటుడు రాజబాబు ఫారెస్ట్​ ఆఫీసులో వంటవాడు. కొత్తగా వచ్చే ఆఫీసర్ ఏం తింటాడో తెలియని ఈ వంటబ్బాయి కూరగాయలు, గుడ్లు, ఓ కోడి.. ఇలా అన్నింటినీ కలిపి పేద్ద డేగిసాలో వేసి వండేస్తాడు. ఒక మిక్స్​డ్​ వెజ్​–నాన్​వెజ్​ వంటకమన్నమాట. ఇక అదెలా ఉంటుందో మీ ఊహకే వదిలేస్తాను.

ఇప్పుడీ టాపిక్​ ఎందుకొచ్చిందంటే, ఇవాళ వచ్చిన ‘జటాధర’ అనే సినిమా చూసాక, పై సీన్​ గుర్తుకువచ్చింది. నేనేం చెప్పాలనుకుంటున్నానో మీకీపాటికే అర్థమైఉంటుంది. కరెక్టే.. ‘జటాధర’ కూడా పురాణేతిహాసాలు, హర్రర్​, ఫాంటసీ కలగలిపి చేసిన ఓ విఫల ప్రయోగం.

సుధీర్‌ బాబు ఎప్పుడూ కొత్త ఆలోచనలతో సినిమాలు చేస్తూ ఉంటాడు. ఈసారి జటాధర అనే పాన్‌ ఇండియా హారర్‌ డ్రామాతో వచ్చాడు. జీ స్టూడియోస్‌ నిర్మించిన ఈ చిత్రంతో హిందీ నటి సోనాక్షి సిన్హా తెలుగు సినీరంగానికి పరిచయం కావడం మాత్రమే విశేషం. కానీ సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అడిగే ప్రశ్న ఒక్కటే – “ఇంతకీ ఇది ఏ జానర్‌ సినిమా?”

ఈ జటాధరుడి కథేంటో?

కథ ప్రకారం రుద్రారం అనే గ్రామంలో ఒక పురాతన నిధి దాగి ఉంటుంది. దానిని కాపాడే దుష్టాత్మ ‘ధన పిశాచి’ (సోనాక్షి సిన్హా) వల్ల ఆ గ్రామం శాపగ్రస్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఘోస్ట్‌ హంటర్‌ అయిన శివ (సుధీర్‌ బాబు) ఆ రహస్యాన్ని తెలుసుకోవడానికి రుద్రారానికి వస్తాడు. తన బాల్యంలో జరిగిన సంఘటనలు, ఆ పిశాచి మధ్య ఉన్న సంబంధం తెలుసుకుంటాడు. ఆ పిశాచిని తుదముట్టించే పోరు మొదలవుతుంది. నిజానికి వింటే ఇది ఒక చందమామ కథ. కానీ, దాన్ని సినిమాగా మలిచిన తీరు మాత్రం ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే స్థాయిలో ఉంది.

ఈ చిత్రానికి ఇద్దరు దర్శకులు వెంకట్‌ కళ్యాణ్‌ ఇంకా అభిషేక్‌ జైస్వాల్‌ ఈ చిత్రాన్ని మానవాతీత, ఫాంటసీ, భక్తి, మిస్టరీ — అన్నీ కలగలిపిన కథగా తీసారు. ఫలితంగా ఎటూ కాకుండా పోయింది. మొదటి భాగం పూర్తి గందరగోళంగా సాగుతుంది. ఎప్పుడు, ఎక్కడ, ఏం జరుగుతుందో అర్థం కాకుండా సన్నివేశాలు వస్తూ, పోతూ  ఉంటాయి. ప్రేక్షకులు కథను అనుసరించేలోపే, సినిమా ఇంకెటో వెళ్తుంది.

సుధీర్‌ బాబు కృషి వృథా – దారుణమైన దర్శకత్వం

సుధీర్‌ బాబు ప్రతి సినిమాలో కొత్తగా ప్రయత్నించే నటుడు. జటాధరలో ఆయన ఈ భూతాలను, పిశాచాలను శాస్త్రీయంగా చూడాలనుకునే వ్యక్తిగా కనిపించాడు. నటనలో కష్టపడ్డాడు, కానీ రాయబడ్డ పాత్రకే స్పష్టత  లేకపోవడంతో ఆయన శ్రమ వృథా అయింది. రెండో భాగంలో చేసిన శివతాండవం సీన్‌ విజువల్‌గా బలహీనంగా ఉండటంతో కూడా అది కూడా ప్రభావం చూపలేదు.

సోనాక్షి సిన్హా ధన పిశాచి పాత్రలో కనిపించింది. తెరపై ఆమె లుక్‌ బాగున్నా, పాత్ర భారీ శబ్దాలకే పరిమితమైంది. ఆమె మాటల కన్నా అరుపులు ఎక్కువగా వినిపించాయి. భయపెట్టాల్సిన పాత్ర, చివరికి హాస్యాస్పదంగా మారిపోయింది. దివ్య ఖోస్లా పాత్రకు అర్ధం లేదు, రావు రమేశ్​, రాజీవ్‌ కనకాల వంటి నటుల కౌశలం బూడిదలో పోసిన పన్నీరే.

విచిత్రమేమిటంటే, సినిమా తీసేప్పుడు, రషెస్​ చూస్తారు. నచ్చకపోతే మళ్లీ తీస్తారు. ఇప్పుడు డిజిటల్​ కెమెరాలు కూడా. ఫిల్మ్​ రీళ్లు వేస్టవుతాయనే బాధ కూడా లేదు. అయినా ఇలా ఉందంటే, వాళ్ల తీసిందే కరెక్టనుకున్నట్టున్నారు.

సినిమా వైఫల్యానికి ప్రధాన కారణాలు (Points of Failure):

  1. గందరగోళమైన కథనం: హారర్‌, పురాణం, ఫాంటసీ అన్నీ కలగలిపినా ఎక్కడా స్పష్టత లేదు.
  2. బలహీనమైన స్క్రీన్‌ప్లే: మొదటి భాగం ఎటో పోతే, రెండో భాగం రొటీన్‌గా ఉంటుంది.
  3. అట్టడుగు స్థాయి విజువల్స్‌: 70 కోట్లు బడ్జెట్‌ ఉన్నా VFX, CGI సీన్లు చాలా చీప్​గా కనిపించాయి.
  4. దారుణమైన ఎడిటింగ్‌: సన్నివేశాలు అకస్మాత్తుగా మాయమవుతాయి, ఓ క్రమ పద్ధతిలో లేవు.
  5. లాజిక్‌ లేని సన్నివేశాలు: హారర్‌ సీన్లు భయపెట్టకపోగా, నవ్వు తెప్పించేలా ఉన్నాయి.
  6. మ్యూజిక్‌ మరియు BGM: శబ్దం ఎక్కువ, భావం తక్కువ. సన్నివేశాలకు సరిపోని ట్యూన్స్‌.
  7. డైరెక్షన్‌ లోపాలు: కథ చెప్పడంలో ఉన్న ధైర్యం తీయడంలో లేకుండా పోయింది.

 

‘జటాధర’ సినిమా చూడటం కన్నా దానిపై చర్చించడం ఆసక్తికరంగా ఉంటుంది. వినడానికి చాలా బాగున్న కథను సినిమాగా తీసి ఎంత పాడుచేయొచ్చో ఈ చిత్రం ఒక ఉదాహరణ. ఔత్సాహిక దర్శకులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. సినిమా ఎలా తీయకూడదో చెప్పే పెద్ద మోడల్​ . సినీ లైబ్రరీలో కూడా ఓ కాపీ ఉండాలి భవిష్యత్‌లో రిఫరెన్స్​కు పనికొస్తుంది.

సుధీర్‌ బాబు, సోనాక్షి సిన్హా కృషి ఉన్నా కథ, టెక్నికల్‌ వర్క్‌, దర్శకత్వం అన్నీ బలహీనంగా ఉన్నాయి. ఇది హర్రర్​ కథ కాదు, ప్రేక్షకులకు టెర్రర్​.

హైలైట్స్‌: సుధీర్‌ బాబు డెడికేషన్‌, సోనాక్షి లుక్‌
లోపాలు: మిగిలినవన్నీ

విధాత రేటింగ్‌: ⭐ (1/5)