కలలుగన్న పిల్లాడి నుంచి కోట్ల హృదయాల రారాజు… చిరంజీవి జన్మదినం సందర్భంగా ‘విధాత’ ప్రత్యేక వ్యాసం
కలలుగన్న పిల్లాడి నుంచి కోట్ల హృదయాల రారాజు ...నేడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ‘విధాత’ ప్రత్యేక వ్యాసం

- నేడు మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా ‘విధాత’ ప్రత్యేక వ్యాసం
మార్గదర్శులు ఎక్కడో పుట్టరు. మన మధ్యే అందరిలాగే తిరుగుతుంటారు. భారత్‌లో అలాంటి ఒక మార్గదర్శి చిరంజీవి. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన బాల్యం నుంచి సినీ ప్రస్థానం, కష్టాలు, ఘన విజయాలు, పద్మభూషణ్, పద్మ విభూషణ్ గౌరవాలు, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా సమాజానికి చేసిన సేవలు, కోట్ల హృదయాలను గెలుచుకున్న మార్గదర్శక ప్రస్థానంపై ప్రత్యేక కథనం.
Megastar Chiranjeevi | 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని మొగల్తూరులో రైతు కుటుంబంలో జన్మించిన కొణిదెల శివశంకర వరప్రసాద్ తరువాత కాలంలో చిరంజీవిగా తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. చిన్నప్పటి నుంచే కళల పట్ల మక్కువ కలిగిన ఆయన స్కూల్ డ్రామాల వేదికపైనే తన నటనాప్రతిభను ప్రదర్శించారు. చదువులో ప్రతిభ కనబర్చినా, ఆయన మనసు మాత్రం సినిమాల వైపు లాగుతూనే ఉండేది. ఈ ఉత్సాహమే ఆయనను మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ దాకా తీసుకెళ్లింది. అక్కడే ఆయన నటనలో శిక్షణ పొందారు.
1978లో “ప్రాణం ఖరీదు” అనే చిత్రంతో వెండితెరపై తొలి అడుగు వేసిన చిరంజీవి, మొదట చిన్న పాత్రలతో కనిపించినా తన సహజ నటన, కళ్లలోని ఆత్మవిశ్వాసం, డాన్స్‌లోని ఉత్సాహం, యాక్షన్ సన్నివేశాల్లోని తీక్షణత వలన పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు పొందారు. 1983లో విడుదలైన “ఖైదీ” ఆయన కెరీర్‌ను శాశ్వతంగా మలుపుతిప్పింది. ఒక రాత్రిలోనే ఆయన పేరు దేశమంతా మార్మోగింది. ఈ విజయమే ఆయనను మాస్ హీరోగా, తరువాత మెగాస్టార్‌గా నిలబెట్టింది.
1980లలో మరియు 1990లలో చిరంజీవి టాలీవుడ్‌ను ఒంటరిగా నడిపించిన హీరోగా వెలిగారు. 1988లో వచ్చిన “రుద్రవీణ” జాతీయ అవార్డు అందుకోవడంతో ఆయన ప్రతిభకు గర్వకారణమైంది. 1990లో శ్రీదేవి జంటగా నటించిన “జగదేక వీరుడు అతిలోక సుందరి” ఫాంటసీ చిత్రాలకు కొత్త మైలురాయి సృష్టించింది. 1992లో వచ్చిన “ఘరానా మొగుడు” దక్షిణ భారతదేశంలో 10 కోట్లు వసూలు చేసిన తొలి చిత్రం అవ్వడం, ఆయనకు “బాక్స్ ఆఫీస్ బాస్” అనే బిరుదు తెచ్చింది. ఈ కాలంలో ఆయన నటించిన “అన్నయ్య”, “ముఠామేస్త్రి”, “మెకానిక్ అల్లుడు” వంటి సినిమాలు కుటుంబ భావోద్వేగాలు, వినోదం, సామాజిక స్ఫూర్తిని కలగలిపిన విజయవంతమైన చిత్రాలుగా నిలిచాయి.
2000వ దశాబ్దంలో కూడా చిరంజీవి ప్రభావం తగ్గలేదు. 2002లో వచ్చిన “ఇంద్ర” ఆయన కెరీర్‌లో ఒక అద్భుతమైన మైలురాయి. రాజకీయ, సామాజిక అంశాలను ప్రతిబింబించిన ఈ చిత్రం వసూళ్ల పరంగా కూడా సంచలనం సృష్టించింది. 2003లో వచ్చిన “ఠాగూర్” అవినీతిపై గట్టి సందేశం ఇచ్చింది. 2004లో వచ్చిన “శంకర దాదా MBBS” హాస్యాన్ని, మానవీయతను కలగలిపి చిరంజీవి నటనలో మరో కోణాన్ని ప్రేక్షకులకు చూపించింది.
2008లో ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. యువతకు ప్రత్యామ్నాయం చూపాలని కలగన్న ఆయన తన పార్టీ ద్వారా ప్రజాసేవ చేయాలని లక్ష్యంచుకున్నారు. తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా పనిచేశారు. రాజకీయ ప్రయాణం మిశ్రమ ఫలితాలు ఇచ్చినా, ఆయన ప్రజాసేవ పట్ల ఉన్న అంకితభావాన్ని ఎవరూ ప్రశ్నించలేరు. కొంత విరామం తరువాత 2017లో “ఖైదీ నం.150”తో ఆయన సినిమాల్లోకి పున:ప్రవేశం చేసారు. తరువాత “సైరా నరసింహా రెడ్డి”లో స్వాతంత్ర్య సమరయోధుడి పాత్ర పోషించి మరోసారి తన ప్రభావాన్ని చాటారు. ఇటీవల “ఆచార్య”, “భోళా శంకర్” వంటి సినిమాలతో అభిమానులను అలరించారు.
చిరంజీవి సినీ ప్రయాణం కేవలం బాక్స్ ఆఫీస్ రికార్డుల వరకే పరిమితం కాలేదు. ఆయన స్థాపించిన చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ లక్షలాది మంది ప్రాణాలను కాపాడాయి. రక్తదాన ఉద్యమంలో ఆయన సృష్టించిన విప్లవం అభిమానులను కూడా మానవత్వానికి దారితీసింది. తన సినీప్రస్థానంలో చిరంజీవి అనేక అవార్డులు, గౌరవాలు అందుకున్నారు. ఇప్పటివరకు 10 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు ఆయన ఖాతాలో ఉన్నాయి. 2006లో ఆయనకు పద్మభూషణ్ లభించగా, 2024లో పద్మ విభూషణ్ అందుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమైంది. సినీ రంగానికి, సమాజానికి చేసిన సేవలకు లభించిన ఈ గౌరవాలు చిరంజీవి స్థానాన్ని మరింత ఉన్నతంగా నిలబెట్టాయి.
70వ పడిలో అడుగుపెడుతున్నా, తనలోని గ్రేస్, నటనలోని మెస్మరైజ్, డాన్స్‌లోని డామినేషన్ తగ్గలేదు. ఇప్పుడు కూడా చిరంజీవి కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. చేతిలో ఇప్పుటికిప్పుడు నాలుగు సినిమాలున్నాయి. యువ దర్శకుల ప్రతిభను గుర్తించిన మెగాస్టార్, వరుసగా వారికే అవకాశాలిస్తున్నారు. విశ్వంభర, అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల, బాబీల చిత్రాలు ఆయన లిస్టులో ఉన్నాయి. బహుశా నేడు కొన్నింటికి ప్రకటన రావచ్చని అభిమానులే కాక, తెలుగు ప్రేక్షకలోకం ఎదురు చూస్తోంది.
చిరంజీవి జీవితం ఒక సామాన్య కుటుంబం నుంచి మెగాస్టార్‌గా ఎదిగిన అసాధారణ గాథ. క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, ప్రేక్షకుల పట్ల ఉన్న ప్రేమ, సమాజసేవ పట్ల ఉన్న నిబద్ధత ఆయనను తెలుగు ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలబెట్టాయి. అందుకే ప్రతి సంవత్సరం ఆయన పుట్టినరోజు కేవలం అభిమానులకే కాకుండా, తెలుగు సినిమా చరిత్రలో ఒక గర్వకారణ దినంగా మారింది.