Dadasaheb Phalke Award । మిథున్ చక్రవర్తికి ప్రఖ్యాత దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు: కేంద్రం ప్రకటన
‘నాకు మాటలు రావడం లేదు. ఈ సందర్భం నా గతాన్ని గుర్తు చేసింది. కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాను. ముంబైలో నాకు తిండి దొరకలేదు. కొన్నిసార్లు పార్కుల్లో నిద్రించేవాడిని. అదంతా గుర్తుకు వస్తున్నది. అన్నింటిని అధిగమించిన తర్వాత ఇప్పుడు ఈ పురస్కారం లభించింది.

Dadasaheb Phalke Award । సినీ రంగంలో అత్యున్న పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి అలనాటి బాలీవుడ్ హీరో మిథున్ చక్రవర్తి ఎంపికయ్యారు. సోమవారంనాడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని ప్రకటించింది. డిస్కో డ్యాన్స్ అంటే దేశంలో మొదట గుర్తొచ్చే పేరు మిథున్ చక్రవర్తి. పశ్చిమబెంగాల్‌కు చెందిన ఒక దశలో బాలీవుడ్‌ను ఏలిన నటుడు. డిస్కోడాన్సర్, మృగయ, ప్రేమ్ ప్రతిజ్ఞ వంటి చిత్రాలతో ఆయన వినుతికెక్కారు. మిథున్ చక్రవర్తిని దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపిక చేసినట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం తన ఎక్స్ ఖాతాలో ప్రకటించారు. సినీ నటుడిగా ఉంటూనే రాజకీయాల్లోకి వచ్చిన మిథున్ బీజేపీ సభ్యుడిగా ఉన్నారు. ఇటీవలే ఆయనకు దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ లభించగా.. కొద్ది నెలల వ్యవధిలోనే బాబాసాహెబ్ ఫాల్కే పురస్కారానికి ఎంపికయ్యారు.
వివిధ తరాల ప్రశంసలు అందుకున్న ‘సాంస్కృతికి చిహ్నం’ అంటూ మిథున్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం రావడం సంతోషంగా ఉన్నదని తెలిపారు. భారతీయ సినిమాకు ఆయన అసామాన్య సేవలు అందించారని పేర్కొన్నారు. తనకు దాదాసాహెబ్‌ఫాల్కే అవార్డును ప్రకటించడంతో తనకు మాటలు రావడం లేదని మిథున్ చక్రవర్తి అన్నారు. ఒకనాడు తిండి కోసం, గూడు కోసం పడిన కష్టాలు అన్నీ ఈ వార్త వినగానే ఒక్కసారిగా కండ్ల ముందు కదలాడాయని పేర్కొన్నారు.
‘నాకు మాటలు రావడం లేదు. ఈ సందర్భం నా గతాన్ని గుర్తు చేసింది. కోల్‌కతా నుంచి ముంబై వెళ్లాను. ముంబైలో నాకు తిండి దొరకలేదు. కొన్నిసార్లు పార్కుల్లో నిద్రించేవాడిని. అదంతా గుర్తుకు వస్తున్నది. అన్నింటిని అధిగమించిన తర్వాత ఇప్పుడు ఈ పురస్కారం లభించింది. నాకు మాటలు రావడం లేదు. నేను చెప్పేది ఒక్కటే మాట. ఈ అవార్డును నా కుటుంబ సభ్యులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమానులకు అంకితం చేస్తున్నాను’ అని చెప్పారు. ‘నా జీవితం అంతా సాఫీగా సాగలేదని మీకు తెలుసు. ఒక్కోసారి తిండి ఉండేది కాదు. ప్రతిదానికీ పోరాడాల్సి వచ్చింది. దానికి ఫలితం ఇలా రావడం ఆ బాధలన్నింటిని మరిపిస్తుంది. అంతా దేవుడి దయ’ అని మిథన్ చక్రవర్తి తనను కలిసిన మీడియాకు చెప్పారు.
అక్టోబర్ 8న నిర్వహించే 70వ జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును మిథున్ చక్రవర్తికి అందిస్తారు. గతంలో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నటి ఆశా పరేఖ్, రాజకీయ నాయకురాలిగా మారిన నటి ఖుష్బు సుందర్, దర్శకుడు విపుల్ అమృత్‌లాల్ షా సభ్యులుగా ఉన్న జ్యూరీ ఈ అవార్డుకు మిథున్ చక్రవర్తిని ఎంపిక చేసింది.
మిథున్ చక్రవర్తి అసలు పేరు గౌరంగ్ చక్రవర్తి. ప్రఖ్యాత పుణె ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో శిక్షణ పొందారు. హిందీతోపాటు, బెంగాలీ సినిమాల్లో నటించారు. మృణాల్‌సేన్ దర్శకత్వంలో 1976లో వచ్చిన మృగయ సినిమాతో ఆయన వెండి తెరకు పరిచయమయ్యారు. తొలి చిత్రంతోనే జాతీయ ఉత్తమనటుడి అవార్డును ఆ చిత్రంలో నటనకు గాను గెలుచుకున్నారు. తహదేర్ కథ (1992)కు ఉత్తమనటుడు, స్వామి వివేకానంద (1998) సినిమాకు గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డుల వచ్చాయి. అయితే.. మిథున్ చక్రవర్తి సినీ ప్రయాణాన్ని 1982లో వచ్చిన సూపర్‌హిట్ మూవీ డిస్కోడ్యాన్సర్ కొత్త శిఖరాలకు తీసుకుపోయింది. అప్పట్లో వస్తున్న కొత్త ఒరవడిని ఒడిసిపట్టుకున్న మిథున్.. డిస్కో డ్యాన్స్‌కు కేరాఫ్‌గా నిలిచారు. ‘ఐయామే డిస్కో డాన్సర్..’, ‘యాద్ ఆరహీమై వంటి పాటలు అప్పట్లో దుమ్మురేపాయి. ఆ సినిమాతో మిథున్‌కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ముఝే ఇన్సాఫ్ చాహియే, హమ్ సే మై జమానా, పసంద్ అప్నీ అప్నీ, ఘన్ ఏక్ మందిర్, కసం పైదా కర్నేవాలేకీ, కమాండో వంటి సినిమాలతో ఆయన దూసుకుపోయారు. 1990లో అగ్నిపథ్ సినిమాలో నాటి బాలీవుడ్ బాద్షా అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించారు. రాజ్యసభ మాజీ సభ్యుడైన మిథున్ చక్రవర్తి.. 2021 పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు.