Pawan Kalyan OG Movie Release Date | పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ షూటింగ్ పూర్తి – సెప్టెంబర్ 25న భారీ విడుదల
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఓజీ’ షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రకటించింది.

⦁ పవర్‌స్టార్ అభిమానులకు శుభవార్త
⦁ పవర్ఫుల్ ఫోజ్‌తో పోస్టర్ విడుదల
⦁ భారీ ప్రి–రిలీజ్ బిజినెస్
Pawan Kalyan OG Movie Release Date | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ వెండితెరపై తన మార్క్ మాస్ యాక్షన్‌తో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. ఆయన ప్రధాన పాత్రలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ఓజీ’ (They Call Him OG) షూటింగ్ పూర్తయిందని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా విడుదల చేసిన పవన్ కళ్యాణ్ మాస్ పోస్టర్ అభిమానుల మనసులను దోచుకుంది. వర్షంలో తడుస్తూ గన్‌తో గంభీరంగా నిలబడిన పవన్ స్టిల్స్ ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి. దర్శకుడు సుజీత్ (సాహో ఫేమ్) తెరకెక్కిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ముంబై నేపథ్యంతో సాగే ఈ సినిమా ఒక సీరియస్ గ్యాంగ్‌స్టర్ జీవితంలోని విభిన్న కోణాలను చూపించనుందని చిత్ర వర్గాలు వెల్లడిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఈ చిత్రంలో ఓ శక్తివంతమైన, మాస్ గ్యాంగ్‌స్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు, ఫస్ట్ గ్లింప్స్ – అన్నీ అభిమానుల్లో భారీ అంచనాలు పెంచాయి. పవన్ కళ్యాణ్ రాజకీయ కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా, సినిమా షూటింగ్‌ల విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ ఎప్పుడో పూర్తి కాగా, తాజాగా మిగిలిన యాక్షన్ సన్నివేశాలతో సహా మొత్తం సినిమా షూటింగ్ పూర్తయిందని మేకర్స్ ప్రకటించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంకా అరుల్ మోహన్ కథానాయికగా నటిస్తోంది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ ఈ సినిమాతో తొలిసారి తెలుగు తెరకు పరిచయం అవుతున్నాడు. విలన్‌గా అతడి పాత్ర సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే ప్రముఖ నటులు ప్రకాష్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్ వంటి వారు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సినిమాటోగ్రఫీకి రవి కె. చంద్రన్, ఎడిటింగ్‌కు నవీన్ నూలి, సంగీతానికి తమన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో ఏర్పడిన భారీ అంచనాలు ప్రీరిలీజ్ బిజినెస్‌లోనూ ప్రతిబింబించాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే థియేటర్ హక్కుల రూపంలో సినిమా రూ.169 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. శాటిలైట్, డిజిటల్, ఓవర్సీస్ హక్కులు కలిపితే ‘ఓజీ’ మూవీ ప్రీరిలీజ్ బిజినెస్ మొత్తం ₹325 కోట్లకు పైగా నమోదైనట్లు సమాచారం. ఇది పవన్ మార్కెట్ స్థాయికి అద్దం పడుతోంది.
విడుదలకు ముందు మరో పవన్ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. జూలై 24న ఆయన ప్రధాన పాత్రలో నటించిన పిరియాడిక్ డ్రామా ‘హరిహర వీరమల్లు’ విడుదల కానుంది. ఆ తర్వాత నెల రోజుల్లోనే ‘ఓజీ’ థియేటర్లలో అడుగుపెట్టనుంది. వరుసగా రెండు చిత్రాలతో పవన్ అభిమానులకు ఇది డబుల్ థమాకా అన్నట్టే. ఈ నేపథ్యంలో ఓజీ చిత్ర బృందం విడుదలకు ముందు మరిన్ని ప్రమోషనల్ మెటీరియల్, ట్రైలర్, పాటలతో ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. ఫ్యాన్స్ మాత్రం ఇప్పటికే సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే చిత్రం అవుతుందని అభిమానుల నమ్మకం. కాగా, ఇదే తేదీన బాలకృష్ణ ‘అఖండ2’ కూడా విడుదలవబోతోందని సమాచారం. ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మెగాస్టార్ మాగ్నమ్ ఓపస్ ‘విశ్వంభర’ కూడా సెప్టెంబర్ 18న గానీ, 25న గానీ రిలీజ్ కానుందని గుసగుసలు. అయితే ఎవరికీ ఇబ్బంది కలుగకుండా విడుదల చేస్తామని విశ్వంభర టీమ్ హామీ ఇచ్చిందట. ఇక బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ ఫైట్ ఖాయమన్న మాట.