Pushpa 3: పుష్ప-3 క‌థ కంచికేనా.?

పుష్ప-2 చివ‌ర్లో కూడా హీరో అవే గుణాల‌తో ఉండ‌టం. ఇప్పటికే బ‌య‌ట ఆ పాత్రకు వ‌చ్చిన చెడ్డపేరును ఇంకా కొన‌సాగించ‌డం ఇష్టం లేక బ‌న్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది అందుకే పుష్ప-3 నిర‌వ‌ధిక వాయిదా.

  • By: Tech    cinema    Jan 08, 2025 10:25 PM IST
Pushpa 3: పుష్ప-3 క‌థ కంచికేనా.?

సినిమా ఎలా ఉంద‌న్నది పక్కన‌పెడితే,  నిర్మాత‌ల ప్రక‌ట‌నల ప్రకారం పుష్ప-2 క‌లెక్షన్ల వ‌ర్షం కురిపిస్తోంది. బాహుబ‌లి రికార్డుల‌ను తిర‌గ‌రాసింద‌ని చెబుతున్నారు. మొద‌టి పార్టు అల్లు అర్జున్‌కు అవార్డు తెచ్చిస్తే, రెండో భాగం డ‌బ్బుల మీద డ‌బ్బులు తెచ్చింది. దీనికి ఇండియాలో ఎవ‌రూ తీసుకోనంత‌గా 300 కోట్లు అర్జున్ తీసుకున్నాడ‌ని ఫోర్బ్స్ ప‌త్రిక ప్రక‌టించింది. కానీ, బ‌న్నీకి ఎంత ఆనందాన్నిచ్చిందో, అంత విషాదాన్ని కూడా ఇచ్చేసింది పుష్ప. పుష్పరాజ్ సినిమాలో జైలుకు వెళ్లక‌పోయినా, నిజ‌జీవితంలో మాత్రం జైలు గోడ‌ల మ‌ధ్య ఎలా ఉంటుందో అనుభ‌వించాడు.

బెనిఫిట్ షో సంద‌ర్భంగా జ‌రిగిన విషాదం అల్లు అర్జున్ జీవితంలో మాయ‌ని మ‌చ్చగా మిగిలిపోయింది. 22 సంవ‌త్సరాలుగా క‌ష్టప‌డి సంపాదించుకున్న పేరు ఒక్కరోజులో పోయింద‌ని ప్రెస్‌మీట్‌లో వాపోయాడు. ఇది నిజ‌మే. గంగోత్రి నుండి పుష్ప వ‌ర‌కు బ‌న్నీ ప్రయాణం క‌ష్టంతో కూడుకున్నదే. కానీ, పుష్ప‌తో జాతీయ అవార్డు వ‌చ్చాక త‌న ప్రవ‌ర్తన పూర్తిగా మారిపోయింది. అహంకారం త‌ల‌కెక్కి, ఎవ‌రినీ లెక్కచేయ‌ని స్థాయికి వెళ్లిపోయాడు. అదే ఈనాటి ఈ స్థితికి కార‌ణం.

పుష్ప మొద‌టి భాగంలో క‌థ క‌న్విన్సింగ్‌గా ఉన్నప్పటికీ, రెండో భాగం పూర్తిగా గాడి త‌ప్పింది. పుష్పరాజ్ డ‌బ్బుల‌ను విసిరేసే విధానం, పొగ‌రుకు జ‌స్టిఫికేష‌న్ లేకుండా పోయింది. దాంతో ఒక గంధ‌పు చెట్ల స్మగ్లర్ క‌థానాయ‌కుడేంటి? అనే వాద‌న‌లు సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా జ‌రిగాయి. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, రాజేంద్రప్రసాద్ లాంటి ప్రముఖ న‌టులు, త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ లాంటి ద‌ర్శకులు ప్రముఖంగానే విమ‌ర్శించారు. సామాజిక బాధ్యత లేకుండా ఇలా ఎలా సినిమా తీస్తారు?  విల‌న్‌ను హీరోగా చూపించ‌డ‌మేమిట‌ని విమ‌ర్శించారు. ఇది కూడా నిజ‌మే. ఎలా చూసినా పుష్ప-2 హిట్ సినిమా అయితే కాదు. డ‌బ్బులు వ‌సూలు చేయ‌డం హిట్‌గా ప‌రిగ‌ణించ‌లేం.

ఇక సంధ్య థియేట‌ర్ ఘ‌ట‌న‌లో రేవ‌తి అనే మ‌హిళ చ‌నిపోవ‌డం, త‌న కొడుకు చావుబ‌తుకుల్లో ఉండ‌టం, ఆ పరిస్థితుల్లో కూడా అర్జున్ స్పందించ‌క‌పోవ‌డం, పోలీసుల వీడియోతో క‌థ మొత్తం అడ్డం తిర‌గ‌డం అల్లు అర్జున్‌ను నిజ‌మైన విల‌న్‌గా మార్చేసింది. ప్రజ‌లు కూడా అస‌హ్యించుకునే స్థాయికి న‌ష్టం జ‌రిగిపోయింది. పోలీస్ కేసు, జైలు, బెయిలు, వారంవారం ఠాణాకు వెళ్లడంలాంటి రౌడీషీట‌ర్ ల‌క్షణాలతో బ‌న్నీలో అంత‌ర్మథ‌నం మొద‌లైంద‌ని స‌మాచారం. దాని ఫ‌లిత‌మే పుష్ప-3ని పట్టాలెక్కించ‌డం కుద‌ర‌ద‌ని ద‌ర్శకుడు సుకుమార్‌కు ఖ‌రాఖండిగా తేల్చిచెప్పిన‌ట్లుగా ఫిలింన‌గ‌ర్ గుస‌గుస‌లు. ఎందుకంటే పుష్ప-2 చివ‌ర్లో కూడా హీరో అవే గుణాల‌తో ఉండ‌టం.

ఇప్పటికే బ‌య‌ట ఆ పాత్రకు వ‌చ్చిన చెడ్డపేరును ఇంకా కొన‌సాగించ‌డం ఇష్టం లేక బ‌న్నీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు పుష్ప క‌న్నా అల వైకుంఠ‌పురంలో.. ఎంతో బెట‌ర్ అని ఫీల‌వుతున్నాడ‌ట‌. పాపం..త‌న‌కు  పుష్ప మానియా కాస్తా పుష్ప ఫోబియాగా మారిపోయింది. అందులోనుండి ఎంత తొంద‌ర‌గా బ‌య‌ట‌ప‌డితే అంత మంచిది అని స్ట్రాంగ్‌గా ఫిక్స్ అయ్యాడ‌ట‌. అందుకే పుష్ప-3 నిర‌వ‌ధిక వాయిదా.  ఇది మంచిదే… ఈ దెబ్బతో అయినా, బ‌న్నీ నేల మీదికి దిగి సినిమా వేరు, జీవితం వేరు అని న‌మ్మితే బాగుంటుంది త‌న‌కే.