#Venky77 | వెంకీ–త్రివిక్రమ్ మూవీ సెట్స్‌ పైకి : 20 నెలల తర్వాత కెమెరా వెనక్కి గురూజీ

విక్టరీ వెంకటేష్‌ హీరోగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్‌ ప్రారంభమైంది. ‘గుంటూరు కారం’ 20 నెలల సుదీర్ఘ విరామం తీసుకున్న త్రివిక్రమ్‌ మళ్లీ కెమెరా వెనక్కి వచ్చారు.

#Venky77 | వెంకీ–త్రివిక్రమ్ మూవీ సెట్స్‌ పైకి : 20 నెలల తర్వాత కెమెరా వెనక్కి గురూజీ

Venkatesh and Trivikram Srinivas begin shooting after 20 months — #Venky77 kicks off

వినోదం డెస్క్‌:
#Venky77 | విక్టరీ వెంకటేష్‌ (Venkatesh) కథానాయకుడిగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ (Trivikram Srinivas) దర్శకత్వంలో ఓ భారీ చిత్రం సెట్స్‌ పైకి వచ్చింది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అక్టోబర్‌ 8న ఈ మూవీ రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది.

20 నెలల సుదీర్ఘ విరామం తర్వాత త్రివిక్రమ్‌ మళ్లీ కెమెరా వెనక్కి వచ్చారు. ఈ సందర్భంగా దర్శకుడు, హీరో కలిసి సెట్స్‌లో దిగిన ఫొటోను నిర్మాత నాగవంశీ సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘‘మాటల మాంత్రికుడు తిరిగి యాక్షన్‌లోకి వచ్చారు. అభిమానుల ప్రియ నటుడు వెంకటేశ్‌తో కలసి ‘ది ఓజీ’స్ ఎంటర్‌టైన్‌మెంట్ మళ్లీ పునరావృతం కానుంది’’ అని పేర్కొన్నారు.

‘గుంటూరు కారం’ తర్వాత త్రివిక్రమ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా వెంకటేశ్‌ కెరీర్‌లో 77వది కావడంతో అభిమానుల్లో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి.

వెంకీ–త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే నవ్వుల పువ్వులు

ఇప్పటి వరకు వెంకటేశ్–త్రివిక్రమ్‌ల కలయికలో మూడు సినిమాలు వచ్చాయి. అయితే వాటికి త్రివిక్రమ్‌ రచయితగా మాత్రమే పనిచేశారు. ‘వాసు’, ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ వంటి సినిమాల కథలు, మాటలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించారు. ఇప్పుడు తొలిసారి త్రివిక్రమ్‌ వెంకటేశ్‌కి దర్శకుడిగా మారడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ముఖ్యంగా ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘మల్లీశ్వరి’ చిత్రాల్లో మాటలు నవ్వుల తూటాలే.

హీరోయిన్లు వీరేనా?

ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు చోటు ఉందని టాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రిష, నిధి అగర్వాల్‌, రుక్మిణీ వసంత్‌ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీరిలో ఎవరు ఫైనల్‌ అవుతారో త్వరలో అధికారికంగా వెల్లడికానుంది.

వెంకీ వరుస ప్రాజెక్టులు

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి వెంకటేశ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘మన శంకర వరప్రసాద్‌ గారు’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. ఇక త్రివిక్రమ్‌ సినిమా తర్వాత ‘దృశ్యం 3’ ప్రాజెక్ట్‌ కూడా లైన్‌లో ఉంది. మలయాళ ‘దృశ్యం 3’ ఈ మధ్యే షూటింగ్​ ప్రారంభించుకుంది.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వెంకటేశ్‌ నటిస్తున్న ఈ కొత్త సినిమా ‘#Venky 77’గా హాట్‌టాపిక్‌గా మారింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2026 వేసవిలో విడుదల అయ్యే అవకాశముంది. త్రివిక్రమ్‌ మాటల మేధస్సు, వెంకీ నేచురల్‌ పెర్ఫార్మెన్స్‌ కలయికతో మరో బ్లాక్‌బస్టర్‌ రాబోతోందనే అంచనాలు ఉన్నాయి. మాటల రచయితగానే వెంకటేశ్​కు మూడు సూపర్​హిట్లిచ్చిన మాంత్రికుడు ఇక దర్శకుడిగా మారితే వేరే చెప్పాలా..?