#SSBM29 Title leak | మహేశ్ – రాజమౌళి పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ టైటిల్ – ఈ రెండింటిలో ఒకటి!
మహేశ్ బాబు–రాజమౌళి సినిమా టైటిల్‌పై సస్పెన్స్ వీడటం లేదు. అయితే పరిశ్రమలోని అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం, టైటిల్ లీకైందట. ఇంతకుముందు అనుకున్న గరుడ తో పాటు ఇంకో శక్తివంతమైన టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. బహుశా ఇదే ఫైనల్ కావచ్చని సమాచారం.

Mahesh Babu–Rajamouli film title leak: ‘Varanasi’ or ‘Garuda’? Big reveal planned with James Cameron
#SSBM29 Title leak | సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా(#SSBM29) గురించి అభిమానుల్లో ఉత్సాహం పీక్స్‌కి చేరింది. షూటింగ్ మొదలయినా, రాజమౌళి నుంచి ఒక్క అధికారిక అప్డేట్ రాకపోవడంతో ఎదురుచూపులు బాగా పెరిగాయి. ఈ లోపు, ఒక విశ్వసనీయ సమాచారం బయటికొచ్చింది. అది ఎస్ఎస్ఎంబీ29 టైటిల్ గురించి. సినిమా టైటిల్ లీక్ అయిందట!
రాజమౌళి–మహేశ్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ఈ పాన్-వరల్డ్ అడ్వెంచర్ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని సమాచారం. మరోవైపు, రాజమౌళి ముందే ఆలోచించిన ‘గరుడ’ టైటిల్ కూడా ఇంకా రేసులోనే ఉందట. రెండు పేర్లూ బలమైన భారతీయ మూలాలు కలిగినవే, కానీ ఏది ఫైనల్ అవుతుందో అనే ఆసక్తి పెరుగుతోంది.
ఫైనల్ కానున్నది.. ‘వారణాసి’..?
‘వారణాసి’ అనే పేరు భారతీయ ఆధ్యాత్మికతకు ప్రతీక. ఆధ్యాత్మికత, చరిత్ర, భక్తి, జ్ఞానం అన్నీ మిళితమైన నగరం పేరు అది. రాజమౌళి సినిమాలు ఎప్పుడూ భారతీయ మూలాలతో అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ అయ్యేలా ఉంటాయి కాబట్టి, వారణాసి ఆయన దృష్టిలో కథకు బాగా సూట్ అవుతుందని భావిస్తున్నారు. అయితే కథేమో మరి జంగిల్ అండ్వెంచర్ అంటున్నారు. దానికీ, వారణాసికి సంబంధమేంటో రాజమౌళికే తెలుసు. మరోవైపు, ‘గరుడ’ అనే టైటిల్ మాత్రం పవర్‌ఫుల్ ఇమేజ్ కలిగినదిగా, మహేశ్ బాబును ఎలివేట్ చేసేలా ఉందని అభిమానులు అంటున్నారు.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రాజమౌళి సినిమాపై హాలీవుడ్ దృష్టి కూడా ఉంది. ఆస్కార్ విజయం తర్వాత ఆయన సినిమాలు అంతర్జాతీయంగా అమితాసక్తిని రేకెత్తిస్తున్నాయి. అటువంటి సమయంలో “వారణాసి” అనే టైటిల్ తీసుకుంటే, అది స్పిరిట్యువల్ అండ్ గ్లోబల్ బ్యాలెన్స్ కలిగిన సబ్జెక్ట్ అవుతుందనేది సినీవర్గాల్లో అంచనా.
సినిమాలో నటీనటుల లైనప్ కూడా అంతర్జాతీయ స్థాయికి తగ్గట్టే ఉంది. హాలీవుడ్‌లో స్థానం సంపాదించిన ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తమిళ స్టార్ ఆర్. మాధవన్, మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. దుర్గా ఆర్ట్స్ పతాకంపై కె. ఎల్. నారాయణ ఈ భారీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తున్నారు. సంగీతం అందిస్తున్నది ఆస్కార్ విజేత ఎం. ఎం. కీరవాణి.
‘ఆర్ఆర్ఆర్’ లాగా ఈ సినిమా కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేక లొకేషన్లలో షూటింగ్ జరుపుకుంటోంది. కథ గ్లోబల్ ట్రావెల్ కాన్సెప్ట్‌తో సాగుతూ, భారతీయ మూలాల నుంచి ప్రారంభమై ప్రపంచ వ్యాప్తంగా విస్తరించబోతుందని సమాచారం. ప్రొడక్షన్ డిజైన్, విజువల్ స్కేల్, యాక్షన్ సీక్వెన్స్ లెవెల్ — అన్నీ హాలీవుడ్ సినిమాలకు దీటుగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట.
టైటిల్ ప్రకటించబోతున్న ‘అవతార్’ జేమ్స్ కామెరూన్
ఇక మరో సెన్సేషనల్ సమాచారం ఏమిటంటే, నవంబర్‌లో భారత్‌కి రానున్న హాలీవుడ్ లెజెండ్ జేమ్స్ కామెరూన్ చేత ఈ సినిమా టైటిల్ విడుదల చేయాలన్నది రాజమౌళి ప్రణాళికగా ఉన్నట్లు తెలిసింది. ‘అవతార్: ది ఫైర్ అండ్ యాష్’ ప్రమోషన్ కోసం ఆయన ఇండియా రానుండగా, అదే వేదికపై ఈ చిత్ర మోషన్ పోస్టర్ కూడా విడుదల చేయాలనే ఆలోచన జరుగుతోందట. అన్నట్లు అవతార్ టైటిల్ కూడా భారతీయమే కదా.
మహేశ్ బాబు కెరీర్‌లో ఇదొక టర్నింగ్ పాయింట్ అవుతుందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఇది ఆయన మొదటి పాన్-వరల్డ్ సినిమా. రాజమౌళి దర్శకత్వం, కీరవాణి సంగీతం, ప్రియాంక చోప్రా గ్లోబల్ అట్రాక్షన్ — ఇవన్నీ కలిపి ఈ సినిమాను అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌గా నిలబెట్టబోతున్నాయి.
ఇప్పుడు అభిమానుల్లో ఒక్కటే సస్పెన్స్ — “రాజమౌళి సినిమా పేరు గరుడ అవుతుందా? లేక వారణాసి అవుతుందా?” దీనికి సమాధానం బహుశా జేమ్స్ కామెరూన్ చేతిలో ఉండొచ్చు!