మహారాష్ట్రలో డెము రైలుకు మంటలు

- అహ్మద్‌నగర్, నారాయణపూర్ మధ్య ఘటన
- మంటలు వ్యాపించక ముందే దూకేసిన ప్రయాణికులు
విధాత: మహారాష్ట్రలో డీజిల్ మల్టిపుల్ యూనిట్ రైలు (DEMU)కు మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన నారాయణదోహ్ అహ్మద్‌నగర్ సెక్షన్ల మధ్య సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో ప్రయాణీకులెవరూ గాయపడలేదని రైల్వే అధికారులు తెలిపారు. మంటలు చెలరేగిన సమయంలో బాధిత కోచ్‌లలో 5 నుంచి 10 మంది ప్రయాణికులు మాత్రమే ఉన్నారని, వారందరూ వెంటనే కిందకు దిగి సురక్షితంగా బయటపడ్డారని సెంట్రల్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ శివరాజ్ మనస్పురే పేర్కొన్నారు.

బీడ్ జిల్లాలోని అష్టి స్టేషన్ నుంచి పశ్చిమ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు వెళ్తున్నప్పుడు మంటలు అంటుకున్నాయి. ఇందుకు కారణాలపై రైల్వే అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు. మంటలు వ్యాపించకముందే రైలులోని ప్రయాణికులందరూ సురక్షితంగా కిందకు దిగారని సెంట్రల్ రైల్వే సీపీఆర్వోవెల్లడించారు. రైలులోని మొత్తం ఎనిమిది బోగీలకు గాను, ఐదు బోగీలకు మంటలు అంటుకున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.